మై ఇండియా, కానీ ఐఎస్ కోసం పనిచేస్తా!

INA Arrested Sadiya From Pune For Working With ISISI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సూసైడ్‌ బాంబర్‌ అవడం సాదియా జీవిత లక్ష్యం. 20 ఏళ్ల అమ్మాయి సాదియా. పుణె దగ్గరి ఎరవాడ తనది. ఇప్పటికి రెండుసార్లు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ) పోలీసులు ఆమెను డీ–రాడికలైజ్‌ చేశారు. అంటే.. మారు మనసు పొందేలా చేయడం. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి, 18 ఏళ్ల వయసులో ఒకసారి ఆమెకు డీ–రాడికలైజేషన్‌ జరిగింది. ‘నేను భరతమాత ముద్దుబిడ్డని’ అని వాళ్లు చెప్పమన్నట్లే చెప్పి, తన మనసు ఎక్కడుందో మళ్లీ అక్కడికే వెళ్లిపోయింది భరత మదర్‌ ని వదిలేసి! ఐఎస్తో కలిసి ఇండియాలో ‘మ్యాచ్‌’ కి ప్లాన్‌ చేస్తుండగా ఈ జులై లో సాదియా ను పట్టుకుంది ఎన్‌. ఐ.ఎ. ‘ఏం చేస్తున్నావు వారితో కలిసి?!’ అని అడిగితే అబద్ధమేమీ చెప్పలేదు సాదియా.

‘నా మనసు ఇండియన్‌ మదర్‌ దగ్గర లేదు’ అంది. ‘మరి ఇండియా వదిలి పోతావా?’ అంటే.. ‘పోను.. ఇది నా దేశం. నేను ఎందుకు పోవాలి?’ అంది! సెప్టెంబర్‌ లో ఛార్జ్‌ షీట్‌ ఫైల్‌ చేసింది ఎన్‌. ఐ.ఏ. సాదియా మీద. ‘అంకుల్‌.. కరోనాను ఒక మనిషికి ఎక్కించి, ఆ మనిషి తో సుమారుగా ఎంతమందికి కరోనాను తెప్పించవచ్చు?’ అని ఎవరినో అడుగుతుంటే విని పోలీసులు ఆమెను పట్టుకున్నారు. సాదియా అన్వర్‌ షేక్‌ (పూర్తి పేరు) కు దేశం బయట మంచి మంచి పరిచయాలు ఉన్నాయి.  ఇస్లామిక్‌ స్టేట్, ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్, ఆల్‌ ఖైదా, అన్సార్‌ గజ్వత్‌ ఉల్‌ హింద్‌ సంస్థలతో ఆమె టచ్‌ లో ఉంది. ఫిలిప్పీన్స్‌ లో ఆయిషా హమిదాన్‌ అని ఆన్‌ లైన్‌ ‘మోటివేటర్‌’ ఒకావిడ ఉన్నారు. ఇరవై ఏళ్ల లోపు పిల్లల్ని ఆదరించి, అక్కున చేర్చుకుని ఉచితంగా ఐ.ఎస్‌.పాఠ్యపుస్తకాలు అందించి చక్కగా తల దువ్వుతూ వారి చేత ప్రతి పేజీనీ శ్రద్ధగా చదివించడం ఆమె జీవిత లక్ష్యం. ఆమెతో కూడా టచ్‌ లో ఉంది సాదియా.

మలేసియాలో అజ్ఞాతం లో ఉన్న ఇస్లాం మత ప్రబోధకులు డాక్టర్‌ జకీర్‌ నాయక్‌ కూడా సాదియా కు ఒక మంచి ఇన్‌స్పిరేషన్‌. ఐ.ఇ.డి. ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకుంది సాదియా. ఇంప్రొవైజ్‌డ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ డివైజ్‌!! ఫేస్‌బుక్‌లో మల్టిపుల్‌ ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చెయ్యడం కూడా వచ్చు. ఇన్ని చేస్తూ కూడా ‘ఇండియా ఈజ్‌ మై కంట్రీ’ అంటున్న ఈ అమ్మాయిని చూస్తుంటే నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అధికారులకు ముచ్చటగా ఉందట. మళ్లీ ఇంకోసారి ఆమెను డీ–రాడికలైజ్‌ చేసే పాపాన్నయితే వాళ్లు మూటగట్టుకోదలుచుకోలేదు. దీనికి సంబంధించి నవంబర్‌లో కేసు విచారణ మొదలు కాబోతోంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top