
వివిధ పట్టణాల్లో దుకాణాల ఏర్పాటు
అన్ని సీజన్లలో పొడుల విక్రయం
ఎగబడి కొంటున్న వినియోగదారులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ అనే చిన్న పట్టణం కారంపొడికి చిరునామాగా నిలుస్తోంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లన్నీ ధర్మాబాద్ మీదుగానే నడుస్తాయి. బాసర దాటగానే ధర్మాబాద్ వస్తుంది. అక్కడ లభించే మిరపకాయల నాణ్యత బాగుంటుందన్న పేరు రావడంతో.. చాలామంది రైళ్లలో ధర్మాబాద్ వెళ్లి కిలోల కొద్దీ తెచ్చుకునేవారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, నిర్మల్ తదితర జిల్లాల నుంచి చాలామంది మహిళలు వెళ్లేవారు. నాణ్యమైన మిరపకాయలు కొనుగోలు చేసి, అక్కడే గిర్నీ పట్టించుకుని కారంపొడి ముల్లెలతో తిరిగి వచ్చేవారు. కాగా, మూడు నాలుగేళ్లుగా కొందరు ధర్మాబాద్ కారంపొడి పేరుతో తెలంగాణ ప్రాంతంలోని వివిధ పట్టణాలు, మండలాల్లో దుకాణాలను తెరిచారు. పట్టణ శివార్లలో ప్రధాన రహదారుల పక్కన షెడ్లను నిర్మించి గిర్నీలు ఏర్పాటు చేసుకుని అక్కడే విక్రయిస్తున్నారు. మిర్చి ధర్మాబాద్ నుంచే వస్తుందని చెబుతూ అమ్మకాలు సాగిస్తున్నారు.
ధర్మాబాద్ కారంపొడికి డిమాండ్
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, నిర్మల్ తదితర పట్టణాల్లో ధర్మాబాద్ కారం పొడి దుకాణాలు వెలిశాయి. పలు మండల కేంద్రాలలోనూ దుకాణాలను ఏర్పాటు చేసి మిరపపొడి అమ్ముతున్నారు. కారంపొడి గిర్నీలు, దుకాణాలన్నింటికీ ధర్మాబాద్ కారంపొడి అన్న బోర్డే ఉంటోంది. ప్రజలు కూడా ధర్మాబాద్ అన్న పేరుంటే చాలు వెళ్లి తెచ్చుకుంటున్నారు.
ధరల వివరాలు
నాణ్యమైన రకం కిలో కారం పొడిని రూ.300కు విక్రయిస్తున్నారు. రెండో రకం రూ.280, మామూలు రకం, ఉప్పు కలిపిన కారంపొడి కిలో రూ.250కు అమ్ముతున్నారు. దుకాణాలు, గిర్నీలు ఏర్పాటు చేసిన వారిలో.. కొందరు ధర్మాబాద్ నుంచి వచి్చన వ్యాపారులు ఉండగా, మరికొందరు స్థానిక వ్యాపారులు ఉన్నారు.
రూ.లక్షల్లో వ్యాపారం..
కారంపొడి అమ్మకాలు పెద్దఎత్తున నడుస్తున్నాయి. మొన్నటి వరకు మామిడి తొక్కుల సీజన్ నడిచింది. ఆ సీజన్‌లో టన్నుల కొద్దీ కారంపొడి అమ్మకాలు సాగాయి. ధర్మాబాద్ కారంపొడి అనగానే జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మిర్చి ఎక్కడి నుంచి వస్తుందో తెలియకున్నా.. ధర్మాబాద్ బ్రాండ్‌తో అమ్మకాలు భారీ ఎత్తున నడుస్తున్నాయి. సీజన్‌లో అయితే ఒక్కొక్క దుకాణంలో రూ.లక్షల్లో వ్యాపారం నడుస్తోందని సమాచారం.