
విమానాలకు విహంగాల ముప్పు
దేశ వ్యాప్తంగా భారీగా నమోదవుతున్న బర్డ్ హిట్స్
ఐదో స్థానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్
2020 నుంచి 207 ఉదంతాలు
జనావాసాలు పెరగడమే కారణం అంటున్న నిపుణులు
సాక్షి, సిటీబ్యూరో: ఆకాశం ఈ పేరు చెప్పగానే మేఘాలతో పాటు విమానాలు, పక్షులు గుర్తుకు వస్తాయి. రైట్ సోదరులు సైతం పక్షులను చూసి స్ఫూర్తి పొందే విమానాన్ని కనిపెట్టారు. అయితే ఇప్పుడు ఆ పక్షుల పేరు చెబితే విమానయాన సంస్థలు హడలిపోతున్నాయి. బర్డ్ హిట్స్ గణనీయంగా పెరిగిపోవడం, ఈ విహంగాల వల్ల విమానాలను ఎనలేని నష్టం జరుగుతుండటమే దీనికి కారణం. విమానం ఎగిరే, కిందికి దిగే సమయంలో దాని ఇంజన్ లేదా ఇతర భాగాలను పక్షులు ఢీకొట్టడాన్ని బర్డ్ హిట్ అంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశ వ్యాప్తంగా 2807 బర్డ్ హిట్స్ నమోదు కాగా.. వీటిలో 207 హైదరాబాద్‌కు సంబంధించినవే. 695 ఉదంతాలతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రథమ స్థానంలో ఉండగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదో స్థానంలో ఉంది.
సాధారణ వ్యక్తులకు చిన్న విషయంగా కనిపించే, వినిపించే బర్డ్ హిట్ విమానాలకు అపారమైన నష్టం కలిగిస్తుంది. ప్రధానంగా గద్దలు, రాబందులు తదితరాలే విమానాలకు తగులుతూ ఉంటాయి. ఇంజిన్‌లోకి పక్షి చొచ్చుకుపోవడం వల్ల అది ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ముందు భాగంలో ఉండే నాసెల్ (నోస్ కోన్), వింగ్స్, విండ్ ల్డ్స్‌కు తాకితే ఆయా భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. బర్డ్ హిట్ వల్ల ఇంజిన్ బ్లేడ్స్ విరిగిపోతే పెను ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. అనేక సందర్భాల్లో బర్డ్ హిట్ వల్ల పరిస్థితులు అత్యవసర ల్యాండింగ్ వరకు వెళ్లాయి. ఈ కారణాల వల్లే విమానయాన రంగంలో బర్డ్ హిట్‌ను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి ఉదంతాన్నీ కచి్చతంగా నమోదు చేస్తుంటారు. ప్రాణనష్టం లేనప్పటికీ బర్డ్ హిట్ వల్ల నష్టం జరిగితే ఆ విమానాల మరమ్మతు కోసం భారీ మొత్తం వెచి్చంచాల్సి వస్తుంది.
టేకాఫ్ సమయంలో ఇలాంటి జరిగితే వెంటనే ల్యాండింగ్ చేయడంతో పాటు ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేయడం తదితరాల వల్ల, విమాన సేవలకు అంతరాయం, ఆలస్యంతో పాటు విలువైన పని గంటలు వృథా అవుతుంటాయి. విమానాశ్రయం చుట్టూ జనావాసాలు పెరిగిపోడం ఈ బర్డ్ హిట్స్ చోటు చేసుకోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పడేసే ఆహార వ్యర్థాల వల్లా ఈ ఉదంతాలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పక్షుల కదలికల్ని గుర్తించడానికి విమానాశ్రయాల్లో ప్రత్యేక రాడార్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విమానాశ్రయాల వద్ద, రన్‌వేల పైనా బర్డ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా బర్డ్ కంట్రోల్ టీమ్స్ పేరుతో ఉద్యోగులను నియమిస్తుంటారు. వీళ్లు టపాసులు, ఫ్లాషింగ్ లైట్లు తదితరాలు వాడుతూ పక్షులను ఆ ప్రాంతాల నుంచి వీలైనంత దూరం తరిమేస్తుంటారు. విమానాశ్రయంతో పాటు ఆ చుట్టు పక్కల ఉన్న పక్షి గూళ్లను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. విమానాల్లోనూ యాంటీ బర్డ్ హిట్ టెక్నాలజీని, ఈ బర్డ్ హిట్స్‌ను తట్టుకునే సామర్థ్యాన్నీ అభివృద్ధి చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి.