
నా వయస్సు 38. మా ఆయన పెద్ద బిజినెస్ మేన్. అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. కానీ నేను ఎవరికీ చెప్పుకోలేని ఒక విష వలయంలో ఇరుక్కు΄ోయాను. మావారికి మొదటి నుంచి ‘డ్రింక్ అలవాటుంది. ఆయన చేత ఆ అలవాటు మార్పించాలని ఎంతో ప్రయత్నించాను. ‘బిజినెస్‌లో ఇలాంటివి తప్పవు. నాకోసం తాగక పోయినా, కంపెనీ కోసం తప్పదు’ అని నా నోరు మూయించేవారు. పోనుపోను పగలు కూడా మందు పుచ్చుకుని ఆఫీసుకు పోవడం మొదలు పెట్టారు. ఎప్పుడూ ఫ్రెండ్స్, బిజినెస్ మీటింగ్స్, కేంప్స్ అని, ఏ తెల్లవారు జామునో ఇంటికి ఒళ్ళు తెలియని స్థితిలో వచ్చేవారు. బయట తాగొద్దు, అంతగా తాగాలని ఉంటే ఇంట్లోనే తీసుకోమని అంటే ఆయన నేను కూడా కంపెనీ ఇస్తే అలాగే చేస్తానన్నారు. ఆయన్ను కాపాడుకోవాలనే ఆరాటంలో రోజూ రాత్రి ఆయనతోపాటు కూర్చుని ఒక స్పూన్ విస్కీలో, ఒక బాటిల్ సోడా కలుపుకుని కంపెనీ ఇచ్చేదాన్ని. నేను, నాకు తెలియకుండానే ఆయనతో సమానంగా డ్రింక్ తీసుకునే స్థాయికి వెళ్ళాను. ఒక హాఫ్ బాటిల్ ఒక రాత్రికి మా ఇద్దరికి సరిపోడం లేదు. చివరకు ఆయన ఊర్లో లేక΄ోయినా, నేనొక్కదాన్నే ఇంట్లో తాగే పరిస్థితికి వచ్చాను. పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నారు. ఇప్పటి వరకూ వారి కంటపడకుండా నెట్టుకుంటూ వచ్చాను. రేపు వారికి వారి తల్లి తాగుబోతని తెలిస్తే నా గతేమిటి! నేను ఈ వ్యసనం నుంచి బయట పడే మార్గం చెప్పండి. – శకుంతల, విశాఖపట్నం
నిర్భయంగా మీ సమస్యను బయటపెట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. విస్కీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మీవారిని రక్షించే దానికి మీ చేతినందించి, ఆయన్ను బయటకు లాగబోయి చివరకు మీరు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. సరదా కోసం డ్రింక్ మొదలు పెట్టి అది ఒక సమస్యగా మారేవారు కొందరైతే, సహాయం చేసి మాన్పిద్దామని అందులో దిగి, ఇంకో కొత్తసమస్యను మీరు కొని తెచ్చుకున్నారు. ఒకసారి రుచి మరిగితే, నరనరాలు దానికోసం పరితపించి తనకు బానిసగా మార్చుకునే శక్తి ఉంది మద్యానికి. ఇంటికి పెద్ద దిక్కయిన మీరిద్దరూ ఈ వ్యసనానికి బానిసలయితే, చివరకు ఈ పరిస్థితి ఎటు వెళ్తుందో ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో చెప్పలేము. ఆయన్ని మాన్పించడమేమో గాని, ముందు మీరు దీంట్లోంచి బయట పడటం, మీకుటుంబ శ్రేయస్సు దృష్ట్యా చాలా అవసరం. మీకు సిన్సియర్‌గా మారాలని ఉంటే తప్పకుండా మీ అలవాటును మాన్పించవచ్చు.
చదవండి: ఇదీ చదవండి:చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!
ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మద్యం అలవాటు మాన్పించేందుకు పవర్‌ఫుల్ మందులు, ఇతర మానసిక చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ‘తాగాలి’అనే తపన తగ్గించేందుకు ‘యాంటి క్రేవింగ్ మెడిసిన్స్ మద్యం పైన అవర్షన్ కల్గించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులు, ఈ అలవాటు నుండి బయటపడేందుకు అద్భుతంగా పని చేస్తున్నాయి. మీరు హాస్పిటల్లో సుమారు 2–3 వారాలు ఉండాల్సి వస్తుంది. మీ వారికి నచ్చచెప్పి మీరు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కండి. మీరు మారితే మిమ్మల్ని చూసి ఆయన కూడా వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడవచ్చు. మీరే మానేస్తే ఆయన్ను బలవంతంగానైనా ఒప్పించేందుకు మీకు నైతిక బలం వస్తుంది. మీరు వెంటనే సైకియాట్రిస్ట్‌ని కలిసి మీ సమస్యను వివరించండి. మీ సమస్యను కాన్ఫిడెన్షియల్‌గా ఉంచి సరియైన వైద్యం చేస్తారు. ఆల్ ది బెస్ట్
ఇదీ చదవండి: నో అన్న గూగుల్‌లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com