
మంచిమాట
‘‘ఇది చేయాలనుకొంటున్నాను, అది చేయాలను కొంటున్నాను.’’ అని అంటూ ఉంటారు చాలా మంది. ఒక సారి చేసిన తరవాత చేయాలి అనుకోటానికి అవకాశం కానీ, అవసరం కాని ఏముంది? జీవితంలో ఫలానాది సాధించటం నా ఆదర్శం, ఎప్పటికైనా నేను ఆ విధంగా అవాలి అనుకుంటున్నాను – ఇటువంటి మాటలు యువత నుండి తరచుగా వినపడుతూ ఉంటాయి. అంటే, ఆ విధంగా ఉండటం వారికి ఇష్టం. కాని, ఉండే ప్రయత్నం మాత్రం చేయరు. వారికి ఏదైనా కావాలి అంటే మాత్రం వెంటనే వచ్చేయాలి. దానికి శ్రమ పడేది తాము కాదు కదా! అమ్మనో, నాన్ననో సతాయించి సాధించుకుంటారు.
తాము చేయవలసిన వాటిని ఆదర్శం పేరిట గోడ మీద రాస్తారు ‘‘రేపు’’ అని. ఆ రేపు ఎప్పటికీ రాదు. వెళ్ళిపోయింది నిన్న. వచ్చి మనకి అందుబాటులో ఉన్నది ఈ రోజు. ఆచరించాలి, లేదా ప్రయత్నం చేయాలి, లేదా మొదలు పెట్టాలి అంటే – ఇప్పుడే, ఈ క్షణమే సరి అయింది. పరిస్థితులు అనుకూలించినప్పుడు, నాకు వీలైనప్పుడు అనుకుంటే కుదరదు. ఎందుకంటే బద్ధకించే వారికి వాయిదా వేయటానికి ఏదో ఒక వంక దొరుకుతుంది. అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేస్తాను అని ఒడ్డున కూర్చొన్నట్టు ఉంటుంది.
అంటే ఆదర్శాలు ఉండకూడదా? అనే ప్రశ్న వస్తుంది. ఉండాలి. చిన్న పిల్లవాడికి ఐఏఎస్ అవాలన్నది ఆదర్శం. ఈ క్షణాన అవలేడు కదా! దానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా శిక్షణ తీసుకోవాలి. ఇప్పటినుండి ఎందుకు? డిగ్రీ అయినాక చూద్దాం, అనుకుంటే కుదరదు కదా! ఆదర్శం వాస్తవంగా మారటానికి తగిన కృషి చేయాలి.
ఉన్నతమైన ఆదర్శాలు ఉండటం మంచిదే. నిజానికి ఉండాలి కూడా. ఆదర్శాలు వల్లెవేయటానికి బాగుంటాయి కాని, అవి ఆకాశ హర్మ్యాలు కాకూడదు. తన శక్తి సామర్థ్యాలకు తగినట్టు ఉండాలి. మృత్యువును జయించటం, బొందితో స్వర్గానికి వెళ్ళటం వంటి అసాధ్యమైనవి సాధించటం నా ఆదర్శం అనటం హాస్యాస్పదం. అవి సాధించటం కుదరదు కనుక ప్రయత్నం చేయటం వృథా అని మానేయటానికి ఒక వంక చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు.
అద్దాన్ని ఆదర్శం అంటారు. ఆదర్శాలు అద్దం లాంటివి. దానిలో ప్రతి బింబాలు మాత్రమే కనపడతాయి. బింబం కాదు. అయితే, ప్రతిబింబం బింబాన్ని సరిచేయటానికి పనికి వస్తుంది. చెదిరిన బొట్టు దిద్దుకోటానికో, చెరిగిన జుట్టుని సద్దుకోటానికో అద్దంలోని ప్రతి బింబం సహాయం చేస్తుంది. అందులో చూసి ముఖాన్ని సరి చేసుకోవచ్చు. ప్రతిబింబంలో సరి చేయటం కుదరదు. అద్దంలో ప్రతిబింబానికి బొట్టు పెడితే ముఖం మీదకి రాదు కదా!
రాసి పెట్టుకున్న ఆదర్శాలు అద్దంలో ప్రతిబింబాల వంటివి. ఆచరణ ముఖం లాంటిది. అక్కడ చూస్తూ ఇక్కడ తగిన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఆదర్శాలని గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందాలి. ఆదర్శం వ్యక్తులు అయితే వారి వలె ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ స్థాయికి రావటానికి వారు ఏవిధంగా శ్రమించారో దానిని ఆదర్శంగా తీసుకోవాలి కాని, ఇప్పుడు వారు అనుభవిస్తున్న సుఖాన్ని, వైభవాన్ని కాదు. దురదృష్టవశాత్తు చాలామంది రెండవ దానినే ఆదర్శంగా తీసుకోవటం జరుగుతోంది. ఆదర్శం ఆచరణగా పరిణమించాలి.
ఆదర్శాలను వాస్తవాలుగా పరిణమింప చేసుకోటానికి శక్తి మేరకు కృషి చేయాలి. ఒకవేళ అది ఫలించక పోయినా పరవాలేదు. ప్రయత్నం ప్రధానం. తన ఆదర్శాన్ని సాకారం చేయటానికి జీవిత మంతా వెచ్చించారనే ఖ్యాతి మిగులుతుంది.
– డా.ఎన్. అనంతలక్ష్మి