‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..! | Family Doubts Dr Vishal Indla | Sakshi
Sakshi News home page

‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!

May 29 2025 7:51 AM | Updated on May 29 2025 3:54 PM

 Family Doubts Dr Vishal Indla

నమస్తే డాక్టరు గారు. నాకు సంవత్సరం క్రితం పెళ్ళయింది. నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వర్క్‌ ఫ్రం హోం చేస్తారు. చాలామంచి వ్యక్తి. మా అత్తయ్య వాళ్లకి ఒక్కడే కొడుకు, పెళ్ళికి ముందు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఎంతో ఇష్టపడి నన్ను పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒకటే సమస్య మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్‌ అయ్యారు. అప్పటి నుండి ఆత్మన్యూనతా భావంతో ఉంటున్నారు. నాతో ఫ్రీగా ఉండరు. 

సరదాగా మాట్లాడరు. నేను ప్రేమగా దగ్గరికి వెళ్తే ముడుచుకుపోతారు. తాను సంసారానికి పనికిరానని, నన్ను వేరే పెళ్ళి చేసుకోమని అంటున్నారు. మా అత్త మామలకు చేప్తే హైదరాబాద్‌ వెళ్ళి యూరాలజిస్ట్‌కి చూపించారు. ఆయన అన్ని పరీక్షలు చేసి అంతా బాగానే ఉంది. మందులు కూడా అవసరం లేదు. సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తారు. భార్యాభర్తల మధ్య మామూలుగా జరగాల్సిన సంసారానికి కూడా ట్రీట్మెంట్‌ ఉంటుందంటారా? కౌన్సిలింగ్‌తో ఇలాంటి సమస్యలు తగ్గించవచ్చా? అసలు మా వారికి ఎలాంటి సమస్య ఉందంటారు? ఆయనంటే నాకు చాలా ఇష్టం. తనని నేను వదులుకోలేను. నన్నేం చేయమంటారో చెప్పండి. 
– ఓ సోదరి,  గుడివాడ

మీ ఉత్తరాన్ని చదివాక మీ భర్త ఎంతో మంచి వ్యక్తి, కానీ ఒక సున్నితమైన సమస్యను ఎదుర్కొంటున్నారు అని అర్థమైంది. ఇది చాలామంది పురుషుల్లో కనిపించే ఒక సాధారణ సమస్య. దీన్ని ‘సైకోజెనిక్‌ ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌‘ అంటారు. మనస్సులో ఉండే ఒత్తిడి, భయం, ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల సమస్య కలగొచ్చు. ఒకటి రెండుసార్లు ఫెయిల్యూర్‌ జరిగిన తర్వాత, భయంతో... బిడియంతో దూరంగా ఉండటం మొదలవుతుంది. 

తర్వాత డిప్రెషన్‌కి గురి అవుతారు. తాము ఇక సంసార జీవితానికి పనికిరామని అనుకుంటారు. యురాలజిస్ట్‌ చెప్పినట్లు ఒక మంచి సైకియాట్రిస్ట్‌ని కలవండి. అతని ఒత్తిడికి కారణం కనుక్కుంటారు. ముందు తనలో ఆత్మ విశ్వాసం పెరిగేలా కౌన్సెలింగ్‌ చేస్తారు. ఆ తర్వాత  ‘డ్యూయల్‌ సెక్స్‌ థెరపీ’ అనే ఒక మానసిక చికిత్స ద్వారా మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక ఆకర్షణ పెరిగేలా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చికిత్స చేస్తారు. దీంట్లో అనుభవం ఉన్న మానసిక వైద్యుడు లేదా క్లినికల్‌ సైకాలజిస్ట్‌ ద్వారా మాత్రమే ఈ థెరపీ చేయించండి. ఈ చికిత్స కోసం భార్య భర్తలిద్దరూ అటెండ్‌ కావాల్సి ఉంటుంది.

ఈ చికిత్స ఆయనలోని ఒత్తిడిని తగ్గించేందుకు క్రమంగా మానసికంగా దగ్గర అవుతూ, తర్వాత శారీరకంగా దగ్గర అవడానికి సహాయపడుతుంది. అవసరమైతే కోరిక, పటిష్టత పెరిగేందుకు కొన్ని మంచి మందులు కూడా సైకియాట్రిస్టులు మీ వారికి ఇస్తారు. ప్రతిరోజు కొద్దిసేపు వాకింగ్, వ్యాయామం, బ్రీతింగ్‌ ఎక్సర్‌ సైజులు, యోగా కూడా చేస్తే మానసిక ఒత్తిడి త్వరగా తగ్గుతుంది. మీరు ప్రేమగా ఓపికగా వేచి ఉండండి. అదే ఆయనకి పెద్ద ఔషధంలా పని చేసి ఆయనకి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌! 

- డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి 
సీనియర్‌ సైకియాట్రిస్ట్, 
విజయవాడ
మీ సమస్యలు, సందేహాలు 
పంపవలసిన మెయిల్‌ ఐడీ
sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement