
థీమ్ అనేది అలంకార్రప్రాయం కాదు. మన భవిష్యత్ లక్ష్యాల గురించి బలంగా చెప్పే... సంక్షిప్త సందేశం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ, కొత్త శక్తులతో ముందడుగు వేసినప్పుడే కొత్త భారతాన్ని ఆవిష్కరించుకోగలుగుతాము. ఈ భావాన్ని ప్రతిబింబించేలా ‘నయా భారత్’ అని ఈ స్వాతంత్య్ర దినోత్సవం థీమ్‌ను నిర్ణయించారు.
డాలీగారి దేశభక్తి
‘దేశభక్తి మీకేనా? నాకు కూడా ఉంది’ అని చెప్పకనే చెప్పింది డాలీ. పెయింటర్ డాగ్‌గా పాపులర్ అయిన డాలీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తాజాగా త్రివర్ణ పతాకం పెయింట్ వేసి ‘ఆహా’ అనిపించేలా చేసింది డాలీ. ‘శునక రాజమా... నీ దేశభక్తికి జోహార్లు’ అంటున్నారు నెటిజనులు.
ఈ అమెరికన్ మన జాతీయగీతం అద్భుతంగా ఆలపిస్తాడు!
పదిహేడు సంవత్సరాల అమెరికన్ గేబ్ మెరిట్ ఆలపించిన మన జాతీయగీతం ‘జన గణ మన’ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ‘ఓ మై గాడ్... నా హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోయింది’ అనే కాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసింది దిశ అనే నెటిజన్. ‘ఎన్నో దేశాల జాతీయగీతాలు పాడినప్పటికీ గేబ్‌కు మన జాతీయగీతం ఆలపించడం అంటే ప్రత్యేక అభిమానం’ అని రాసింది దిశ.
తండ్రి పేరు వందేమాతరం..!
‘పేరులో పవర్ ఉంటుంది’ అంటారు. కొన్ని పేర్లు వింటే ‘నిజమే!’ అనిపిస్తుంది. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఈ కుటుంబసభ్యుల పేర్లలో దేశభక్తి ధ్వనిస్తుంది. తండ్రి పేరు వందేమాతరం ప్రహ్లాద్ నాయక్, కుమారుడి పేరు తిరంగా ప్రియదర్శన్, కూతురు పేరు జైహింద్ జగ్యన్‌సేని.
‘మతాన్ని ప్రతిఫలించే పేర్లు కాకుండా దేశభక్తిని ప్రతిఫలించే పేర్లు అంటే నాకు ఇష్టం’ అంటున్న వందేమాతరం స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. వందేమాతరం ఇంటిలోని గదులు జాతీయజెండాలోని మూడు రంగులతో అలంకరించి ఉంటాయి.
అంటార్కిటికాలో వందేమాతరం
అంటార్కిటికాలోని పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు ఆగస్ట్ పదిహేను పర్వదినాన్ని పురస్కరించుకొని జాతీయజెండా ఎగరేయడానికి సన్నద్ధం అవుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
వాతావరణ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘మేము సైతం’ అంటూ జాతీయపతాకావిష్కరణకు సన్నద్ధం అవుతున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. ఉద్యోగులు మంచుపెకిలిస్తుంటే, నేపథ్యంలో ‘వందేమాతర గీతం’ వినిపిస్తుంటుంది.
(చదవండి: ఒక్కొక్కరం ఒక్కో రంగు)