రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా? | High Court Advocate Srikanth Chintala's Comments On Getting Property For Second Wife And Children | Sakshi
Sakshi News home page

రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?

Aug 14 2024 7:51 AM | Updated on Aug 14 2024 7:53 AM

High Court Advocate Srikanth Chintala's Comments On Getting Property For Second Wife And Children

లీగల్‌

భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.

ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.

ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్‌ బెనిఫిట్స్‌కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్‌ బెనిఫిట్స్‌ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్‌ – సర్వీస్‌ బెనిఫిట్స్‌లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్‌ కేసు ఫైల్‌ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.

అంతేకాక ఫ్యామిలీ పెన్షన్‌ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్‌ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్‌ రూల్స్‌ లోని సెక్షన్‌ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్‌లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.


– శ్రీకాంత్‌ చింతల, హైకోర్ట్‌ అడ్వకేట్‌

Advertisement
 
Advertisement
Advertisement