
సాధారణంగా బొద్దింకలు, బల్లులను చూస్తేనే కెవ్వుమని అరుస్తుంటారు మహిళలు. వాళ్లు సున్నిత మనస్కులు ఇలాంటివి వాళ్లకు చేతనవ్వదు అన్న మాటలే పదేపదే వినిపిస్తుంటాయి. కానీ వాటన్నింటిని కొట్టిపడేసిలా శివంగిలా దూకి తామెంటో నిరూపుంచికుంటున్నారు మగువలు. అయితే యుద్ధం నుంచి అగ్నిమాపకదళం వరకు అన్ని కఠినతరమైన రంగాల్లోనూ అలవోకగా తామేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడూ ఏకంగా స్నేక్ క్యాచర్‌గా కూడా సత్తా చాటుతున్నారు. అలా అత్యంత విషపూరితమైన పాములను రెప్పపాటులో పట్టే ఏకైక మహిళా స్నేక్ క్యాచర్‌గా పేరుతెచ్చుకుంది ఓ మహిళ.
ఆ ధీర వనితే కేరళకు చెందిన డాక్టర్ జిఎస్ రోష్ని. దూరదర్శన్‌లో మాజీ న్యూస్ రీడర్ కూడా. హాయిగా న్యూస్ రీడర్‌గా సాగిపోతున్న కెరీర్..వన్యప్రాణుల రక్షణ శిక్షణతో ఊహించని మలుపు తిరిగింది. అలా ఆమెకు భయంకరమైన పాములను పట్టి అడువుల్లో వదలడం తెలియకుండానే హాబీగా మారింది. అలా స్నాక్ క్యాచర్ రంగంలోకి వచ్చింది.
ఆ అభిరుచితో ఇప్పటి వరకు దాదాపు 800కు పైగా పాములను సునాయాసంగా పట్టేసింది. వాటిలో కొండచిలువలు, రక్తపింజరలు, కింగ్ కోబ్రాలు కూడా ఉన్నాయి. ఆమె ఏ పామునైనా జస్ట్ మూడు నుంచి ఆరు నిమిషాల్లో పట్టేసి అడవుల్లో వదిలేస్తారామె. ఆమె అజేయమైన ధైర్య సాహసాలకు గానూ సర్టిఫైడ్ ఫిమేల్ స్నేక్ క్యాచర్‌గా లైసెన్స్ పొందిన ఏకైక కేరళ మహిళ కూడా రోష్నినే.
ఆ విధంగా కేరళ అటవీ శాఖలోకి ప్రవేశించి స్నేక్ క్యాచర్‌గా సేవలందిస్తున్నారామె. ఆ వృత్తిలో ఆమెకు అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాము కనిపించింది అంటూ ఏ అర్థరాత్రి, తెల్లవారుజామునో కాల్స్ వస్తుంటాయి. వెంటనే పాము కొక్కెం, సంచి తీసుకుని బైక్‌పై వెళ్లిపోవాల్సిందే అంటున్నారు రోష్ని.
కానీ ఏపనిలో అయినా సవాలు ఉంటుంది. నిజమైన సవాలు మన భావోద్వేగాలే అంటారామె. నిజంగా పాములను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అదేమంతా భయం కాదట. ఇబ్బందుల పాలు చేసే పరిస్థితుల్లో ఎలాంటి భావోద్వేగానికి గురికాకుండా ఉండటమే అతికష్టమైన సవాలు అని చెబుతోంది రోష్ని. ప్రస్తుతం ఆమె త్రివేండ్రంలో రాపిడ్ రెస్పాన్స్ బృందానికి నాయకత్వం వహిస్తోంది. చివరగా ఆమె ఏ రంగంలో అయినా రాణించగలను అనే నమ్మకం ఉంటే..ధైర్యంగా వెళ్లిపోండి, వెనక్కిచూడొద్దు అప్పుడే విజయం తథ్యం అంటోంది రోష్ని.
(చదవండి: ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..!)