
బీజేపీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నిప్పులు
న్యూఢిల్లీ: వెలుగులోకి వస్తున్న ఎన్నికల అక్రమాలను చూస్తే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని అర్థమవుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జెండా ఎగురవేసిన అనంతరం నాయకులు, శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. జోరున వర్షం కురుస్తుండగానే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేతలు జెండా వందనం కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ..బిహార్‌లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) పేరుతో బతికున్న వారిని సైతం చనిపోయినట్లుగా ధ్రువీకరించడం ద్వారా ప్రతిపక్షాలకు పడే ఓట్లను తొలగించారని ఆరోపించారు. తొలగింపునకు గురైన 65 లక్షల ఓట్లకు సంబంధించి బీజేపీ ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీన్ని బట్టి చూస్తే ఎస్‌ఐఆర్‌తో లాభం కలిగేది బీజేపీకి మాత్రమేనని ఖర్గే వ్యాఖ్యానించారు.
ఇలాంటి అక్రమాలు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఏ ప్రాతిపదికన ఓట్లను రద్దు చేసిందో తెలిపేందుకు ఈసీ సైతం సిద్ధంగా లేదని ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆ పార్టీ ఎంత అనైతికతకయినా సిద్ధమవుతోందని దీంతో స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం సాగిస్తుందే తప్ప, ఎన్నికల్లో విజయం కోసం కాదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు విభాగాలైన ఈడీ, సీబీఐలతోపాటు ఆదాయపన్ను శాఖను సైతం బీజేపీ సర్కార్ బాహాటంగా దుర్వినియోగం చేస్తోన్న విషయాన్ని ప్రత్యక్షంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే చెప్పిందని ఆయన అన్నారు. అలీన విధానం ద్వారా కూడగట్టుకున్న ప్రతిçష్టను బీజేపీ సర్కార్ హయాంలో మన దేశం కోల్పోవాల్సి వచ్చిందని ఖర్గే విమర్శించారు.
వర్షంలో తడుస్తూ రాహుల్ జెండా వందనం
ఇందిరా భవన్ ప్రాంగణంలో పార్టీ చీఫ్ ఖర్గే జెండా ఎగురవేస్తుండగా ఆయన పక్కనే అగ్రనేత రాహుల్ గాంధీ వర్షంలో మిగతా వారితో కలిసి తడుస్తూనే నిలబడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం. వీటి పరిరక్షణ కోసం ఇకపైనా పోరాడుతాం’అని ఆ పార్టీ పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.