
ఇటీవల ఆరోగ్య స్పృహ ఎక్కువై అంతా జిమ్, వాకింగ్, యోగా, వ్యాయమాలు బాట పట్టారు. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి విభిన్న రకాల వర్కౌట్లను అనుసరిస్తున్నారు. వినూత్న శైలిలో ఆరోగ్యంగా ఉండటం ఎలా అంటూ సరికొత్త యోగాలను పరిచయం చేస్తున్నారు. అలానే నెట్టింట ఇండోనేషియా బండా అషేలోని మహిళా జిమ్‌లోని సరికొత్త యోగా ఫోజ్‌లు పెద్ద దుమారం రేపి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అక్కడ మహిళలంతా వ్యాయామాలు చేస్తున్నారా..? ఊయల్లో సేదతీరుతున్నారా అని అర్థంకానీ ఫోజ్‌లలో కనిపించారు. మరి ఆ సరికొత్త యోగా భంగిమ ఏంటి..? ఎలా చేస్తారు..? ఎవరికి మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.
2004 సునామీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరమే ఈ బందా అసే. అక్కడ కాస్త మహిళలకు సంబంధించి కట్టుదట్టమైన చట్టాలు అమలులో ఉన్నా దేశం ఇది. అయితే అక్కడ మహిళా ఫిట్‌నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో యోగా క్లాసులు, పలు వెల్నెస్ సెంటర్లు నడుస్తుండటం విశేషం. అక్కడ ఓ మహిళల జిమ్‌లో ఈ వింతైన దృశ్యం కనువిందు చేసింది. ఆ మహిళలంతా ఊయల ఆసనం మాదిరి యోగా భంగిమలో వేలాడుతూ కనిపించారు. దాన్ని ఏరియల్ యోగా అని పిలుస్తారట. అదెలా చేస్తారంటే..
ఏరియల్ యోగా అంటే:
ఊయలలాంటివి లేదా పైకప్పు నుంచి వేలాడే మృదువైన వస్త్రాల సాయంతో చేసే యోగా పద్ధతి. ఇది సాధారణ యోగాతో పాటు జిమ్నాస్టిక్స్, పైలేట్స్ వంటి వర్కౌట్లను కలగలపిన ఒక ప్రత్యేకమైన యోగాసనం.
ప్రయోజనాలు..
ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది: శరీర భాగాలు గాలిలో సాగదీయబడి, కండరాలు మెరుగవుతాయి
వెన్నునొప్పి తగ్గుతుంది: వెన్నెముకపై ఒత్తిడి లేకుండా స్ట్రెచ్ అవుతుంది
ఒత్తిడి తగ్గుతుంది: గాలిలో వేలాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది
బరువు తగ్గేందుకు సహాయపడుతుంది: 50 నిమిషాల సెషన్‌లో సుమారు 320 కేలరీలు ఖర్చవుతాయి
జీర్ణక్రియ మెరుగవుతుంది: పొత్తికడుపు సమస్యలు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి
శ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుంది: ఊపిరితిత్తులకు వ్యాయామం అవుతుంది
ఎవరికి మంచిది కాదంటే..
గుండె జబ్బులు, బీనీ, గ్లకోమా, ఆర్థరైటిస్ ఉన్నవారు
గర్భిణులు, పెద్ద ఆపరేషన్ చేసినవారు
ఒకవేళ ఈ ఏరియల్ యోగా చేయాలనుకున్న నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. ఇది కేవలం మహిళలే కాదు ఆరోగ్యవంతమైన పురుషుల కూడా చేయవచ్చు. పైన చెప్పిన అనారోగ్య సమస్యలు లేనివాళ్లు ఎవరైనా నిపుణుల పర్యవేక్షలో నిస్సందేహంగా ఈ ఏరియల్ యోగాని నేర్చుకోవచ్చని చెబుతున్నారు.