గుస్సాడి గుండెచప్పుడు పద్మశ్రీ కనకరాజు

Gussadis heartbeat is Padma Shri Kanakaraj - Sakshi

నెమలీకల టోపీ ధరించి కోలాహలంగా ఆడతారు.  రేలా... రే... రేలా అంటూ గొంతు కలిపి పా డతారు. ప్రకృతి గురువు నేర్పిన పా ఠాలకు ఆనవాళ్లు వారు.  మొన్నటి వరకు అడవి తల్లి ఒడిలో దాగిన కళారూపా లివన్నీ. నేడవి అడవి గోడలు దాటి నగరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశం ఎల్లలు కూడా దాటే వరకు గుస్సాడి ఆడాలంటున్నారు... పద్మశ్రీ కనకరాజు. 

కనకరాజు పేరులో ఇంటి పేరు కనక, ఆయన పేరు రాజు. ఇన్ని వివరాలు మాకక్కర్లేదు, గుస్సాడి నృత్యం చేస్తాడు, మా అందరి చేత అడుగు వేయిస్తాడు కాబట్టి ఆయన మాకు ‘గుస్సాడి రాజు’ అంటారు స్థానికులు. ఆయన పద్మశ్రీ అందుకున్నప్పటి నుంచి నాగరక ప్రపంచం ఆయన మీద దృష్టి కేంద్రీకరించింది. కనకరాజు అని ఇంటిపేరుతో కలిసి వ్యవహారంలోకి వచ్చారు. అయినప్పటికీ వారి గూడేలకు వెళ్లి కనకరాజు అని అడిగితే వెంటనే గుర్తుపట్టరు.

గుస్సాడి కనకరాజు అంటే టక్కున చెప్పేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మర్హలి ఆయన ఊరు. ప్రస్తుతం కుమ్రుం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా, అంతేకాదు, కుమ్రుం భీమ్‌ వారసులు కూడా. ఆదిలాబాద్‌లో విస్తరించిన గోంద్‌ తెగకు చెందిన వాళ్లందరూ భీమ్‌ వారసులుగా గర్వంగా భావిస్తారు. ఎనభై ఏళ్ల కనకరాజు... తండ్రి చెప్పిన మాట కోసం గుస్సాడి నృత్యం పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేశారు. గుస్సాడితో మమేకమైన తన జీవితానుభవాలను సాక్షితో పంచుకున్నారాయన. 

 ఆట... పా ట... జీవితం!
‘‘మా ఆదివాసీల జీవనంలో ప్రకృతి, నృత్యం, గానం కలగలిసి పోయి ఉంటాయి. బిడ్డ పుడితే పా ట, పెళ్లి వేడుకకీ పా ట, అంతేకాదు... మనిషి పోయినా పా ట రూపంలో ఆ వ్యక్తితో మా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాం. దండారీ ఉత్సవాలంటే మాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. మగపిల్లలకు నృత్యం, ఆడపిల్లలకు రేలా పా ట చిన్నప్పటి నుంచే నేర్పిస్తాం.

గుస్సాడి నృత్యంలో అడుగులు వేయడం ఎప్పుడు మొదలైందో నాకు గుర్తు లేదు. కానీ మా నాన్న  ఒక మాట చెప్పేవారు. ‘ఈ నృత్యమే మనకు దైవం. ‘ఈ నృత్యాన్ని మరువద్దు. తరతరాలుగా మోసుకొస్తున్నాం. దీన్ని కాపా డుకుంటేనే దేవుడు మనల్ని కాపా డుతాడు’ అని చెప్పేవాడు. ఆ మాట నాలో నాటుకుపోయింది. నాకు వయసొచ్చినప్పటి నుంచి నృత్యంలో తొలి ఆటగాడిగా అడుగులు వేస్తుండేవాణ్ని. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు నివసించే రెండువేల గూడేలకూ నేను తెలిసిపోయాను.  

గణతంత్ర వేడుక
గణతంత్ర వేడుకల్లో మా ప్రాచీన వారసత్వ కళ అయిన గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం నాకు 1982లో వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి మా గుస్సాడి టోపీ పెట్టించి, గజ్జెలు కట్టించాం. ఆమె మాతో అడుగులు వేసింది. ఆ తర్వాత ఓసారి అబ్దుల్‌ కలామ్‌ కూడా మాతో అడుగులు వేశారు.

హైదరాబాద్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చామో లెక్కేలేదు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో కూడా మా గుస్సాడిని ప్రదర్శించాం. మరో పది దఫాలు యువతతో చేయించాం. నాయన మాట మీద గుస్సాడి కోసం బతికినందుకే మా దేవుడు మెచ్చి గొప్ప వాళ్లకిచ్చే పద్మశ్రీని ఇప్పించాడనుకుంటున్నా. 

నెమలీకల టోపీ
మా నృత్యం సాధన చేయడమే కాదు, టోపీ, దుస్తులు, గజ్జెలు అన్నీ ప్రత్యేకమే. వాటిని తయారు చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి. పెద్ద టోపీకి రెండు వేల పింఛాలుంటాయి. మా ఇళ్లలో వాటిని భద్రపరుచుకోవడం పెద్ద పని. మా ముత్తాతలు ధరించిన టోపీ ఇంకా నేను ధరిస్తూనే ఉన్నాను. కొత్తవాళ్ల కోసం టోపీలు తయారు చేస్తున్నాం. పెద్ద టోపీ, దుస్తులతోపా టు మొత్తం వేషానికి ఇరవై వేల రూపా యలవుతాయి.

మా ఆదివాసీ వ్యక్తి తుకారామ్‌ సాబ్‌ కలెక్టర్‌ అయిన తరవాత ఈ నృత్యానికి ఇంకా కొన్ని చేర్పులు చేసి బాగా మంచిగా చేశారు. పద్మశ్రీ వచ్చిన తర్వాత ఐటీడీఏ ఆఫీసర్‌లు గుస్సాడి నృత్యం నేర్పించడానికి వందకు పైగా బడులు పెట్టారు. ఒక్కో బడిలో రెండు– మూడు వందల మంది నేర్చుకుంటున్నారు. నేను పెద్ద మాస్టర్‌ (చీఫ్‌ డాన్స్‌ మాస్టర్‌)ని. గుస్సాడి, రేలా పా ట నేర్పించడానికి 30 మందిని ప్రత్యేకంగా తయారు చేశాను. మరో రెండు వందల మందికి సంపూర్ణంగా శిక్షణనిచ్చాను. ఇంక మామూలుగా నేర్చుకుని ఆడే వాళ్లు ఎన్ని వేల మంది ఉన్నారో నేను ఎప్పుడూ లెక్క చెప్పుకోలేదు.  

అడవి తల్లికి అందరూ ఒక్కటే! 
మా ఆదివాసీల్లో మగపిల్లాడు ఎక్కువ, ఆడపిల్ల తక్కువనే ఆలోచనే ఉండదు. బిడ్డలంతా సమమే. పెళ్లిలో కట్నకానుకలు ఉండవు. ఆడబిడ్డ పుట్టిందని చింతపడడం మాకు తెలియదు. నాకు ఎనిమిది మంది కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. బతకడానికి ఆశ్రమ పా ఠశాలలో రోజు కూలీగా పని చేస్తూ కూడా అందరికీ చదువు చెప్పించాను. తొమ్మిది– పది తరగతుల వరకు అందరూ చదువుకున్నారు.

రెండో కొడుకు వెంకటేశ్‌ మాత్రం డిగ్రీ చదివి టీచర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తరతరాలుగా అడవులకే పరిమితమైపోయిన గుస్సాడి నృత్యాన్ని నేను దేశానికి తెలియ చెప్పా ను. మీరు మన ఆట, పా టలను ఇతర దేశాలకు తీసుకెళ్లాలని నా పిల్లలు, శిష్యులకు చెబుతున్నాను’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు గుస్సాడి కనకరాజు. 

– వాకా మంజులారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top