
మిషన్ సంకల్ప్ 78’ పేరుతో సేవా కార్యక్రమాలు
రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్‌తో పాటు 22 రాష్ట్రాలు, 170 నగరాల్లో
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జాతీయ జెండా ఎగరేయడం మాత్రమే కాదు.. మనం సమాజానికి తిరిగి ఇచ్చే క్షణం కూడా.. ఈ ఆలోచనతోనే స్వచ్ఛంద సేవా సంస్థ రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా మిషన్ సంకల్ప్ 78 ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఆగస్టు 1న మొదలైన ఈ యాత్రలో 22 రాష్ట్రాలు, 170 నగరాల్లో వెనుకబడిన 78 లక్షల పౌరులకు భోజనం, అవసరమైన వస్తువులు అందించనున్నారు. దీంతోపాటు 78 పార్కులు, లైబ్రరీలు, ఆట స్థలాలు, వారసత్వ కట్టడాలు, స్కిల్ సెంటర్లను పునరుద్ధరిస్తూ.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అర్థాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
నిరుపేదల ఆశయాలను ప్రోత్సహించేలా..
మూడు లక్షల మందికి పైగా వాలంటీర్లతో పనిచేసే ఈ సంస్థకు యూనిలివర్, స్విగ్గీ, నోవోటెల్ వంటి అనేక కార్పొరేట్ భాగస్వాములు తోడయ్యారు. రణవీర్ అల్లాహబాదియా, హెల్లీ షా, శెహా్నజ్ గిల్ వంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం చేస్తున్నారు. ముంబయిలో మాన్‌కుర్డ్ స్టేషన్ ఆర్ట్ రెన్యువల్, లోనావాలా స్కూల్ సైన్స్ ల్యాబ్ పునరుద్ధరణ, ఢిల్లీలో దృష్టి లోపం ఉన్న బాలికల కోసం బ్రెయిలీ ఆర్ట్ హాల్ వంటి ప్రాజెక్టులు ఈ మిషన్ కృషిని ప్రతిబింబిస్తోంది.

ఈ సందర్భంగా రాబిన్ హుడ్ ఆర్మీ స్వదేశీ విభాగం హెడ్ సుస్మితా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. లక్షలాది మందికి భోజనం అందించడం మాత్రమే కాదు, వారి ఆశను, ఆశయాలను నెరవేర్చేలా కార్యాచరణను రూపొందించామన్నారు. 2014లో ప్రారంభమైన ఈ జీరో–ఫండ్స్ ఉద్యమం ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 162 మిలియన్ల భోజనాలను అందించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.