
ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఓ ట్రెండే.. అది ఫ్యాషన్ అయినా.. లైఫ్ స్టైల్ అయినా.. పేర్లు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఆసక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.. వాడే వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా తమ భావాన్ని వ్యక్తికరించాలనే తపనలో ప్రస్తుత తరం యువత ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలోని డైలాగ్ గుర్తుందా..! ‘పుష్ప అంటే పేరుకాదు పుష్ప అంటే బ్రాండ్’ అన్నట్లు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. అయితే ఇందులోనూ ఎవరి ట్రెండ్ వారిదే.. ఎవరి బ్రాండ్ వారిదే..
ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం అందాన్ని పెంచేదో, ఆధునికతను చూపించేదో మాత్రమే కాదు. తమ తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘తమ గురించి తాము చెప్పుకునే’ ఫ్యాషన్ ట్రెండ్. ఇప్పుడు నగరంలో ఈ తరహా ట్రెండ్ ఊపందుకొంది. వ్యక్తిగత అభిరుచిని బట్టి అలాంటి సెల్ఫ్–ఎక్స్‌ప్రెషన్ స్టైల్స్ విభిన్న రకాలుగా ఉంటున్నాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పలు బ్రాండ్లు సైతం వినూత్న ఫ్యాషన్లను ఆవిష్కరిస్తున్నాయి.
కఫ్ లింక్స్ పై పేర్లు..
ఇటీవల తమ పేరు లేదా వ్యక్తిగత గుర్తింపుతో కూడిన కఫ్ లింక్స్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న అలంకరణలతో, చేతి చివర్లలో ధరించే ఈ కఫ్ లింక్స్‌లో పేరు, ఇంకేమైనా ప్రత్యేకమైన డిజైన్లు చెక్కించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ ఫార్మల్ వేర్‌లో భాగంగా మాత్రమే వినియోగించే హ్యాండ్‌మేడ్ – కస్టమ్ – డిజైన్ బంగారం, వెండి లాంటి మెటల్స్‌తో తయారవుతున్నాయి.
పేర్లు, లక్షణాల ప్రాతిపదికన డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే వీటిని బహుమతులుగానూ వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా యువతలో, పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ పేరు లేదా ఇనీíÙయల్స్‌తో ప్రత్యేకత చూపించాలనుకునే వారి వల్ల బాగా పాపులర్ అవుతోంది. ఫ్యాషన్ రంగ నిపుణులు కూడా ఈ ట్రెండ్‌ను ‘పర్సనలైజ్డ్ ఎలిగెన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు, సంప్రదాయ ఆధునికతల కలయికగా మన నగరంలో మారుతున్నాయని చెబుతున్నారు. కేవలం కఫ్‌లింక్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత గుర్తింపును ఫ్యాషన్‌లో కలిపే ట్రెండ్స్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి.
సొంత/ఇంటి పేరుతో లేదా మొదటి అక్షరంతో డిజైన్ చేసిన గొలుసులు. నేమ్ నెక్లెస్ / ఇసీíÙయల్ పెండెంట్స్, రింగ్స్ వంటివి సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ లాంటి మెటల్స్‌లో లభ్యం అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో, ప్రేమ జంటల్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
జాకెట్లు/శాలువాలు : షర్ట్, జాకెట్స్(బ్లేజర్స్)పై పేరు లేదా చిన్న మెసేజ్‌ను ఎంబ్రాయిడరీతో బ్రాండెడ్ లోగో తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డ్రెస్‌కి ఓ వ్యక్తిగత టచ్ ఇచ్చేలా చేస్తుంది.
కస్టమ్ మేడ్ టి–షర్ట్స్, ప్రింట్ చేసిన పేరు, ఫేవరెట్ కోట్, బర్త్‌డేట్ లేదా క్యారెక్టర్ డ్రాయింగ్‌తో కూడిన డిజైన్లు, గ్రూప్ ఈవెంట్స్, బర్త్‌డేలు, ట్రావెల్ వంటి సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
సొంత పేర్లను కాకపోయినా, తమ భావోద్వేగాలు ప్రతిబింబించే పదాలు, సంకేతాలు టాటూలుగా వేయించుకోవడం కూడా సెల్ఫ్–ఎక్స్‌ప్రెషన్‌లో భాగమే.
పేర్లు, ఇనీషియల్స్‌తో కూడిన స్నీకర్స్, లేదా ఫేవరెట్ డిజైన్‌తో ఉండే పాదరక్షలు, షూ డిజైన్లుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘నైక్’ వంటి బ్రాండ్లు కూడా కస్టమైజేషన్‌కు అవకాశం ఇస్తున్నాయి.
ఇండియన్ వెడ్డింగ్ డ్రెస్‌లపై పేర్లు కాడలుగా అల్లడం పెళ్లి కూతురు లేదా వరుడు దుస్తుల్లో తన పేరు లేదా జంట పేరు అల్లించుకోవడం ట్రెండ్‌గా మారుతోంది.
అలాగే బ్యాగ్స్, వాలెట్స్, ట్రావెల్ పౌచ్‌లు తదితర పర్సనల్ ఐటమ్స్‌పై మోనోగ్రామ్‌లు, నేమ్ ఇనీషియల్స్‌తో ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్ కూడా విరివిగా వాడుతున్నారు. ఇవి లగ్జరీ బ్రాండ్స్ (లూయిస్ విటన్, గూచి) నుంచి చిన్న ఆర్టిసన్ స్టోర్ల వరకూ అందుబాటులో ఉన్నాయి.
(చదవండి: జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..! లేదంటే వర్షపు వ్యాధుల ముప్పు..)