
మనల్ని మనం ప్రేమించుకోకపోతే.. లోకం కూడా ప్రేమించదు! ఇదే సెల్ఫ్‌కేర్.. ఇదేమీ సెల్ఫిష్ థింగ్ కాదు..అత్యవసరంగా ఆచరించాల్సిన అంశం!దీని మీద అవగాహన కల్పించడం కోసమే ఏటా జూలై 24న ఇంటర్నేషనల్ సెల్ఫ్‌కేర్ డేగా ప్రకటించింది ఇంటర్నేషనల్ సెల్ఫ్‌కేర్ ఫౌండేషన్. ఈ సందర్భంగా...
వర్కింగ్ విమెన్‌తో పాటు గృహిణులు కూడా తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుటుంబ బాగోగుల మీద శ్రద్ధ పెడుతుంటారు. అలాంటి వాళ్లు ఒక్కసారిగా అనారోగ్యంతో మంచం ఎక్కితే.. మంచినీళ్లు అందించే దిక్కు ఉండదు. అందుకే అందరి గురించి ఆలోచించే ముందు తమ గురించి తాము ఆలోచించుకోవడం ముఖ్యం. సెల్ఫ్‌కేర్ సెల్ఫిష్ థింగ్ కాదు.. అత్యంత శ్రద్ధ పెట్టాల్సిన అంశం.
దాని మీద అవగాహన కల్పించడానికే ఇంటర్నేషనల్ సెల్ఫ్‌కేర్ ఫౌండేషన్ 2011లో జూలై 24ను ఇంటర్నేషనల్ సెల్ఫ్‌కేర్ డేగా ప్రకటించింది. నెలల్లో జూలై ఏడో నెల.. తేదీ 24.. ఇది 24/7ను సూచిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏడాదికి ఈ ఒక్కరోజు కాకుండా 24 గంటలూ తమ మానసిక, శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధపెడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుకరించాలని దీని అర్థం.. స్ఫూర్తి కూడా! అందుకే జూన్ 24 నుంచి జూలై 24 వరకు సెల్ఫ్‌కేర్ మంత్‌నూ సెలబ్రేట్ చేస్తోందీ సంస్థ. దీనితో సెల్ఫ్‌కేర్ ప్రయోజనాల మీద అవగాహన కల్పిస్తూ,సెల్ఫ్‌కేర్ ప్రాక్టీసెస్‌ను ప్రోత్సహిస్తోంది.
థీమ్... సెల్ఫ్‌కేర్ అనేది కేవలం శారీరక, మానసిక ఆరోగ్య క్రమశిక్షణే కాదు ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, పర్యావరణ క్రమశిక్షణ కూడా అంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం ఆరింటికి మొదలై రాత్రి ఒంటిగంటకు ముగిసే రోజులో కూడా అందరూ ముఖ్యంగా స్త్రీలు తమకోసం తగినంత సమయాన్ని తప్పకుండా కేటాయించుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో మహిళలు బాగుంటేనే ఇంట్లో వాళ్లు క్షేమంగా ఉంటారు. ఇల్లు క్షేమంగా ఉంటే సమాజ సంక్షేమం ఖాయం!
దేశంలో వివాహితలు వారంలో సగటున 44 గంటల కంటే ఎక్కువ సమయాన్నే జీతభత్యాలు, కనీసం గుర్తింపు కూడా లేని ఇంటిపనుల కోసం వెచ్చిస్తున్నారని న్యూస్‌రీల్ ఆసియా నివేదిక చెబుతోంది. అదే పెళ్లయిన మగవాళ్లు మాత్రం వారానికి అయిదు గంటలే వెచ్చిస్తున్నారట. ఈ లెక్కన సంసార బాధ్యతల్లో ఉన్న పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు రోజుకు కనీసం గంటన్నర కూడా వ్యక్తిగత శ్రద్ధ కోసం కేటాయించట్లేదట.
వ్యక్తిగత శ్రద్ధ లోపించడం వల్ల అది మహిళల్లో ఒత్తిడి, అలసటను పెంచి.. వాళ్లు నలుగురితో కలిసే కార్యక్రమాల్లో ΄ాలుపంచుకోకుండా చేస్తోందని, అది మహిళల మానసిక, శారీరక ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపెడుతుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
(చదవండి: పాము ఉందంటే పరిగెత్తుకొస్తుంది.. 800కి పైగా స్నేక్స్..!)