బీట్‌రూట్‌తో బెనిఫిట్స్‌ ఎన్నో...

Health Benefits Of Beetroot - Sakshi

ఆరోగ్యాన్ని పెంపొందించే కూరగాయలు ఎన్నో..  కానీ ఇలాంటి పౌష్టికాహారాన్ని ఎక్కువమంది ఇష్టపడరు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ కూడా ఒకటి. చూడ్డానికి అందంగా కనిపించని బీట్‌రూట్‌ దుంపను తినడానికి పిల్లలైతే మొఖం తిప్పేస్తారు. కానీ బీట్‌రూట్‌లో ఆరోగ్యసుగుణాలు మెండుగా ఉన్నాయనేది కాదనలేని సత్యం. బయట వందల రూపాయలు ఖర్చుపెట్టి హెల్త్‌ డ్రింకులను కొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కన్నా, బీట్‌ రూట్‌ లాంటి సహజ సిద్ధ ఆహారాన్ని పచ్చిగా తిన్నా, జ్యూస్‌ చేసుకుని తాగినా, కూర వండుకుని తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి బీట్‌రూట్‌లో ఉండే ప్రయోజనాలపై ఒక లుక్కేద్దాం..
►బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేగాక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్‌ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి.
►మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్‌(పీచుపదార్థం) బీట్‌రూట్‌లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్‌రూట్‌లో గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, 3.4 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్‌ క్యాన్సర్‌ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీవక్రియలను మెరుగుపరుస్తాయి. 
►బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలికూడా వేయదు.
►బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్‌ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడనం(బీపీ) నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్‌ ఎటాక్స్‌ వంటి సమస్యలేవి తలెత్తవు.
►బీట్‌రూట్‌లో యాంటీ క్యాన్సర్‌ గుణాలు సమద్ధిగా ఉన్నాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిని బీట్‌రూట్‌ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు.
►బీట్‌రూట్‌ను రోజూ డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
►డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారికి బీట్‌రూట్‌ ఒక వరంలాంటిది. బీట్‌రూట్‌ను జ్యూస్‌రూపంలో డీ హైడ్రేషన్‌ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసరమైన నీరు బీట్‌రూట్‌ నుంచి దొరుకుతుంది.
►రక్తహీనత ఉన్నవారికి బీట్‌రూట్‌ ఒక దివ్యౌషధం. బీట్‌రూట్‌ను ప్రతిరోజూ తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది.
►విటమిన్‌ బీ6, విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.
సో.. బీట్‌రూట్‌ను సలాడ్‌గా గానీ,జ్యూస్‌ లేదా బీట్‌రూట్‌ డిప్‌గానీ తీసుకోవడం వల్ల దీనిలో పోషకాలన్నీ మీకు అందుతాయి. దైనందిన ఆహారంలో బీట్‌రూట్‌ను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో పొందవచ్చు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top