
మహానగరంలో సగటు గర్భిణి డిప్రెషన్‌కు గురవుతోంది. గర్భందాల్చిన విషయం తెలిసిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకూ యాంగ్జైటీకి గురవుతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రసవ సమయంలో 15 నుంచి 20 శాతం మంది గర్భిణులు, ప్రసవానంతరం 25 శాతం మంది ఈ రకమైన డిప్రెషన్‌కు గురవుతున్నారని యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలపై చేపట్టిన సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది.
ప్రసవానంతరం మూడు నెలల పాటు నెగిటివ్ థాట్స్ వేధిస్తున్నాయట. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ లింగ వివక్ష కనిపిస్తోందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో మాతృ మరణాల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గినప్పటికీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధానంగా పేదరికం, ఆర్థిక అసమానతలు, గృహ హింస, సూటిపోటి మాటలు, కుటుంబ సభ్యుల మద్ధతు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
సామాజిక మాధ్యమాలే కారణం..
నగర జీవితంలో ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. గర్భిణిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో ఒత్తిడి, ఇంట్లో ఒంటరి తనం వేధిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సలహాలు, సూచనలతోనూ గర్భిణులు ఇబ్బందిపడుతున్నారట. పట్టణ జీవితంలో సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ అంతర్జాలంలో చూసి ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది గర్భిణుల్లో నాకు అన్నీ తెలుసు అనే ధోరణి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు.
లైఫ్ స్టైల్ ప్రభావం..
సుమారు 60 శాతం మంది గర్భిణులు సూర్యుడిని చూడటంలేదట. ఫలితంగా విటమిన్–డి లోపం కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైయిల్‌లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మెడిటేషన్ మస్ట్..
గర్భిణుల్లో వ్యాయామం, డెలివరీ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటూనే.. మెడిటేషన్‌కు సమయం కేటాయించాలి. రెండు నుంచి మూడు శాతం మందికి మాత్రమే బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. మిగతావారు పనులు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గర్భిణిగా గుర్తించిన తొలి రోజుల నుంచి యాంగ్జైటీ మొదలై చివరి వరకు కొనసాగుతోంది.
సోషల్ మీడియాకు ప్రభావితం కావొద్దు. పోస్ట్ డెలివరీలో హార్మోన్ ఛేంజెస్ ఉంటాయి. తగినంత రెస్ట్ అవసరం. క్యాల్షియం డెఫిషియన్సీ, రోగ నిరోధక శక్తి సమస్యలు వేధిస్తున్నాయి. రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కనీసం అర గంట ఎండలో ఉంటే డి–విటమిన్ లోపాన్ని అధిగమించొచ్చు.
– డాక్టర్ పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్
(చదవండి: Benefits of Barefoot: ఫుట్ వేర్‌కి బై.. 'బేర్‌ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..)