Sugandha Devi: మిద్దె మీద వరి చేను.. ఏడాదికి 45 కేజీల బియ్యం.. వారెవ్వా! | Kerala: Woman Grow Paddy On Terrace Harvest 45 Kilos | Sakshi
Sakshi News home page

Sugandha Devi: మిద్దె మీద వరి చేను.. ఏడాదికి 45 కేజీల బియ్యం.. వారెవ్వా!

Feb 22 2022 12:17 PM | Updated on Feb 22 2022 1:45 PM

Kerala: Woman Grow Paddy On Terrace Harvest 45 Kilos - Sakshi

కేరళ: కుండీల్లో వరి, 45 కేజీల పంట.. బాటిళ్లలో కూడా వరి!

Sugandha Devi: Kerala HomeMaker Grows Paddy On Terrace: మిద్దె పైకి వెళ్దాం పద... కొత్త మాట. ఒకప్పుడు సేద్యం అంటే పొలం అనే భావన.  ఇప్పుడు అది మారింది. టెర్రస్‌ కూడా పంట చేనే అనే ధోరణి పెరిగింది. అయితే ఇన్నాళ్లు కూరగాయలు ఆకుకూరలు మాత్రమే టెర్రస్‌ మీద పండించడం చూశాం. కాని కేరళలోని స్త్రీలు కొందరు మిద్దె మీద ఏకంగా వరే పండించేస్తున్నారు. కుండీల్లో వరి పండి కంకులుగా కోతకు సిద్ధం కావడం విశేషమే.ఆడవాళ్లు ఇప్పుడు ఆధునిక సేద్యవనితలు.

మిద్దె మీద వరి చేను ప్రత్యక్షం కావడం కొంత వింతగానే ఉండొచ్చు. పూల కుండీలు, వంకాయలు, బెండకాయలు మిద్దె తోటల్లో కనిపించడం సాధారణం. కొందరు ఆకుకూరలు, సొరకాయలు, పొట్ల కాయలు కూడా పండిస్తున్నారు. కాని వరిని కూడా మిద్దె మీద పండించవచ్చని కేరళ మహిళలు పదేళ్లుగా నిరూపిస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్‌ మూలంగా ఇళ్లకే పరిమితం కావాల్సి రావడం వల్ల ఈ మిద్దె వరి సేద్యం ఇంకా పెరిగింది.

కుండీల్లో వరి
తిరువంతపురం సమీపంలోని శ్రీకారయంకు చెందిన అంబిక అనే గృహిణి ఐదేళ్ల క్రితం తన టెర్రస్‌ మీద ప్లాస్టిక్‌ కుండీల్లో వరి పండించి అందరి దృష్టినీ ఆకర్షించింది. తన మిద్దె మీద మొత్తం 100 ప్లాస్టిక్‌ కుండీలు పెట్టి వాటిలో సేంద్రియ ఎరువు నింపి, ఒక్కోకుండీలో మూడు నాలుగు వరి మొలకలు నాటి ‘ఉమ’ అనే వరి వంగడాన్ని 110 రోజుల్లో పండించింది.

ఆమె తన పైరు ఎదగడానికి బెల్లం, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆకుపచ్చ కసువు, కోడిగుడ్ల సొనలు కలిపి తయారు చేసిన ‘హృదయామృతం’ అనే ద్రావణాన్ని ఉపయోగించింది. చీడ పీడలకు వేప గింజల పొడిని ఉపయోగించింది. మిద్దె ఎక్కితే వంగిన వరి కంకులతో నిండిన పంట కనపడటం ఎంత ఆనందంగా ఉంటుంది. పైగా అది ఇంట్లో రోజూ తినే బియ్యంగా మారినప్పుడు.

బాటిళ్లలో వరి
ఇది ఇలా ఉంటే కొట్టాయంకు చెందిన సెలెని అనే గృహిణి తన భర్త శామ్‌ జోసఫ్‌ సహకారంతో ఇటీవలి కోవిడ్‌ కాలంలో తన టెర్రస్‌ మీద ఖాళీ వాటర్‌ బాటిల్స్‌లో (లీటర్‌వి) వరి పండించి ఆశ్చర్యపరిచింది. వాడి పడేసిన 175 ఖాళీ లీటర్‌ బాటిల్స్‌ను ఆమె తన వరి సేద్యానికి ఉపయోగించింది. వాటర్‌ బాటిల్స్‌ను సగానికి కోసి మట్టి, పేడలతో నింపి నీరు ఆరకుండా చూస్తూ వరి పండించింది.

ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా చక్కగా ఈ బాటిల్స్‌లోనే ఆమె నాలుగు కేజీల వరిని పండించింది. కాలక్షేపానికి కాలక్షేపం... రెండు రోజులకు సరిపడా అయినవే కావచ్చు... కాని మన బియ్యం మనం తిన్నాం కదా అంటుంది.

45 కేజీల పంట
కొళ్లాంకు చెందిన సుగంధా దేవి మిద్దె మీద వరి పంట పండించడంలో మేటిగా మారింది. ఆమె ఏకంగా ప్రతి సంవత్సరం 40 కిలోల బియ్యం దిగుబడి వచ్చేలా టెర్రస్‌ మీద వరి పండిస్తోంది. పదేళ్ల క్రితం మొదలెట్టిన ఈ పనిలో ఇప్పుడు ఆమె నిష్ణాతురాలిగా మారింది. 56 ఏళ్ల సుగంధా దేవి తన ఇంటి మీదే కాక కూతురి ఇంటి మీద కూడా సేద్యం చేస్తోంది. ‘నేను సంవత్సరానికి ఒకసారి, అదీ వర్షాకాలంలో మాత్రమే వరి పండిస్తాను.

ఎందుకంటే వరికి తేమ జాస్తిగా కావాలని మనకు తెలుసు. అందుకే జూన్‌ నుంచి మొదలెట్టి సెప్టెంబర్‌ మధ్య కాలంలో వరి పండిస్తాను’ అంటోంది సుగంధా దేవి. కేరళలో వ్యవసాయాన్ని, మిద్దె తోటల్ని ప్రోత్సహించేందుకు గ్రామ పంచాయతీల్లో ఎరువు, మట్టి సంచులు అమ్ముతారు సబ్సిడీకి. ప్రతి సంవత్సరం ఈ సంచులు కొని వాటిలోనే వరి పండిస్తుంది సుగంధా దేవి. మిద్దె మీద బల్లలాంటివి ఏర్పాటు చేసి ఆ బల్లల మీద ఈ సంచులను ఉంచి వాటిలోనే వరి నాటి పండిస్తుంది. మిద్దె మీదకు వెళితే దట్టంగా ఎదిగిన వరి కనిపిస్తుంది.

‘120 రోజుల్లో 45 కిలోల వరి పండిస్తాను’ అంటుందామె. మిగిలిన కాలంలో ఆమె తన మిద్దె మీద, కూతురి మిద్దె మీద కూరగాయలు పండిస్తోంది. ‘నేను నా చిన్నప్పటి నుంచి పంట చేలలో పని చేశాను. ఆ అనుభవం వృధా పోలేదు. ఇప్పుడు నేను, నా కూతురి కుటుంబం కల్తీ లేని భోజనం చేస్తున్నాం. ఈ కరోనా కాలంలో మేము ఆరోగ్యం గా ఉన్నామంటే మేము పండించుకునేది తినడం వల్లే’ అంటోందామె.

మట్టి, కలప రజను, పేడను సమ పాళ్లలో కలిపిన మిశ్రమాన్ని ఆమె వరి పండించడానికి వాడుతుంది. పంటకు తేమ పోకుండా ఉండటానికి రోజుకి రెండుసార్లు నీరు స్ప్రే చేస్తుంది. మూడు నాలుగు రోజులకు ఒకసారి వేప నూనెను క్రిమి సంహారకంగా ఉపయోగిస్తుంది. ‘మా బియ్యం ఎవరికీ అమ్మం. కాని ఒక కేజీ రెండు కేజీలైనా ఇమ్మని వారూ వీరూ అడుగుతుంటారు. ఒక్కోసారి ఇస్తాం’ అంటుందామె గర్వంగా.

సుగంధాదేవికి ఇటీవలే ఆమె ఊరి పంచాయతీ ‘ఉత్తమ రైతు’ పురస్కారం ఇచ్చింది. ఒకప్పుడు వడియాలు, బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే టెర్రస్‌ను ఉపయోగించే మహిళలు ఇవాళ ఆ చోటును ఆకుపచ్చగా మారుస్తున్నారు. వరినే మిద్దెకు ఎక్కిస్తున్నారు. శభాష్‌.

చదవండి: Guntur: భారీ స్ప్రేయర్‌.. 10 గంటల్లో 100 ఎకరాలు పూర్తి.. పెట్రోలు ఖర్చు రూ. 300 లోపే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement