
ప్రేమలో యేసు కనబరచిన నైపుణ్యం అసాధారణం. ఆయన ప్రేమ తిరుగులేనిది. అది ఎన్నడూ అపజయం ఎరుగదు. ప్రమాదాలను పసికట్టి ఆహ్వానిస్తూ సృజనాత్మకంగా సాహసించడం ఎలాగో అనగా ఉన్నతంగా వైవిధ్యంగా ప్రేమించడం అనేది యేసు వద్దనే మనం నేర్చుకోగలుగుతాము. ఆత్మ సంబంధ ప్రేమ పాఠాలు యేసు వద్ద నేర్చుకొంటేనే పరమార్థం దిశలో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలిగే ప్రేమకళలో మెరుగ్గా రాణించ గలుగుతాము.
‘నేను నిన్ను ప్రేమించడం కల’ అంది ఆమె కోపంగా అరుస్తూ.
‘ప్రేమించడం ఒక కళ ’ అన్నాడు అతను నింపాదిగా నవ్వుతూ.
అతనిలోని నిండైన ఆత్మ విశ్వాసాన్ని ఆమె గమనించలేదు. నిర్లక్ష్యంగా చిన్న చూపు చూసింది.
కట్ చేస్తే–
తనదైన ప్రేమతో ఆమె కళ్ళు తెరిపించాడు. ఇంకేముంది?! ‘నిన్ను ప్రేమించకుండా ఇక నేను ఉండలేను’ అంది. అతడి సానుకూల శక్తి, ప్రేమ, వ్యూహాలకు ఆమె తలవంచక తప్పలేదు. నా కలలో కూడా నిన్ను ప్రేమించను అందామె. నా కలలో కూడా ఇది జరగదంటివే అన్న ఆమె తిరస్కృతిని సవాలుగా స్వీకరించి విధేయతతోనే అతడు అరితేరిన నిశ్శబ్ద విజయుడయ్యాడు.
అపజయాల పాలిట అనుకూలంగా స్పందించేలా ఇలా ఆరోజే ఆత్మ సంబంధ ప్రేమికులకు సరికొత్త బాట సిద్ధం చేసి ఏర్పరిచాడు. తలవంచిన వినమ్రతతోనే తప్ప అననుకూల ఆలోచనలు, శరీర భాష ద్వారా అవి బయటపడే చేష్టలతో ప్రేమను సాధించడం అసాధ్యం. ∙∙
పైన ‘అతడు’గా చెప్పబడిన ఆయన పేరు ‘యేసు క్రీస్తు’. ‘ఆమె’ పేరు సర్వ మానవాళిగా చెప్పబడే ‘సంఘమనే స్త్రీమూర్తి’. ప్రేమలోని తెగువ ప్రదర్శన మానవాళిని అలరిస్తుంది. ‘వధువు సంఘము’ అనే తన ప్రియురాలిని అమితంగా ప్రేమించి ఆమె కోసం బాహటంగా చేతులు చాచి అసాధారణ రీతిలో ఆయన చేసిన కంటికింపైన చేతలపరమైన దృశ్య ప్రధాన సాహసాలు కడు రమణీయం.
చదవండి: మాన్పించబోయి బానిసనై పోయా! హాఫ్ బాటిల్ సరిపోవడం లేదు ఇద్దరికీ
వారపు ప్రప్రథమ దినమైన ఆదివారపు ఆరాధనలో, మరీ ముఖ్యంగా ఆరాధన ముగిశాక ఎక్కడ పడితే అక్కడ ఇదే చర్చ జరుగుతుంటుంది. యేసు సిలువ ప్రేమ గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే, యేసు ప్రేమించే కళకు ప్రాణం పోసి చరిత్ర కెక్కాడు. యేసు ప్రేమగాథ మరణంతో ముగించబడలేదు. ఈ యావత్ విశ్వంలోనే దీన్ని మించిన విజయ ప్రేమగాధ మరొకటి ఎక్కడా మనకు కనబడదు.
తనదే సరియైన మార్గం అనునదే క్రీస్తు వైవిధ్య బోధనావిధానం. నిజమే, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మన అజ్ఞానం గూర్చి ఆయనకు బాగా తెలుసు. మనం కాదు అంటే ఆయన ఔను అంటాడు. మనం ఔను అంటే ఆయన కాదు అనగల సమర్థుడు. ఎందుకంటే ఆయన భవిష్యత్ ఎరిగినవాడు గనుక! ఊహించని రీతులలో ఆయన ప్రేమ ఎప్పుడూ మనలను కట్టిపడేస్తుంటుంది. ఏవిధంగానైనా మనలను ఒప్పించి తన దారికి తెచ్చుకోవడానికి ఆయన ఎంతకైనా తెగిస్తాడు అన్న ఆయన సమర్థతే సిలువ ప్రేమ. మన మనో నేత్రాలు వెలిగించబడి ఈ వాస్తవం తెలిశాక మనం ఔను అన్న మాటతో పాటు మేము నిన్ను ప్రేమించకుండా ఇక ఉండలేము అని చెప్పక తప్పని పరిస్థితి మనదే. – జేతమ్