చిలుకలు మాట్లాడతాయని విన్నాం. చిలుకలు మాట్లాడటం కూడా మనలో కొందరు నేరుగా వినే ఉంటారు. అయితే ఒక చిలుక ఉంది. ‘ఉంది’ కాదు. ‘ఉండేది’! ఆ చిలుక ఒక పక్షి శాస్త్రవేత్త ఇంట్లోని ల్యాబ్‌లో ఉండేది. ఒకరోజు చిలక్కి, ఆ పక్షి శాస్త్రవేత్తకీ మాటా మాటా వచ్చింది. చిలుక చికాకును ప్రదర్శించింది. అందుకు ఆ శాస్త్రవేత్త హర్ట్ అయ్యారు. వెంటనే ఆ చిలుక, ‘‘క్షమించండి’’ అంది. నిజానికి చిలుక తప్పేం లేదు. చిలుక అరటి పండు అడిగితే,
ఆ శాస్త్రవేత్త ఏవో గింజల్ని పెట్టారు. చిలుక మౌనంగా ఉంది. ‘‘ఊ, ఇదుగో అరటిపండు. తినూ..’’ అని మళ్లీ గింజల్నే పెట్టి, ఆ చిలుకను మోసం చేసే ప్రయత్నం చేశారు ఆ శాస్త్రవేత్త! చిలుక కోపంగా ఆ గింజల్ని శాస్త్రవేత్తపై విసిరికొట్టింది. చికాకును ప్రదర్శించింది. వెంటనే ‘సారీ’ కూడా చెప్పేసింది! నిజంగా చిలుకలకు ఇన్ని తెలివితేటలు ఉంటాయా? తెలివితేటలదేముందీ... ఎన్నైనా ఉండొచ్చు. వాటిని ప్రదర్శించటానికి ఈ మూగ జీవులకు మాటలెలా వస్తాయన్నదే ఆశ్చర్యం. ఆ చిలుక పేరు అలెక్స్, ఆ శాస్త్రవేత్త పేరు ఐరీన్ పెప్పర్‌బర్గ్(Irene Pepperberg).
మాటలేనా, భాషలు కూడా!
బ్రిటన్‌లో 2010లో ఒక పెంపుడు చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అది మాట్లాడే చిలుక. తన యజమాని మాట్లాడుతుండే బ్రిటిష్ యాసను చక్కగా అనుకరిస్తూ ఉండేది. చిలుక ఎగిరిపోయినందుకు ఆ యజమాని చాలా బాధపడి పోయాడు. తిరిగి నాలుగేళ్ల తర్వాత ఆ చిలుక, యజమాని కలుసుకున్నారు! అయితే చిలుక తన యజమాని మాట్లాడే బ్రిటిష్ భాషను మర్చిపోయింది. బదులుగా స్పానిష్ భాషను మాట్లాడుతోంది! అంటే చిలుకలు మాట్లాడటమే కాకుండా, భాషలు కూడా నేర్చుకుంటాయా? అవును!!
మైనాలూ అచ్చు గుద్దేస్తాయి
పక్షి జాతిలో మనిషి భాషను అద్భుతంగా అనుకరించేవి చిలుకలతో పాటుగా మరికొన్ని కూడా ఉన్నాయి. (బాక్సులలో చూడండి) మనుషుల మాటల్నే కాక, ఇతర శబ్దాలను కూడా గొంతులోంచి అవి అచ్చు గుద్దేయగలవు! వాటిల్లో ప్రధానమైనవి మైనాలు. మైనాల్లో కూడా ముఖ్యంగా ‘కామన్ హిల్’ జాతి మైనాలు మనుషుల స్వర స్థాయులలోని హెచ్చు తగ్గుల్ని పట్టేసి మాట్లాడేయగలవు. స్పష్టత కూడా ఏం తగ్గదు! దక్షిణాసియా, ఆగ్నేయాసియా కొండ ప్రాంతాలు ఈ మైనాల జన్మస్థలాలు. అండమాన్, నికోబార్ దీవులు, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో మైనాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇండియాలో మరీ అంత విస్తారంగా కనిపించవు కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రపక్షి ఈ‘మైనా’నే. ఇంకా.. స్టార్లింగ్ పక్షులు (ఐరోపా); కాకి జాతిలోని – కోర్విడ్స్, ఆవెన్స్, మేగ్పీస్ (ఆస్ట్రేలియా); జేస్ (బ్రిటన్, కెనడా); లైర్‌బర్డ్స్, మాకింగ్ బర్డ్స్ (అమెరికా, మెక్సికో); టూయ్ (తేనె భక్షించే న్యూజీలండ్ పక్షి), కానరీ పక్షులు (స్పెయిన్).. మనిషి మాటలనే కాదు.. అలారాలు, ఫోన్ రింగ్‌టోన్‌లు, వివిధ రకాల యంత్రాల ధ్వనులను వాటికవి, మంచి మూడ్‌లో చక్కగా మిమిక్రీ చేస్తాయి! ఇదెలా సాధ్యం?!
యునీక్ సిరింగ్స్ అనాటమీ
మాట్లాడే పక్షుల గొంతులోనూ మానవ స్వరాల్లా గమకాలు పలకటానికి ఉన్న సదుపాయం ఏంటంటే.. వాటి శ్వాసనాళ నిర్మాణంలోని ‘యునీక్ సిరింగ్స్ అనాటమీ’! పక్షులకు పెదవులు, దంతాలు ఉండవు. అవి ఉంటేనే కదా, మనకైనా గొంతులోంచి, నోట్లోంచి ధ్వని వెలువడుతుంది. అయితే ఈ మాట్లాడే పక్షుల్లో పెదవులు, దంతాలకు బదులుగా, వాటి శ్వాసనాళం దిగువన ఉండే ‘సిరింక్స్’ అనే స్వరనాళాలు మాట్లాడేందుకు వీలు కల్పిస్తాయి. మనుషులకు స్వరపేటిక ఎలాగో, పక్షులకు స్వరనాళాలు అలాగ!
మాటలకు అవసరమైన స్వర తంతువులు మనుషుల్లో వారి ‘లారింక్స్’ (స్వరపేటిక)లో ఉంటే, పక్షుల్లో వాటి ‘సిరింక్స్’ (స్వర నాళాలు)లో ఉంటాయి. మనుషుల స్వర పేటికలోని స్వర తంతువుల మాదిరిగా కాకుండా, పక్షులు శబ్దాలను సృష్టించటానికి తమ ‘సిరింక్స్’లోని మృదువైన కండరాలను నియంత్రించుకుంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఏర్పాటు – పక్షులు భిన్నమైన శరీర నిర్మాణం కలిగి ఉన్నప్పటికీ – శక్తిమంతమైన, వైవిధ్యభరితమైన గాత్రధ్వనులను జనియింపజేయటానికి వీలు కల్పిస్తుంది.
వేగవంతమైన పిచ్ స్విచింగ్
ఉత్తర అమెరికాలో ‘కార్డినల్’ అనే పక్షి, మాటల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిందా అనిపిస్తుంది! చిలుకల జాతికి ‘చెందని’ ఈ పక్షిలోని సిరింక్స్.. వేగవంతమైన, సంక్లిష్టమైన శబ్దాలను ఉత్పత్తి చేయటానికి వీలు కల్పిస్తుంది.
పియానో స్వరాల కంటే కూడా ఎక్కువగా, సెకనులో పదో వంతు లోపు ఈ పక్షులు తమ గొంతును సజావుగా మార్చుకోగలవని పక్షి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటికున్న ఆకట్టుకునే స్వర నియంత్రణ – అధునాతన ధ్వని ఉత్పత్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా – వాటిని అప్పటికప్పుడు శబ్దాలను ఉత్పత్తి చేయటానికి అనుమతిస్తుంది.
నాలుకలోనే నైపుణ్యమంతా!
చిలుకలు తమ నాలుకలను ముందుకు, వెనుకకు కదిలించడం ద్వారా; ముక్కును తెరిచి, మూయటం ద్వారా శబ్దాలను మలచుకుంటాయి. మనుషుల మాటల్ని కూడా ఇదే విధంగా అనుకరిస్తాయి. చిలుకలకు పెదవులు లేనప్పటికీ భాషలోని అచ్చులను, హల్లులను పలకటానికి మానవులు చేసే విధంగా అవి తమ నాలుకలను ప్రత్యేక నైపుణ్యంతో ఉపయోగిస్తాయి.
ఈ నైపుణ్యం చిలుకలు, ఇతర మాట్లాడే పక్షులలో అసాధారణమైన స్పష్టతకు, మనుషుల్ని అనుకరించటానికి సహాయ పడుతుంది. చిలుకలు, మరికొన్ని జాతుల పక్షులు మాత్రమే మనుషుల మాటల్ని అనుకరించటానికి కారణం.. మిగతా పక్షుల్లో ఈ విధమైన స్వర నిర్మాణాలు లేకపోవటమే.
కలుపుగోలు పలుకులు
చిలుకల్లో ప్రకృతి సిద్ధమైన ‘సంభాషణ స్వభావం’ ఉంటుంది. అడవిలో అవి తమ జాతి గుంపులతో బలమైన బంధాలను ఏర్పచుకుంటాయి. ఆ సహజ స్వభావం వల్లనే పంజరాలలో బందీలుగా ఉన్న చిలుకలు కూడా తమ మానవ సహచరులతో బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాయి. మాటా మాటా కలుపుతాయి. మనుషుల మాటల్నే తిరిగి పలుకుతాయి.
అన్నవాహిక హెల్ప్ చేస్తుంది
మనిషి భాష మాట్లాడటం పక్షులకు అంత తేలికైన పనేమీ కాదు. భాషలో మనకు అచ్చులు, ఉచ్చారణ విధానాలు ఉంటాయి. కొన్నిసార్లు పలకటానికి కొరుకుడు పడని ఉచ్చారణలూ ఉంటాయి. అయితే ఈ ఇబ్బందిని చిలుకలు తమ స్వర మార్గాన్ని మార్చుకోవటం ద్వారా పలుకులో స్పష్టతను సాధిస్తాయి. చిలుకల్లో పెదవులు లేని లోటును తీర్చి, ఉచ్చారణ అడ్డంకులను తొలగించేందుకు, శబ్దాన్ని నోటి ద్వారా బయటికి పంపించటానికి వాటి అన్నవాహిక తోడ్పడుతుంది. అచ్చుల కోసం, అవి తమ నాలుకలను కదిలిస్తాయి. కచ్చితమైన శబ్దాలను బయల్పరచటానికి తమ ముక్కును సర్దుబాటు చేసుకుంటాయి.
పాటల పక్షులకు భిన్నంగా..!
చిలుకల మెదడులోని నాడీ మండల విద్యుత్ ప్రవాహాలు ప్రత్యేకమైనవిగా ఉన్నందు వల్ల అవి మానవ భాషను వినగలుగుతాయి. గుర్తుపెట్టుకోగలుగుతాయి. సంక్లిష్టమైన ధ్వనులను సైతం ఉత్పత్తి చేయగలుగుతాయి. ఈ సామర్థ్యాలన్నిటినీ అనుసంధానించే వ్యవస్థ చిలుకల మెదడులో ఉంటుంది.
పాటలు పాడే పక్షుల్లో ఉండే ఒకే మాదిరి వ్యవస్థ కాకుండా, చిలుకలకు అదనపు సర్క్యూట్ ఉంటుంది. ఇది వాటి జాతుల పిలుపులను, మానవ జాతుల పిలుపులను నేర్చుకోవడానికి వాటికి అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ విధమైన ప్రత్యేక శరీర నిర్మాణంతో చిలుకలు పలకగలవు. అరవగలవు. తిట్టగలవు. ఇక్కడి మాటలు అక్కడ చెప్పనూ గలవు!
శిక్షణ ఇస్తే మరింత జ్ఞానం
ముఖ్యంగా, శిక్షణ తర్వాత చిలుకలు సందర్భోచితంగా, అర్థవంతంగా పదాలను ఉపయోగించటాన్ని అధ్యయన వేత్తలు గమనించారు. రాత్రి పడుకునే ముందు ‘గుడ్ నైట్’ చెప్పడం, తినేందుకు ఏదైనా పెట్టమని అడగడం, లేదా వస్తువులను లెక్కించడం, వస్తువులను తీసుకురావటం వంటి పనులను చేసే సామర్థ్యం చిలుకల్లో ఉందని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించిన విషయమే. చక్కటి శిక్షణ పొందిన ఆఫ్రికన్ బూడిద రంగు చిలుక ‘అలెక్స్’, తన రంగు గురించి అడిగినప్పుడు శిక్షకులు నివ్వెర పోయారు. తనకు తానుగా ప్రశ్న వేసిన తొలి చిలుకగా అలెక్స్ చరిత్రలో నిలిచిపోయింది.
మహా జ్ఞానవతి అలెక్స్!
ఫొటోలో కనిపిస్తున్న బూడిద రంగు చిలుక పేరే.. ‘అలెక్స్’. ఈ మహాజ్ఞాని పక్కన ఉన్నది జంతుజ్ఞాన శాస్త్రవేత్త ఐరీన్ పెప్పర్‌బర్గ్. అలెక్స్‌కు ఏడాది వయసున్నప్పుడు ఐరీనే ఒక దుకాణంలో దానిని కొనుక్కుని అలెక్స్ అని పేరు పెట్టారు. 31 ఏళ్ల వయసులో అలెక్స్ 2007 సెప్టెంబర్ 6న తన పంజరంలోనే విగతజీవిగా కనిపించింది. ఐరీన్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పంజరాలలో ఉండే చిలుకల ఆయుర్దాయం 45 సంవత్సరాలు. (అడవి చిలుకలు అడవిలో ఏదో ఒక ప్రమాదంతో ఇంకా ముందుగానే చనిపోతాయి).
‘‘నువ్వంటే నాకిష్టం!’’
అలెక్స్ అలా హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో ఐరీన్‌కు అంతుచిక్కలేదు. ఆ ముందు రోజు రాత్రి అలెక్స్ పలికిన చివరి పలుకులు : యు బీ గుడ్ (నువ్వు బాగున్నావు), ఐ లవ్ యు (నువ్వంటే నాకిష్టం), సీ యూ టుమారో (రేపు కలుద్దాం)... అనేవి. ల్యాబ్‌లో పంజరం ఉండేది. ఐరీన్ ఆ ల్యాబ్‌లో పని చేస్తుండేవారు. ల్యాబ్ నుండి ఐరీన్ ఇంటికి వెళ్లే ప్రతి రాత్రీ ఆ చిలుక ఆమెకు ఈ మూడు మాటలతోనే వీడ్కోలు చెబుతుండేది. శవ పరీక్షలో చిలుక మరణానికి స్పష్టమైన కారణాలు బయపడలేదు. ఆ తర్వాతి పరీక్షల్లో ‘గుండెపోటు’ అని నిర్థారణ అయింది.
విసిగిస్తే ‘అంతేగా, అంతేగా..’
దాదాపుగా 30 ఏళ్ల పాటు అలెక్స్ సహజజ్ఞానంపై పరిశోధనలు జరిపారు ఐరీన్. అలెక్స్ తెలివి తేటలకు అనేక పరీక్షలు కూడా పెట్టారు. అలెక్స్ 80 శాతం పరీక్షల్లో
నెగ్గింది. ఒకసారి అలెక్స్ ముందు రకరకాల రంగుల బ్లాక్స్ (ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనివి కావు) ఉంచి, రెండు ఎరుపు బ్లాకులు, మూడు నీలం బ్లాకులు, నాలుగు ఆకుపచ్చ బ్లాకులు) ఉంచి, ‘‘ఏ రంగు బ్లాకులు మూడు ఉన్నాయి?’’ అని ఐరీన్ ఆ చిలుకను అడిగారు.
అలెక్స్ తప్పకుండా నీలం రంగు బ్లాకులు అని చెబుతుందనే అనుకున్నారు ఐరీన్. అయితే అప్పటికే నానా రకాల ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అలెక్స్.. ‘‘ఫైవ్’’ అని చెప్పింది. ఐరీన్ వదలకుండా, ‘‘అవునా? ఆ ఫైవ్ ఏ రంగులో ఉన్నాయి?’’ అని మళ్లీ అడిగారు. సమాధానంగా అలెక్స్, ‘‘ఏవీ లేవు’’ అని చెప్పింది. దాన్ని బట్టి చిలకలు కూడా, అడిగిందే అడుగుతుంటే మనుషుల్లాగే ప్రవర్తిస్తాయని, కావాలని తప్పుగా సమాధానం చెబుతాయని ఐరీన్ గుర్తించారు.
‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’
అలెక్స్‌కు 100 కంటే ఎక్కువ పదాలు తెలుసు. ఒకసారి తనను తను అద్దంలోకి చూస్తూ, ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’ అని అలెక్స్ అడగటం ఐరీన్‌ను నివ్వెరపరిచింది.
‘నువ్వు బూడిద రంగు (గ్రే కలర్)లో ఉంటావు అని ఆరుసార్లు చెప్పగానే ఆ రంగు అలెక్స్‌కు గుర్తుండిపోయింది. అదలా ఉంచితే, తనకు తనుగా ఒక ప్రశ్న అడిగిన మానవేతర జీవిగా అలెక్స్ నిలిచిపోయింది! (సంకేత భాషను ఉపయోగించటంలో శిక్షణ పొందిన వానరాలు సైతం ఇప్పటి వరకు వాటికై అవి ఒక్క ప్రశ్ననూ అడగలేకపోయాయి). అలెక్స్ చిలుక మానవ భాషనే కాదు, వాక్య నిర్మాణాన్ని కూడా అర్థం చేసుకోగలిగిందని ఐరీన్ వెల్లడించారు.
(చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..)


