Happy Friendship Day 2023: ఆత్మబంధానికి మించి బంధం మరొకటి లేదు! | Sakshi
Sakshi News home page

మనసెరిగిన మిత్రడుకి మించిన ఆస్తి ఇంకేముంది!

Published Sun, Aug 6 2023 11:43 AM

Happy Friendship Day 2023: Value Of Friendship And Its Impotance - Sakshi

ఒక మంచి మిత్రుడు వందసార్లు అలిగినా బతిమలాడటం నేర్చుకో. ఎందుకంటే.. నీ కంఠహారంలో ఒక్క బంగారు పూస జారితేనే దొరికేదాకా వెతుకుతావు కదా!నీ మనసెరిగిన స్నేహితుడు అంతకంటే ఎక్కువే మరి! ఈ కొటేషన్‌ స్నేహం విలువకు అసలైన నిర్వచనం. ఆస్తిపాస్తులు, ఆధునిక హంగులు ఎన్ని ఉన్నా, మనిషికి.. ఆత్మపరిశీలనను మించిన ప్రక్షాళన లేదు. మనసుకు.. ఆత్మబంధాలను మించిన ఆహ్లాదమూ ఉండదు. పుట్టుకతో రక్తసంబంధాలు ఏర్పడితే, ప్రవర్తనతో ఆత్మబంధాలు ముడిపడతాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు, వాటి నుంచి పుట్టే హావభావాలను బట్టే ఆ స్నేహాలు తోడుగా నిలుస్తాయి.

గాలి మేఘంతో..  మేఘం నీటితో.. నీరు నేలతో.. నేల మొక్కతో.. మొక్క పువ్వుతో.. పువ్వు పరిమళంతో.. ఇలా సఖ్యత కుదిరిన ప్రతి చోటా స్నేహం వికసిస్తుంది. అయితే, స్వేచ్ఛ నెరిగిన పరిమళం వినువీధుల్లో విహరించేందుకు.. తిరిగి గాలితోనే జత కట్టినప్పుడు.. ప్రకృతి సహజమైన చక్రభ్రమణం ఏర్పడుతుంది. అదే సృష్టి పరిణామం. మరి అన్నివేళలా స్నేహ హస్తాన్ని అందించే గాలి విలువను పెంచాలన్నా, తుంచాలన్నా ఆ పరిమళం చేతిలోనే ఉంటుంది. ఎలా అంటే గాలిని అలముకున్నది సువాసనే అయితే, దాన్ని చుట్టూ ఉన్నవాళ్లు అమితంగా ఆస్వాదిస్తారు. అదే దుర్గంధమైతే ముక్కు చిట్లించి, ఉమ్మివేసి అవమానిస్తారు.

ప్రతిమనిషి నేర్చుకోవాల్సిన మిత్రలాభ తంత్రం ఇదే.‘ధనసాధన సంపత్తి లేనివారయ్యియు బుద్ధిమంతులు పరస్పర మైత్రి సంపాదించుకొని, స్వకార్యములు సాధించుకొందురు’ అనేది ‘మిత్రలాభం’లోని మొదటి వాక్యం. అంటే డబ్బు, సంపద లేకపోయినా బుద్ధిమంతులైన వాళ్లు ఒకరితో ఒకరు స్నేహం చేసి పరస్పర ప్రయోజనాలు సాధించుకోగలరు అని అర్థం. కలిగినదాన్ని పంచుకోవడం, రహస్యాలను చెప్పుకోవడం, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆపదలో ఒకరిని ఒకరు రక్షించుకోవడం.. ఇవే స్నేహాన్ని, ప్రీతిని తెలిపే గుణాలు. కానుకలిస్తే దేవతలే సంతోషిస్తారు. కేవలం గడ్డి వేసినందుకు.. తన దూడ సంగతైనా చూడకుండా, గడ్డి వేసినవాడికి ఆవు పుష్కలంగా పాలిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నప్పుడే నిజమైన ప్రేమతో కూడిన స్నేహం బలపడుతుంది. ఇదే స్నేహధర్మం.

సినిమాల్లో కొన్ని స్నేహాలు
ప్రేమదేశం (1996): స్నేహం కోసం ప్రేమనే త్యాగం చేసే స్నేహితుల కథ.
స్నేహం కోసం (1999): స్నేహానికి.. సేవకుడు, యజమాని అనే తేడా లేదని చూపించిన సినిమా.
ఇద్దరు మిత్రులు (1999):  స్నేహానికి ఆడ, మగ అనే లింగభేదం ఉండదని తెలిపే కథ.
స్నేహమంటే ఇదేరా (2001): ‘కుటుంబం ఎక్కువా? స్నేహమెక్కువా?’ అంటే నేస్తాన్నే ఎంచుకున్న గొప్ప స్నేహితుడి జీవితం.
నీ స్నేహం (2002): తన జీవితాన్నే త్యాగం చేసేంత గొప్ప స్నేహితుడు.. మన జీవితంలో ఉంటే ఎంత బాగుంటుందో అనిపించే సినిమా.
వసంతం (2003): ఫ్రెండ్‌ జీవితం బాగుండాలని తనకిష్టమైన గమ్యాన్ని వదిలిపెట్టిన ఓ స్నేహితుడి కథ.
హ్యాపీ డేస్‌ (2007): ఎన్ని అపార్థాలొచ్చినా నిజమైన స్నేహం ఎప్పటికీ విడిపోదని చూపిన సినిమా.
ఉన్నది ఒకటే జిందగీ (2017): ఈ ప్రపంచంలో మనిషిగా నిలబడాలంటే స్నేహితులు కావాల్సిందేనని చెప్పిన సినిమా.
కేరాఫ్‌ సూర్య (2017): ఏ ఆపదైనా తనని దాటాకే.. తన స్నేహితుడ్ని చేరాలనుకునే దమ్మున్న ధీరుడి కథ.
మహర్షి (2019): ఫ్రెండ్‌ తన కోసం చేసిన త్యాగాలను తెలుసుకుని.. తిరిగి ఆ ఫ్రెండ్‌ కళ్లల్లో ఆనందం చూడటానికి ఎన్నో మెట్లు దిగిన గొప్ప స్నేహితుడి పరిచయం ఈ సినిమా.
ఆర్‌ఆర్‌ఆర్‌ (2022): ఇద్దరు స్నేహితుల ఆశయాలూ గొప్పవే. కానీ ప్రయత్నాలే వేరు. వారి స్నేహం, బంధం అన్నదమ్ముల్ని తలపిస్తూ ఉంటుంది. న్యాయపోరాటంలో ఇద్దరి అడుగులూ ఒక్కటిగా కదిలే కథనమిది.
పాటల్లో మైత్రి
ముస్తఫా ముస్తఫా డోంట్‌ వర్రీ ముస్తఫా (ప్రేమ దేశం), దోస్త్‌ మేరా దోస్త్‌ (పెళ్లి పందిరి), మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ (స్నేహమంటే ఇదేరా), కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట (నీ స్నేహం),  పాదమెటుపోతున్నా పయనమెందాకైనా (హ్యాపీ డేస్‌), ట్రెండు మారినా ఫ్రెండు మారడే (ఉన్నది ఒకటే జిందగీ)

12 మనస్తత్వాలమిత్రులు మనకోసం
‘శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. మిత్రులు వందమంది అయినా తక్కువే’ అన్నారు స్వామీ వివేకానంద. జీవితంలో ఎంతమంది మిత్రులున్నా స్నేహాన్వేషకులకు చాలదు. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఈ 12 రకాల స్నేహితులు దక్కితే.. జిందగీ సాఫీగా సాగుతుందట.

1. ఎమోషనల్‌ పర్సన్‌
నీ ముఖంలో చిరునవ్వు చెదిరితే తన కళ్లల్లో నీళ్లొచ్చేంత భావోద్వేగం తనలో ఉంటే.. ఆ బంధం మరణం దాకా శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి దోస్తులు ఆపదలో వెన్నంటే ఉంటారు.

2. మార్గదర్శి
బంధువుల్లో, పొరుగువారిలో లేదా తెలిసినవారిలో ఆదర్శంగా నిలిచినవారే ఈ మార్గదర్శి. ఇలాంటి వారితో స్నేహం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కెరీర్‌లో సెటిల్‌ కావడానికి.. భవిష్యత్తులో ముందడుగు వేయడానికి వీరి సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. 

3. నాయకత్వ లక్షణాలతో ఉన్నవారు..
ఇలాంటి వారు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. వీరికి మంచి నెట్‌వర్క్‌ ఉంటుంది. సేవాగుణం కూడా ఉంటుంది. ఇలాంటి వారికి చాలా విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. మనం ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇలాంటివాళ్ల సాయంతో సురక్షితంగా బయటపడొచ్చు.

4. డిఫరెంట్‌ మైండ్‌ సెట్‌..
మనకు మనలానే ఆలోచించే స్నేహితులుంటే ప్రపంచానికి మనం దూరమయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే మన ఆలోచనలకు వ్యతిరేక దిశలో ఆలోచించే స్నేహితులు కూడా ఉండాలి. అప్పుడే మనలో మానసిక సంఘర్షణ మొదలవుతుంది. మంచి, చెడులతో పాటు లోకం పోకడ అర్థమవుతుంది. ఇలాంటి వారితో స్నేహం.. వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుంది.

కొన్ని మంచి కొటేషన్‌లు

స్నేహితుడు దైవంతో సమానం. కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది. 
– మహాత్మా గాంధీ

నేను కాంతిలో ఒంటరిగా కాకుండా.. చీకటిలో స్నేహితుడితో నడవడానికి ఇష్టపడతాను.
– హెలెన్‌ కెల్లర్, 
అమెరికన్‌ రచయిత్రిఒక వ్యక్తి మరో వ్యక్తితో... ఇక్కడ నేనే ఉన్నాను అనుకున్నాను. నువ్వు కూడా ఉన్నావా? అన్నప్పుడు స్నేహం మొదలవుతుంది.
– సీఎస్‌ లెవిస్, 
బ్రిటిష్‌ రచయితనా స్నేహితులే నా ఆస్తి.
– ఎమిలీ డికిన్సన్, అమెరికన్‌ కవయిత్రి 

(చదవండి: ‘స్నేహంతో పని జరిగినప్పుడు, శత్రుత్వంతో పనెందుకు!)

Advertisement
 
Advertisement
 
Advertisement