Guntur: భారీ స్ప్రేయర్‌.. 10 గంటల్లో 100 ఎకరాలు పూర్తి.. పెట్రోలు ఖర్చు రూ. 300 లోపే

Sagubadi: Guntur Farmer Tractor Mounted Sprayer 100 Acres In 10 Hours - Sakshi

చక చకా పిచికారీ!

గంటకు పదెకరాల్లో పిచికారీ చేసే భారీ స్ప్రేయర్‌

పది గంటల్లో వందెకరాలు పూర్తి.. పెట్రోలు ఖర్చు రూ. 300 లోపే  

ఆవిష్కరించిన అమృతలూరు రైతు రామకృష్ణ 

రైతును మించిన శాస్త్రవేత్త లేడంటారు... వినూత్న ఆలోచనలకు, ఆవిష్కరణలకు చదువుతో పనిలేదు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండల కేంద్రం అమృతలూరు రైతు మల్లెపెద్ది రామకృష్ణ ఇందుకో నిదర్శనం. ఇంటర్‌ చదువుకొని వ్యవసాయంలో స్థిరపడ్డారు.

పురుగుమందు పిచికారీలో సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ట్రాక్టర్‌ మౌంటెడ్‌ స్పేయర్‌ను సొంత ఆలోచనతో పెద్ద రైతుగా తన అవసరాల మేరకు తయారు చేసుకొని వాడుతున్నారు. ఈ ఆవిష్కరణతో గంటకు 10 ఎకరాల చొప్పున, కేవలం 10 గంటల్లో తన వందెకరాల పైరుకు మందు పిచికారీని పూర్తి చేస్తుండటం విశేషం. 

మాగాణి భూమిలో ఖరీఫ్‌లో వరి తర్వాత రెండో పంటగా వంద ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నారు రామకృష్ణ. ఈ పంటకు తెగుళ్ల బెడద ఎక్కువ. సాధారణ పవర్‌ స్ప్రేయర్‌తో ముగ్గురు, నలుగురితో మందు పిచికారీ చేయించినా, కనీసం అయిదు రోజులు వ్యవధి పట్టేది. స్ప్రేయింగ్‌ చేయటానికి, ట్యాంకుల్లో నీళ్లు కలిపే వారితో సహా కూలీ ఖర్చులు హీనపక్షం రూ.లక్ష తప్పనిసరి.

మరూకా పురుగు ఆశిస్తే వెంటనే చేను మొత్తం పిచికారీ చేయాలి. ఇక్కడ ఒకవైపు నుంచి రెండోవైపునకు పని పూర్తి చేసే సరికి కొన్ని రోజులు పట్టేది. ఆలోగా ఆవైపు చేనును పురుగు తినేసేది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏమిటా అనే మథనంలోంచి పెద్ద రైతులకు ఉపయోగపడే ఈ వినూత్నమైన భారీ మౌంటెడ్‌ స్ప్రేయర్‌ పుట్టుకొచ్చింది.
1800 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ భారీ స్ప్రేయర్‌తో గంటకు పదెకరాల్లో పురుగుమందును ప్రస్తుత రబీలోనే తొలిసారి పిచికారీ చేస్తున్నారు రామకృష్ణ.

ఆవిధంగా వందెకరాల పొలంలో 10 గంటల్లోనే పిచికారీ పూర్తిచేస్తున్నారు. ఎటొచ్చినా 50 అడుగుల దూరంలో వానజల్లులా మొక్క మొత్తం పూర్తిగా తడుపుతున్నారు. పదెకరాలకు 1800 లీటర్ల చొప్పున వందెకరాలకు 18 వేల లీటర్ల నీటి పిచికారీతో పనిలో పనిగా.. పొలానికి అవసరమైన నీటితడి కూడా సమకూరుతోంది. ఇప్పుడా వందెకరాల్లోని మినుము పైరు కేవలం 45 రోజుల వయసులోనే ఏపుగా పెరిగి భారీ దిగుబడులకు భరోసానిస్తోంది.  సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే పెద్ద రైతులక్కూడా ఈ భారీ స్ప్రేయర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.   

2.5 లీ. పెట్రోలుతో వందెకరాల్లో పిచికారీ
ట్రాక్టరుకు వెనుక వైపు 650 లీటర్ల చొప్పున సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు ఒకదానిపై ఒకటి బిగించారు. ముందుభాగంలో 500 లీటర్ల సింటెక్స్‌ ట్యాంకును అమర్చారు. అంటే మొత్తం 1800 లీటర్లు. 5 హెచ్‌పీ మోటారు, మరో వైపర్‌ మోటారును బిగించారు. వీటన్నిటినీ ట్యాంకులకు అనుసంధానం చేశారు. మోటారు ఆన్‌ చేయగానే వైపర్‌ మోటారు తిరుగుతుంది. వెనుకభాగంలో రెండువైపులా గల వైపర్స్‌ తిరుగుతూ వీటి చివర గల నాజిల్స్‌లోంచి మందు పిచికారీ అవుతుంది.

ట్రాక్టరు తిరిగేందుకు అనువుగా విత్తనాలు చల్లేటపుడే దారులు సిద్ధం చేసుకున్నారు. ఈ భారీ స్ప్రేయర్‌కు కావాల్సిన ఒక్కో పరికరాన్ని ఒక్కోచోట నుంచి సమకూర్చుకున్నట్టు రామకృష్ణ చెప్పారు. ఇందుకు రూ.1.50 లక్షల ఖర్చయ్యిందన్నారు. మోటార్లకు కావాల్సిన పెట్రోలు ట్యాంకులో సామర్థ్యం ముప్పాతిక లీటరు మాత్రమే. కేవలం రెండున్నర లీటర్ల పెట్రోలుతో వంద ఎకరాల్లో మందు పిచికారీకి సరిపోతోంది. అంటే ప్రెటోలు ఖర్చు రూ.300 లోపే. ఈ రకంగా రామకృష్ణ వినూత్న ఆవిష్కరణతో తన సమస్యను అధిగమించటమే కాకుండా, తన స్ప్రేయర్‌ను  తోటి రైతులకూ అద్దెకు ఇస్తూ వారి ఖర్చునూ తగ్గిస్తున్నారు రామకృష్ణ (99595 95060).  

– బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి 

చదవండి: రైతు ఆదాయం పెంచే పట్టు యంత్రం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top