
ఫైరింగ్ రేంజ్ నుంచి జనావాసాల వైపు బుల్లెట్లు
ఎలగందుల ఫైరింగ్ రేంజ్‌లో పోలీసుల కాల్పుల సాధన
గతంలో బోనాలపల్లి, ఎలగందుల మధ్య అడ్డుగోడలా గుట్టలు
గుట్టలు కరగడంతో బోనాలపల్లి వైపు దూసుకువస్తున్న వైనం
ఫైరింగ్ క్యాంప్ ఎత్తివేయాలని గ్రామస్తుల డిమాండ్
అధ్యయనానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం
‘ఈ నెల 20న బోనాలపల్లి గ్రామంలో అమృతమ్మ అనే 80 ఏళ్లు పైబడిన వృద్ధురాలి తుంటికి బుల్లెట్ తాకింది. ఈ ఘటనలో వృద్ధురాలు స్వల్పంగా గాయపడింది’.
‘అమృతమ్మ ఘటనకు వారం ముందు బోనాలపల్లికి చెందిన ఓ ఇంటికి తూటా తగిలింది. ఇలాంటివి ఇటీవల కాలంలో పెరిగాయని గ్రామస్తులు వాపోతున్నారు.’
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అది బోనాలపల్లి గ్రామం.. కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామానికి హామ్లెట్ విలేజ్. ఇంతవరకూ ఈ గ్రామం గురించి లోకానికి తెలిసింది తక్కువే. కానీ, రెండుమూడు రోజులుగా ఈ ఊరు అకస్మాత్తుగా వార్తల్లోకెక్కింది. ఇటీవల ఈ గ్రామస్తులను పోలీసు తూటాలు భయపెడుతున్నాయి. గ్రామానికి సమీపంలోని ఫైరింగ్ ప్రాక్టీస్ గ్రౌండ్ నుంచి దూసుకువస్తున్న తూటాల వల్ల వీరిలో ప్రాణభీతి నెలకొంది. పగటి పూట ఎప్పుడు ఏ దిశగా ఏ బుల్లెట్ దూసుకువస్తుందో తెలియక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంభయంగా బతుకుతున్నారు. అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదు, అదేమీ ఇండియా–పాకిస్థాన్ సరిహద్దులో ఉండే గ్రామం కూడాకాదు.
ఇవన్నీ పక్కనబెడితే.. కనీసం ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉన్న ఆదివాసీ గ్రామం కూడాకాదు. ఇవేమీ కానప్పుడు ఈ గ్రామం మీదకు పోలీసు తూటాలు ఎందుకు దూసుకువస్తున్నాయి. ఎందుకు గ్రామస్తులను గాయపరుస్తున్నాయి? అన్న విషయాలపై ‘సాక్షి’ పలు విషయాలు సేకరించింది. మరోవైపు ఈ విషయంపై పోలీసులు దృష్టి సారించారు. బుల్లెట్లు ఎందుకు గ్రామం మీదకు వస్తున్నాయి? ఒకవేళ గుట్ట ఎత్తుతగ్గడం వల్లనా? లేక తూటాలు మధ్యలో రాళ్లకు తగిలి దిశ (డైరెక్షన్) మార్చుకున్నాయా? అన్న విషయంపై హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చి అధ్యయనం చేయించనున్నారు.
నేపథ్యం ఇదీ..
బోనాలపల్లి గ్రామం ఎలగందుల గ్రామానికి హామ్లేట్ విలేజ్. ఎలగందులలో కొన్ని దశాబ్దాలుగా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. పోలీసులు కాల్చిన బుల్లెట్లు అక్కడే ఉన్న గుట్టను తాకేవి. ఇన్నేళ్లకాలంలో ఏనాడూ పోలీసుల బుల్లెట్లు ప్రజలను తాకిన సందర్భాలే లేవంటే అతిశయోక్తి కాదు. కానీ, కొన్నిరోజులుగా పోలీసులు కాల్చిన తూటాలు బోనాలపల్లి గ్రామస్తులను ఎందుకు తాకుతున్నాయి? అన్న ప్రశ్నకు గ్రామస్తులే సమాధానం చెబుతున్నారు. ఎలగందుల ఫైరింగ్ రేంజికి బోనాలపల్లి గ్రామానికి మధ్యలో గ్రానైట్ గుట్టలు ఉండేవి. ఇవి రెండుగ్రామాల మధ్య పెట్టని గోడలా ఉండేవి. ఫలితంగా పోలీసులు కాల్చిన తూటాలు ఆ గుట్టను తాకి అక్కడే పడిపోయేవి. కొంతకాలంగా మైనింగ్ కారణంగా గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి.
ఫలితంగా పోలీసుల తూటాలకు అడ్డుకునే ఆటంకాలేవీ లేకుండాపోయాయి. దీంతో దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న బోనాలపల్లిని తూటాలు నేరుగా తాకుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల20న అమృతమ్మ అనే వృద్ధురాలి తుంటికి తూటా తగిలి తీవ్ర గాయమైంది. ఇదే తరహాలో తూటాలు వాకిళ్లలో, ఇంటిపైకప్పుల్లో పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ తూటాలు ఎవరిని తాకినా ప్రాణాలు పోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సాధన చేసే ఫైరింగ్ రేంజ్ నుంచి తూటాలు రాకుండా చేయాలని లేదంటే, దాన్ని అక్కడ నుంచి బదిలీ చేయాలని బోనాలపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫైరింగ్ బంద్ కావాలె
సమీపంలోని ఎలగందుల ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్లు గ్రామం మీదుకు దూసుకువస్తున్నాయి. ఈ భయానికి పిల్లలు కూడా స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేదు. ఈ విషయంపై వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్పందించి ఫైరింగ్ రేంజ్ పాయింట్‌ను ఇక్కడ నుంచి తరలించాలి.
– మధు, మాజీ వార్డ్ మెంబరు, బోనాలపల్లె
రాయితో కొట్టిర్రు అనుకున్నా
కొంతకాలంగా ఊరి మీదకు తూటాలు దూసుకువస్తున్నయ్. మొన్న శనివారం నా తుంటికి ఏదో దెబ్బ తగిలింది. తొలుత ఎవరో రాయితో కొట్టారని అనుకున్నా. తీరాచూస్తే అది తుపాకీ తూటా అని తెలిసింది. కొడుకులు నన్ను దవాఖానాకు తీసుకుపోయిన్రు. సాయంత్రం పోలీసులు వచ్చి చూసి, నన్ను ఫొటో కొట్టుకుని పోయిన్రు. ఆ దేవుడే కాపాడిండు.
– అమృతమ్మ, బోనాలపల్లె
ఎవరు బాధ్యులు
ఇలా బుల్లెట్లు వచ్చి ఆరుబయట తిరుగుతున్న వారికి తగులుతుంటే మాకు రక్షణ ఎలా? ఆ రోజు మా అమ్మకు బుల్లెట్ వేగం తగ్గి తాకింది. అదే తీవ్రతతో తాకి ఉంటే అమ్మ పరిస్థితి ఏంకాను? పోలీసులు వచ్చి చూసిపోయిన్రు. శనివారం తూటా తీసుకెళ్లిన్రు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? దీనిపై కలెక్టర్, సీపీ స్పందించాలె.
– మల్లేశం, అమృతమ్మ కుమారుడు
హైదరాబాద్ నుంచి టీం వస్తుంది
ఈ విషయం మా దృష్టికి వచ్చింది. మా టీం వెళ్లి పరిసరాలను పరిశీలించింది. బుల్లెట్లు గ్రామం మీదకు ఏ కారణం వల్ల దూసుకువస్తున్నాయి? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గుట్ట ఎత్తు తగ్గడం వల్లనా? లేక బుల్లెట్ దారిలో ఏదైనా రాయి తగిలి దిశ (డైరెక్షన్)మార్చుకుందా? అన్న విషయంపై అధ్యయనం జరగాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం కరీంనగర్‌కు రానుంది.
– గౌస్ ఆలం, పోలీస్ కమిషనర్, కరీంనగర్