విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె! | Sakshi
Sakshi News home page

విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె!

Published Sun, Mar 31 2024 11:45 AM

Former CPM General Secretary Wife Brinda Karat Teaches Air India To Wear Sari - Sakshi

విమాన సిబ్బందిలో మహిళలు పనిచేయాలంటే కచ్చితంగా స్కర్టులు, కోట్లు ధరించాల్సిందే. అందులోనూ లండన్‌లో అయితే కచ్చితంగా ఆ ఆహార్యంలోనే ఉండాల్సిందే. భారతీయ మహిళలైనా ఆ రూల్స్‌ పాటించక తపని రోజులవి. కానీ ఓ మహిళ ఆ ఎయిర్‌ ఇండియా రూల్స్‌నే తిరగరాసింది. చీరకట్టుతోనే పనిచేస్తామని తెగేసి చెప్పడమే గాక ఉద్యమం చేసి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఎయిర్‌ ఇండియాలో పనిచేసే ప్రతి సిబ్బంది చీరకట్టకునేలా చేసింది. అంతేగాదు రాజకీయాల్లోకి రావడానికి మహిళలు భయపడుతున్న రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన గళం వినిపిస్తూ అంచెలంచెలుగా పైకొస్తూ.. మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నేటితరానికి, భవిష్యత్తుతరాలకు స్ఫూర్తిగా నిలిచే గొప్ప వ్యక్తి. ఎవరీమె అంటే..

ఆమె పేరు బృందా కారత్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిగ్గా రెండు నెలలకు పుట్టారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే ఆమె అదే ఏడాది అక్టోబర్ 17న కోల్‌కతాలో జన్మించారు. తండ్రి సూరజ్ లాల్ దాస్ పాకిస్తాన్లోని లాహోర్ నుంచి వలస వచ్చారు. తల్లి ఒషుకోనా మిత్ర బెంగాలి. వీళ్లది ప్రేమ పెళ్లి. పెద్దలు వ్యతిరేకించి మరీ ఓషుకోనా సూరజ్‌ని పెళ్లి చేసుకున్నారు. బృందాకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఐదేళ్ల వయసులో బృందా తన తల్లి ఒషుకోనా మిత్రను కోల్పోయినా తండ్రి తన పిల్లల్ని చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు.

ఎన్.డి.టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ప్రణయ్ రాయ్‌ని పెళ్లాడిన రాధిక ఆమె చెల్లెలే. బృందా ప్రాథమిక విద్య డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పూర్తి చేశారు. ఆమె 16 ఏళ్ల వయస్సులో మిరిండా హౌస్‌లోని దర్హి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి బీఏ పట్టా తీసుకున్నారు. అప్పుడే ఆమె తండ్రి సూరజ్ లాల్ దాస్ తన కుమార్తె బందాను పిలిచి నేను చదువు చెప్పించా. ఇక నువ్వు నీ కాళ్ళపై నిలబడాలని సూచించారు. దీంతో ఆమె 1967లో లండన్‌ వెళ్లి ఎయిర్ ఇండియాలో చేరారు. అయితే లండన్‌లోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా స్కర్ట్ లు వేసుకోవాల్సిందే తప్ప చీరె కట్టును అనుమతించరు. అందుకు ససేమిరా అని బృందాకారత్‌ తెగేసి చెప్పడం జరిగింది.

ఆ టైంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్. ఆయన కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చీర ధరించేందుకు అనమితించమని చెప్పేశారు. అయితే తాము సమ్మే చేస్తామని నిర్భయంగా చెప్పింది బృందాకారత్‌. చేస్కోండి! అని ఆయన కూడా తీసిపడేసినట్లుగా అన్నారు. దీంతో ఆమె చీరే కట్టుకుంటాం అనే డిమాండ్‌తో నిరవధికంగా మూడు రోజు సమ్మే చేసి మరీ ఎయిర్‌ ఇండియా మెడలు వంచింది బృందా. దెబ్బకి ఆ ఎయిర్‌ ఇండియా మేనేజర్‌ అలాన్ దిగి రావడమే గాక మీరే విజయం సాధించారు, పైగా ఎయిర్‌ ఇండియాలో ప్రతి ఒక్కరూ చీరకట్టుకునేలా చేశారు అన్నారట.

కానీ బృందాకారత్‌ ఆ మాటలకు పొంగిపోలేదు. ఈ విజయం తనదేనని ఒప్పుకోలేదు. "సారీ, గెలిచింది నేను కాదు. శారీ జాతీయవాదం" అని చెప్పి ఎయిర్‌ ఇండియా అధికారిని షాక్‌కి గురయ్యేలా చేసిందట. ఆమె తన వ్యక్తిగత విజయాన్ని జాతీయ వాదంతో పోల్చి చెప్పడమేగాక ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి బదులు అందరికీ వర్తింపజేసేలా మాట్లాడినందుకు...ఆమెను అభినందించకుండా ఉండలేక పోయారు ఆయన. అంతేగాదు అలా ఎయిర్‌ ఇండియాకు సెలక్ట్‌ అయిన బ్రిటిష్‌ యువతులందరికీ చీరకట్టుకోవడం నేర్పించారు బృందాకారత్‌. అలా ఆమె అక్కడ కొంతకాలం పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సీపీఎం అనుబంధ సంఘాలలో పని చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రాని రోజుల్లో వామపక్ష రాజకీయాల వైపుకి వెళ్లారు. 

అరుదైన కమ్యూనిస్టు రాజకీయ వేత్తగా ఎదిగారు. నుదుట పెద్ద బొట్టు, ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని వర్చసు ఉన్న బృందా అనర్ఘళంగా హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ, కొన్ని తెలుగు పదాలు మాట్లాడగలరు. దేశంలో ఫెమినిస్ట్ ఉద్యమానికి ఊపిరులు వారిలో బృందా కారత్ ఒకరు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఎం తరఫున రాజ్యసభకు 2005 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2005లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళ బృందా కారత్. అంతేగాదు ఆమె సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య. ఇక బృందా కారత్ 1975 నాటి ఎమర్జెన్సీ మొదలు కమ్యూనిస్టు ఉద్యమం ఉజ్వలంగా సాగిన1985 వరకు తన జ్ఞాపకాలను, ఇతర వ్యాసాలను కలిపి ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు.

“యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా” పేరిట ఈ పుస్తకాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే నేటితరం యువత తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం లాంటివే. కనువిప్పు కలిగించేవే. పదేళ్ళ చరిత్రను కళ్లకు కట్టారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలోని పదేళ్ల కాలాన్ని గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రాయడమంటే మామూలు విషయం కాదు.పైగా ఈ పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలం నుంచి మొదలు పెట్టి ఢిల్లీ గల్లీలలో జరిగిన పోరాటాలను, కష్టకాలంలో జరిగిన చర్చల్ని, నాయకుల తీరు తెన్నులన్నింటిని చక్కగా వివరించారు.

అయితే అందులో ఉన్న రీటీ ఎవరో కాదు బృందాయే అని పుస్తకం చదివిన తర్వాత గానీ తెలియదు. అయితే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలపి పోరాడిన ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక తానెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని ప్రశ్నిస్తే మాత్రం బృందా..తన వయసు 70 దాటిందని, ఈ వయసులో పరిగెత్తడం సమంజసం కాదని చెబుతుంటారామె. నేటి పరిస్థితులన్ని మార్చాలంటే  యువతీ యువకులే నడుం కట్టాలని చెబుతుంటారు. ఈ ఎన్నికల్లోనైనా మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారనే ఆశతో చూస్తున్నారామె.

(చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్‌ అయిన యువతి!)

Advertisement
Advertisement