
దసరా అంటే ఆయుధాల పూజ మాత్రమే కాదు బంతి పూల సింగడీ పూజ. లేఎండ తగిలిన పచ్చగడ్డి భూతల్లికి వేసే ఆవిరి ధూపం. మెట్ట ప్రాంతాల సౌరభం. స్త్రీలు ఎర్రమట్టితో అలికే ఇంటి ముంగిలి కళ. చెరువులు నిండి, వాగులు పొంగే కాలం. ప్రతి ఊరిలో పట్టనలవిగాని సంబరం... ‘దసరా’ గురించి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న చెబుతున్న విశేషాలు.
దసరా పండుగ మా దక్షిణ తెలంగాణ లో గొప్పగా జరుపుకుంటాం. దుందుభి, కృష్ణ నదుల నడిమధ్యన ఉండే ప్రాంతం మాది. చిన్నప్పుడు దసరా వస్తే ఊళ్లో ‘అమ్మా వినవే జామి’... అని జమ్మిచెట్టు మీద కట్టిన జానపద పాటలు స్త్రీల నోటి నుంచి వినిపించేవి. జమ్మి చెట్టు మీద పాండవులు ఆయుధాలు దాచడం, వాటిని కిందకు దించాక అర్జునుడు యుద్ధం చేసి గెలవడం ఈ విరాట పర్వం అంతా ప్రజలకు ఇష్టంగా మారిన గాథ. అందుకే దసరాకు పాడుకుంటారు.
దసరా సమయంలో యక్షగానం ఊరూరా ఉంటుంది. కొన్ని చోట్ల శశిరేఖా పరిణయం ఆడతారు. దసరా పండుగ ప్రాకృతిక శోభ నిండి ఉన్నప్పుడు వస్తుంది. భూమాత వానకు తడిసి, ఎండ తగలడం వల్ల అంత తడిగా, పొడిగా కాకుండా మెత్తగా ఉంటుంది. వేరుశనగ బుడ్డలు అప్పుడప్పుడే గింజ గట్టి పడుతూ ఉంటాయి. జొన్న, సజ్జ, రాగి, కంది పొలాలు పంటతో మురిసి పోతూ ఉంటాయి.
అలసందలు ఆ సమయంలోనే కోతకు వస్తాయి. పెసర, బీర తీగలు, కాకర పాదులు, చిక్కుడు చెట్లు కళకళలాడుతుంటాయి. నా చిన్నప్పుడు మాకున్నది మూడు నాలుగు ఎకరాలే అయినా మా చేనులో చిన్న గుడిసె ఉంటే అక్కడే ఉండేవాణ్ణి. పంటలు పండిన పొలాల మీదకు గువ్వలు వస్తాయి. వాటిలో పాలపిట్టను చూసి సంతోషపడేది. పండగ రోజు మాత్రమే కాదు.. ఆ సీజన్లో ఎప్పుడు పాల పిట్ట కనపడినా ఎంతో సంతోషం కలుగుతుంది. దానిని చూడటం శుభకరం అని భావిస్తారు.
దసరా నాటికి వానలు పడి చెరువులు నిండి ఉంటాయి. వాగులు పారుతుంటాయి. చేపలు ఎదురెక్కుతుంటాయి. నల్ల తుమ్మలు నిండుగా గాలికి ఊగుతుంటాయి. వలస పక్షులు వాలుతాయి. పండగ సమయంలో దేవతలు, యక్షులు పక్షుల రూపంలో వచ్చి వాలుతాయని అనుకునేది. అందుకే ‘తిప్ప తీగల వీణ మీటుతూ రాగమాలికలు పాడే పిట్టలు’ అని రాశాను.
తెలంగాణలో దసరా పండగకు తప్పనిసరిగా ఆడబిడ్డలను పదిరోజుల ముందే తీసుకు వస్తారు. స్త్రీలు ఎర్రమట్టి తెచ్చి ఇల్లంతా సుందరంగా అలుక్కుంటారు. ఆ ఎర్రమన్ను తెచ్చుకునే సమయంలో స్త్రీలు కదిలి వస్తుంటే చూసి పిల్లలందరం పండగ కళ రాబోతున్నదని కేరింతలు కొట్టేవాళ్లం. దసరా సమయానికే సీతాఫలం చెట్లు విరగకాసి ఉంటాయి.
మా చిన్నప్పుడు వాటిని కాల్చుకుని తినడం గొప్ప ఆహారం. ఎన్ని తినేవారమో లెక్కే లేదు. దసరా అంటే పూల పండగ. సమయంలో ఊరిలో, ఇళ్లలో, పొలాల గట్ల మీద బంతి పూలు పూస్తాయి. వాటిని తెచ్చి మామిడాకులు, పోక పూలు అన్ని కలిపి ప్రతి ఇంటి దర్వాజాలకు, ద్వారబంధాలకు కళాత్మకంగా కట్టి శోభను తీసుకు వస్తారు. దసరా అంటే బరిలో గెలిచిన ఆయుధ పూజ మాత్రమే కాదు బంతిపూల సింగడి పూజ.
దసరా సమయంలో నేలంతా రకరకాల గడ్డి మొలిచి ఉంటుంది. ఎండ తగిలినప్పుడు సూర్యకిరణాల తాపంతో వీటి నుంచి సన్నటి ఆవిరి లేచి భూతల్లికి ధూపం వేసినట్టు ఉంటుంది. ఆ గడ్డి మీదుగా వీచే గాలిలోని వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. పండగ రోజు జమ్మి కోసం వెళ్లడం... దానికి బండ్లు కట్టడం అదో ఉత్సవం.
నా చిన్నప్పుడు నా స్నేహితులు నాగయ్య, మల్లయ్య, బుచ్చయ్య, అంజయ్య, కూర్మయ్య మా మేనమామ నరసింహయ్య మేమందరం తప్పనిసరిగా కలిసేవాళ్లం. మేం మాత్రమే కట్టుగా ఉండి పొలాల వెంట తిరిగేవాళ్లం. ఈ కాలంలోనే ఈత కల్లు మొదలవుతుంది. నురగ పడుతది. దసరా పండగలో తినడం, సంతోషంగా గడపడం ప్రజలకు కొత్త ఉత్సాహం ఇస్తుంది. దసరా దశ దిశలా సంతోషాలు తెచ్చే పండుగ.