పికా అంటే..? పిల్లలకు ఇది ప్రాణాంతకమా...? | Health tips: Pica: What It Is Causes Symptoms Treatment | Sakshi
Sakshi News home page

పికా అంటే..? పిల్లలకు ఇది ప్రాణాంతకమా...?

May 24 2026 9:32 AM | Updated on May 24 2026 11:26 AM

Health tips: Pica: What It Is Causes Symptoms Treatment

మా బాబుకు మూడు నెలలు. ఊయల నుంచి కింద పడిపోయాడు. ఐదు నిమిషాల పాటు ఏడ్చి, ఒకసారి వాంతి చేసి తర్వాత పడుకున్నాడు. డాక్టర్‌కు చూపించాలా? అలాగే, పిల్లలు ఇలా పడిపోతే, మొదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– సునీత, విజయవాడ

చిన్న పిల్లలు మంచం నుంచి, ఊయల నుంచి తల్లిదండ్రుల చేతుల నుంచి జారి కింద పడటం సాధారణంగా జరుగుతుంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ, నడక నేర్చుకునే సమయంలో సోఫాల మీద నుంచి పడటం, మెట్ల మీద నుంచి జారిపడటం వంటి ఘటనలు కూడా కనిపిస్తాయి. అయితే, తలకు తగిలిన గాయం తీవ్రతను బట్టి, భవిష్యత్తులో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రమైతే పిల్లల ఎదుగుదల, గుర్తుపట్టడం, కంటి చూపు, మాట, నడక వంటి అంశాలపై ప్రభావం పడవచ్చు. చిన్న గాయం అయినా కూడా కొంతవరకు మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 

కొన్ని ముఖ్యమైన లక్షణాలు గమనించాలి. 

పిల్లలు ఆపకుండా ఏడవడం 

ఫిట్స్‌ రావడం 

స్పృహ కోల్పోవడం 

చేతులు కాళ్లు సరిగా పనిచేయక పోవడం 

ముక్కు లేదా చెవి నుంచి రక్తం కారడం 

పదేపదే వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే సీటీ స్కాన్‌ చేసి మెదడులో ఏమైనా రక్తస్రావం లేదా ఎముక సమస్యలు ఉన్నాయా అని చూస్తారు. పరిస్థితిని బట్టి న్యూరో సర్జన్‌ సలహా తీసుకుని చికిత్స చేస్తారు. అయితే తలకు గాయాలు చాలా వరకు నివారించవచ్చు. తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఎత్తైన భవనాల్లో ఉంటే బాల్కనీలకు సేఫ్టీ నెట్స్‌ ఏర్పాటు చేయాలి.  బాల్కనీలో కుర్చీలు లేదా స్టూల్స్‌ ఉంచకూడదు. చిన్నపిల్లలను మంచంపై ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే మంచం పక్కన కింద బెడ్‌ లేదా మృదువైన పరుపు వేసి పడుకోబెట్టడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. పిల్లల భద్రత కోసం ముందుగానే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 

మా బాబుకు రెండేళ్లు. ఈ మధ్య చాలా తెల్లగా కనిపిస్తున్నాడు, త్వరగా అలసిపోతున్నాడు, ఆకలి కూడా తగ్గింది. కొన్నిసార్లు మట్టి తినాలని చూస్తున్నాడు. ఇది ఏమైనా సమస్యా?
– శైలజ, ఒంగోలు

పిల్లల్లో సాధారణంగా తెల్లగా లేదా పాలిపోయినట్లు కనిపించడం, త్వరగా అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు మట్టి, సున్నం వంటి వాటిని తినాలని కూడా ప్రయత్నిస్తారు. దీన్ని పికా అంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి డాక్టర్‌ను చూపించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా హిమోగ్లోబిన్‌ , ఐరన్‌ లెవల్స్‌ చెక్‌ చేస్తారు. 

పిల్లల్లో ఐరన్‌  లోపం అనేది చాలా కామన్‌  ప్రాబ్లమ్‌. మన శరీరంలో హిమోగ్లోబిన్‌ తయారవ్వడానికి ఐరన్‌  చాలా అవసరం. ఐరన్‌ తగ్గిపోతే రక్తహీనత వస్తుంది. దీని వల్ల పిల్లల ఎదుగుదల, బరువు పెరుగుదల, మెదడు వికాసం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో చురుకుదనం తగ్గిపోవడం, చదువుపై దృష్టి తగ్గడం, చిరాకు ఎక్కువగా ఉండడం కూడా కనిపించవచ్చు. ఐరన్‌  లోపం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. పిల్లలు తల్లి పాలు సరిగా తీసుకోకపోవడం, ఆరు నెలల తర్వాత ఇచ్చే అనుబంధ ఆహారంలో ఐరన్‌  తక్కువగా ఉండడం, ఒక సంవత్సరం దాటిన తర్వాత కూడా ఎక్కువగా ఆవు పాలు తాగించడం వల్ల ఈ సమస్య రావచ్చు. 

ఎక్కువ పాలు తాగడం వల్ల శరీరం ఐరన్‌ను సరిగా గ్రహించలేకపోతుంది. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం వల్ల కూడా ఐరన్‌  లోపం కనిపించవచ్చు. ఐరన్‌ లోపం ఉంటే డాక్టర్‌ సలహా మేరకు ఐరన్‌ సిరప్స్‌ లేదా డ్రాప్స్‌ ఇస్తారు. ఈ మందులు కొంతకాలం రెగ్యులర్‌గా వాడాల్సి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు రెండు మూడు వారాల్లో పిల్లలు కాస్త బాగుపడగానే మందులు ఆపేస్తారు. కానీ డాక్టర్‌ చెప్పిన పూర్తి కాలం వరకు వాడటం చాలా ముఖ్యం. అప్పుడే శరీరంలో ఐరన్‌  నిల్వలు మళ్లీ సరిగ్గా పెరుగుతాయి. ఈ సమస్య నివారణ కోసం పిల్లలకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత ఆకుకూరలు, బెల్లం, గుడ్డు, పప్పులు, రాగి జావ, మాంసం వంటి ఐరన్‌  ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం చాలా మంచిది. 

విటమిన్‌  ఇ ఎక్కువగా ఉండే నిమ్మరసం, కమలాపండు వంటి వాటితో పాటు ఐర పుష్కలంగా ఉన్న ఆహారం ఇస్తే శరీరానికి ఐరన్‌ ఇంకా బాగా అందుతుంది. మీ బాబుకి రెండేళ్లు కాబట్టి, సరైన ఆహారం, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటాడు. కాబట్టి ఆందోళన పడకుండా ఒకసారి పిల్లల వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.  

(చదవండి: హంటా రాలేదు..ఆందోళన వద్దు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement