
దసరా సీజన్‌లో 55,332 వాహనాల విక్రయం
సర్కార్‌కు రూ.360.08 కోట్ల ఆదాయం
ఈ ఏడాది డిసెంబర్ వరకు ఇదే స్పీడ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల అమ్మకాలు టాప్‌గేర్‌లో పరుగులు తీస్తున్నాయి. గత నెలలో జీఎస్టీ తగ్గించినప్పటి నుంచి అమ్మకాలు ఊపందుకున్నాయి. దసరా సందర్భంగా కేవలం 12 రోజుల వ్యవధిలో 55 వేలకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ వాహనాలపైన జీవితకాల పన్ను రూపంలో రవాణాశాఖకు సుమారు రూ.360.08 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది కంటే ఇది ఎక్కువ. అలాగే ఈ దీపావళి సందర్భంగా కూడా అమ్మకాల జోరు అదేవిధంగా కొనసాగుతున్నట్లు ఆటోమొబైల్ డీలర్స్ తెలిపారు. ఈ ఏడాది ఆరంభం నుంచి వాహనాల అమ్మకాల్లో కొంత వరకు స్తబ్దత నెలకొంది.
జీఎస్టీ తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన అనంతరం జూలై, ఆగస్టు నెలల్లో అమ్మకాలు భారీగా తగ్గాయి. సెపె్టంబర్ 22 నుంచి ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా ఈ ఊపు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షల ఖరీదైన కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాహనాలకే బుకింగ్ ఆర్డర్‌లు ఎక్కువగా వస్తున్నాయని డీలర్లు చెప్పారు.
సొంత కారు కల సాకారం...
అనూహ్యంగా పెరిగిన వాహనాల ధరల దృష్ట్యా వాహనం కొనుగోలు చేయలేని మధ్యతరగతి వేతనజీవుల ‘సొంత కారు’ కల జీఎస్టీ తగ్గింపుతో సాకారమవుతోంది. తమ చిరకాల వాహనయోగ కోరికను తీర్చుకొనేందుకు కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దసరా సందర్భంగా గత నెల 22వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు 13,,022 కార్లు, మరో 1221 క్యాబ్‌లు, అలాగే 41,089 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు గత సంవత్సరం (దసరా సందర్భంగా) అక్టోబర్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 9,768 కార్లు, 856 క్యాబ్‌లు, 38,955 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే వాహనాల విక్రయాలు పెరిగినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ దీపావళి పర్వదినం సందర్భంగా కూడా అదే జోరు కనిపిస్తుందని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వివిధ శ్రేణులకు చెందిన వాహనాలపైన ఆటోమొబైల్ డీలర్‌లు సైతం ప్రత్యేక ఆఫర్‌లు, రాయితీలను ప్రకటించారు. దీంతో ధరల తగ్గింపులో ఆకర్షణీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ విధంగా కూడా చాలామంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
మూడు నెలల వరకు బుకింగ్‌లు..
‘కొన్ని కేటగిరీలకు చెందిన వాహనాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.దీంతో చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. 3 నెలల వరకు కూడా ఇప్పటికే బుక్ అయ్యాయి.’ అని సోమాజిగూడ ప్రాంతానికి చెందిన ఒక డీలర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో రోజుకు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. వాటిలో 400 నుంచి 500 వరకు కార్లు ఉంటే మిగతావి ద్విచక్ర వాహనాలే.‘ ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా వాహనాల అమ్మకాలు పెరిగినట్లు బేగంపేట్‌కు చెందిన ఒక ఆటోమొబైల్ డీలర్ చెప్పారు.
జీఎస్టీ తగ్గింపు ప్రభావం హైఎండ్ వాహనాల కంటే చిన్న కార్లపైన ఎక్కువగా ఉంది. రూ.20 లక్షల కంటే తక్కువ ఖరీదైన వాహనాల ధరలు తగ్గాయి. ఈ ధరల్లో వివిధ రకాల బ్రాండ్‌లకు చెందిన వాహనాలపైన సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గడంతో కొనుగోళ్లు పెరిగాయి. జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆటోమొబైల్ డీలర్లు సుమారు రూ.50,000 నుంచి రూ.80,000 వరకు ధరల తగ్గింపుతో ఆఫర్‌లను, రాయితీలను అందజేస్తున్నారు.