Hyderabad: వెయ్యి కిలోల ఉక్కు... పదిహేను మంది శ్రమిస్తే వచ్చిన రూపం ఇది: దీప్తిరెడ్డి

Hyderabad: Statue Of Empowerment And Glory Interesting Facts By Deepthi Reddy - Sakshi

ధీశక్తి స్వరూపం

Statue Of Empowerment And Glory: హైదరాబాద్‌ నగరం, మాదాపూర్, మైండ్‌ స్పేస్‌ సర్కిల్‌. ఐటీ సెక్టార్‌ కేంద్రమైన ఈ ప్రదేశం ఇప్పుడు ఓ చారిత్రక ఘట్టానికి వేదికైంది. 20 అడుగుల ఎత్తున్న ‘స్టాచ్యూ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్లోరీ’కి సోమవారం నాడు తెర తొలగింది. నగరంలో ఇలాంటి ఒక విగ్రహాన్ని తయారు చేయాలనే ఆలోచన యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ దీప్తిరెడ్డిది. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్బంగా ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకల నేపథ్యంలో ఈ ప్రతిమను ఆవిష్కరించినట్లు చెప్పారామె. 

నాటి మహిళ వేసిన బాట 
‘‘మహిళ అనగానే ఈ తరానికి విద్యావంతురాలైన ఆధునిక మహిళ రూపం కళ్లముందు మెదులుతుంది. ఒకప్పుడు మహిళ జీవిత చిత్రం ఇలా ఉండేది కాదు. మహిళలను ఇంతటి అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి చేరడానికి అనేక తరాల మహిళలు కృషి చేశారు. సమాజం నిర్దేశించిన అనేక సంకెళ్లను వదిలించుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ భావి తరాలకు మార్గదర్శనం చేశారు.

వారి త్యాగాల ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న మేము. లెక్కకు మించిన సవాళ్లనెదుర్కొని మహిళ తనకు తానుగా సాధించిన ప్రగతికి ప్రతీకగా ఒక ప్రతీకాత్మక ప్రతిమను రూపొందించాలనిపించింది. పైగా ఇక్కడ మరో విషయం ఏమిటంటే... అందరూ 75 ఏళ్ల సందర్భంగా దేశం ఏం సాధించిందనే విషయం మీదనే దృష్టి పెడుతున్నారు. దేశం సాధించిన అభివృద్ధి మొత్తం మగవాళ్లతో సాధ్యమైనదే అనే భావం కనిపిస్తోంది తప్ప మహిళల ప్రస్తావన కనిపించడం లేదు.

సగభాగమైన మహిళలు సాధించిన అభ్యున్నతిని గుర్తించడంలో కూడా మనం ఎక్కడో వెనుకబడుతున్నాం. ఈ నిర్లక్ష్యాన్ని భావితరాలు క్షమించవు. గడచిన తరాల మహిళల కృషి ఫలితాలను మా తరం ఆస్వాదిస్తోంది. సమాజంలో సగభాగంగా ఉన్న మేమే... మాకు మార్గదర్శనం చేసిన మహిళలను గౌరవించుకోవాలని కూడా అనుకున్నాను.  

దుర్భిణీ వేసినా దొరకదు! 
నేను హైదరాబాద్‌లో పుట్టిపెరిగాను. గీతాంజలి స్కూల్‌లో ఇంటర్‌ వరకు, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ లో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత ఎంబీఏ చేసి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాను. నాకు హైదరాబాద్‌ నగరం బాగా తెలుసు. ఇంత పెద్ద నగరంలో లెక్కకు మించిన విగ్రహాలున్నాయి. జీవవైవిధ్యానికి ప్రతీకగా విగ్రహాలున్నాయి. సాంస్కృతిక సంపన్నతను ప్రతిబింబించే విగ్రహాలున్నాయి. వ్యర్థం నుంచి చేసిన కళాఖండాలున్నాయి. మహిళ సాధించిన సాధికారతకు, కీర్తికి చిహ్నంగా ఒక్క విగ్రహమూ లేదు. ఈశ్వరీబాయి వంటి గొప్ప మహిళా నాయకుల విగ్రహాలున్నాయి.

కానీ ‘సాధికార మహిళ’కు ప్రతీకగా ఒక రూపం ఎక్కడా లేదు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నారని చెప్పుకుంటాం. నా మట్టుకు నేను మా పీవీఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీకి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఓ యాభై ఏళ్ల కిందటి మహిళల ఊహకు కూడా అందని రంగం ఇది. దేశాభివృద్ధిలో మా మహిళల పాత్ర ఎంతో ఉంది. ఆ విషయాన్ని రాబోయే తరాలు గుర్తించాలి. అందుకు ఈ విగ్రహం స్ఫూర్తిగా నిలవాలి.

నా ఆలోచనలను కోల్‌కతాకు చెందిన అజ్విత్‌ దత్తాకు వివరించాను. అతడు ఈ 20 అడుగుల విగ్రహంలో నా ఆలోచనలకు రూపమిచ్చాడు. వెయ్యి కిలోల ఉక్కు వాడారు. పదిహేను మంది శ్రమిస్తే వచ్చిన రూపం ఇది. నా ఆలోచన ఇలా ఆవిష్కారం కావడానికి ఎనిమిది నెలల కాలం పట్టింది. హైదరాబాద్‌– సికింద్రాబాద్‌ జంటనగరాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న 17 యంగ్‌ ఎఫ్‌ఎల్‌వోలలో కూడా ఇదే మొదటిది’’ అన్నారు దీప్తిరెడ్డి. 
– వాకా మంజులారెడ్డి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top