
అప్పులేకుండా తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే ఆర్థికంగా స్థిరపడినట్టే అనేవారు పెద్దలు. కానీ చెప్పుల్లేకుండా తన కాళ్లపై తాను నడవడం అంటే ఆరోగ్యం లభించినట్లే అంటున్నారు నేటి వైద్య నిపుణులు. ప్రస్తుతం గ్రౌండింగ్/ఎర్తింగ్ పేర్లతో మెట్రో నగరాల్లో పాదరక్ష రహిత నడక ఆరోగ్య సాధనంగా మారింది. దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వెల్‌నెస్ చికిత్సా కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న ఈ బేర్‌ఫుట్ వాక్‌పై నగరవాసుల్లో క్రమంగా ఆకస్తి పెరుగుతోంది. ఆరోగ్య రక్షణపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాన సౌకర్యాలూ లేవు.. కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. ఎటువంటి పాదరక్షలూ లేకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు.
ప్రయోజనాలివే..
పాదాలకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి, కాళ్లకూ మధ్య మెరుగైన సమన్వయం, రక్త ప్రసరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పాదరక్షలు లేకుండా నడవడం స్వేచ్ఛగా, కొంత సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ఈ నడక వల్ల నేలతో మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఇది ప్రొప్రియోసెప్షన్ (శరీర కదలికల–అవగాహన)ను మెరుగుపరుస్తుంది. శరీరం కదలిక స్థానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచి పాదాలపై పట్టు జారిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
మెరుగైన ప్రొప్రియోసెప్షన్‌తో మెరుగైన భంగిమ వస్తుంది. కొంతకాలం పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్నెముక, కీళ్లు బలోపేతమై మరింత స్థిరత్వంతో తక్కువ వంగి నడవడానికి కూడా సహాయపడుతుంది. పాదాలకు అసంఖ్యాక నరాలు, రక్త నాళాలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వాటిని చురుకుగా మారుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. ప్రసరణ సమస్యలు ఉన్నవారికి, చల్లని పాదాలకు లేదా రోజంతా కూర్చొని గడిపే వారికి ఇది చాలా మేలుచేస్తుంది. అంతేకాదు ఇది నాడీ వ్యవస్థను కూడా మేల్కొలుపుతుంది.
భూ ఉపరితలంతో ప్రత్యక్ష సంబంధం ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో సంభవించే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని స్పర్శాజ్ఞానం అత్యుత్తమం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్ స్కిల్స్.. బాడీ బ్యాలెన్సింగ్ నైపుణ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. షూస్, సాక్స్‌లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్ నుంచి తప్పించుకోవచ్చు.
చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ? దేనిపై అడుగు పెడుతున్నారు? పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చదునైన పాదాలు, ప్లాంటార్ ఫాసిటిస్ లేదా పాదాల నొప్పి ఉన్నవారు దీన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఆర్చ్‌లు, ప్లాంటార్ ఫాసిటిస్, లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని ప్రత్యేక తరహా పాదాలు ఉంటే చెప్పులు లేకుండా నడవడం మరింత దిగజార్చుతుంది.
అందరికీ కాదు.. అన్ని చోట్లా కాదు..
పాదరక్షలను వదిలే ముందు, పాడియాట్రిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్‌ను ముందస్తుగా సంప్రదించడం అవసరం
ఇది అందరికీ లేదా ప్రతి వాతావరణానికి తగినది కాదు. పట్టణ ప్రాంతాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి.
గడ్డి, ఇసుక లేదా నేల వంటి సహజ ఉపరితలాలపై సహజమైన ప్రకృతిలో మాత్రమే పాదరక్ష రహితంగా నడవవచ్చు. పరిశుభ్రమైన పరిసరాలు కూడా తప్పనిసరి.
వృద్ధులకు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది సరైన ఎంపిక కాదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తెస్తుంది.
పట్టణ ప్రాంతాల్లోని కఠిన ఉపరితలాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి.
బేర్ ఫుట్ వాక్ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటిబయాటిక్ సోప్స్ లేదా లోషన్స్ ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవడం మంచిది.
పచ్చని గడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్ మీద నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద నగక కూడా మంచిదే.
ఆరోగ్యకరం..
తగిన జాగ్రత్తలు తీసుకుని బేర్‌ఫుట్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా దీనివల్ల ఫుట్ పొజిషన్ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్ పెరగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పిరుదులు, కీళ్లు, కోర్ మజిల్స్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. సరిగా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పడుతుంది. లోయర్ బ్యాక్ ప్రాంతపు కండరాలను శక్తివంతం చేస్తుంది.
– డా.కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్
(చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..)