సంక్రాంతి సీజన్‌లో ఏరులై పారిన మద్యం
టీడీపీ మద్యం సిండికేట్‌కు పండుగ
రూ.1,797.57 కోట్ల మద్యం అమ్మకాలు
గతేడాది కంటే రూ.266.39 కోట్లు అధికం
విక్రయాల్లో తిరుపతి జిల్లా టాప్ తర్వాత స్థానాల్లో విశాఖ, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి సీజన్‌లో టీడీపీ మద్యం సిండికేట్ పండుగ చేసుకుంది. మూడు బీర్లు.. ఆరు నిబ్బులుగా మద్యాన్ని ఏరులై పారించింది. ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లతోపాటు 75 వేలకుపైగా బెల్ట్ దుకాణాలు, కోడి పందేల బరులు, మట్కా జూదాల డెన్‌లు, బీచ్‌లు, వీధి వాడా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు నెలకొల్పి యథేచ్ఛగా దందాకు తెగబడింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తుండిపోయింది. ఫలితం.. మద్యం అమ్మకాల్లో చంద్రబాబు సర్కారు కొత్త రికార్డులు సృష్టించింది. టీడీపీ మద్యం సిండికేట్ అడ్డగోలు దోపిడీని మరోసారి చాటిచెప్పిన మద్యం అమ్మకాల తీరు ఇలా ఉంది...
రూ.3 వేల కోట్ల దిశగా..
సంక్రాంతి సీజన్‌లో మద్యం అమ్మకాల్లో ఏపీ కొత్త రికార్డులు సృష్టించింది. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి 17 వరకు రాష్ట్రంలో ఏకంగా రూ.1,797.57 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించడం గమనార్హం. మొత్తం 24.64 లక్షల మద్యం కేసులు, 11.36 లక్షల బీరు కేసులు విక్రయించారు. గతేడాది సంక్రాంతి సీజన్ సందర్భంగా జనవరి 1 నుంచి 17 మధ్య రూ.1,531.18 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మరో రూ.266.39 కోట్ల మేర అధికంగా మద్యం విక్రయాలు సాగాయి. ఇక ఈ నెలాఖరుకు మద్యం విక్రయాలు రూ.3 వేల కోట్ల మార్కును దాటుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
టాప్‌లో తిరుపతి జిల్లా
సంక్రాంతి సీజన్ మద్యం విక్రయాల్లో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా రూ.111.97 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. తరువాత స్థానాల్లో రూ.108.17 కోట్ల విక్రయాలతో విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. రూ.97.43 కోట్ల మద్యం విక్రయాలతో ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా మూడో స్థానంలో, రూ.91.91 కోట్ల అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా నాలుగో స్థానంలో ఉన్నాయి.


