ఆరుబయట ఆట కంటిపాపలకు మేలు | Explanation of the Outdoor activity and myopia progression in children | Sakshi
Sakshi News home page

ఆరుబయట ఆట కంటిపాపలకు మేలు

Jul 11 2025 6:16 AM | Updated on Jul 11 2025 6:16 AM

Explanation of the Outdoor activity and myopia progression in children

మయోపియా నివారణ

ధరణికి ఎనిమిదేళ్లు. ఈమధ్య బోర్డు మీద రాసింది స్పష్టంగా కనిపించడం లేదని తరచు చెబుతోంది. అమ్మాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. కళ్లు కూడా మెరుస్తున్నట్టుగా మిలమిలలాడుతూ ఉంటాయి. మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు కానీ పదే పదే చెబుతుండటంతో కంటి డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. 

పరీక్షలన్నీ చేసిన డాక్టర్‌ గారు... ధరణి మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్‌)తో బాధపడుతోందనీ, ఈ సమస్య ఉన్నవారిలో కేవలం చాలా దగ్గరివే కనిపిస్తాయనీ, దూరం ఉన్నవి స్పష్టంగా కనిపించవనీ, దాంతో స్కూల్లో బ్లాక్‌బోర్డుపై ఉన్న రాతలు స్పష్టంగా కనిపించడం లేదంటూ చెప్పారు. అంతే... ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతయ్యింది.

ఇది కేవలం ఒక్క కేస్‌ స్టడీ మాత్రమే. ధరణి లాంటి అమ్మాయిలూ, అబ్బాయిలూ దేశవ్యాప్తంగా ఎందరో! స్కూలుకెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల చిన్నారులు ఈ కంప్లైంట్‌తో రావడం... వాళ్లలో ఈ సమస్య  బయటపడటం చాలా సాధారణం. ఈ సమస్యకు కారణం మొదటిది వంశపారంపర్యంగా మయోపియా ఉన్న కుటుంబాల్లో ఈ సమస్య రావడం చాలా సాధారణమైతే.... రెండో కారణం పిల్లలు ఎప్పుడూ ఆరుబయట ఆడకుండా ఇన్‌–డోర్స్‌లోనే ఎక్కువగా గడపడం. 

ఆరుబయట ఆడుకునే పిల్లల్లో తక్కువే... 
నిజానికి ధరణినే కాదు... ఆ వయసు చిన్నారులు ఇప్పుడు ఆరుబయట ఆటలాడటం చాలా తక్కువ. గతంలో ఆ వయసు పిల్లలు ఆరుబయట విస్తృతంగా ఆడుతుండేవాళ్లు. ‘‘ఆడింది చాలు. ఇక లోపలికి రండి. కాళ్లూ చేతులు కడుక్కుని ఏదైనా కాస్తంత తిని చదువుకోండి’’ అంటూ అమ్మలో లేదా ఇంట్లోని పెద్దవాళ్లో కోప్పడుతుండటం మామూలే.

 దాదాపు నాలుగైదు దశాబ్దాల కంటే ముందు పిల్లలు ఇలా మట్టిలో  ఆడుకుంటూ ఉండేవారు. కారణమేమిటో ... ఎందుకో కూడా తెలియదు గానీ ఇలా ఆరుబయట బాగా ఆటలాడుకునే పిల్లల్లో దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించని ‘షార్ట్‌సైటెడ్‌నెస్‌’ అని పిలిచే మయోపియా చాలా తక్కువ. బయట ఆటలాడకుండా ఇలా ఎక్కువసేపు ఇన్‌–డోర్స్‌లోనే ఉండే పిల్లలకూ ఇలా మయోపియా ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందో పెద్దగా తెలియదు.

సరిదిద్దడమిలా... 
మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్‌) అనేది రిఫ్రాక్టివ్‌ సమస్య. అంటే కాంతి కిరణాలు రెటీనాపై కాకుండా కనుగుడ్డులో కాస్తంత లోపలే కేంద్రీకృతం కావడంతో ఈ సమస్య వస్తుంది. కంటి అద్దాలతో చాలా సులువుగా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. కంటి అద్దాలను అంతగా ఇష్టపడనివాళ్లు కాంటాక్ట్‌ లెన్స్‌ కూడా ధరించవచ్చు... గానీ వాటిని సంరక్షించుకోవడం మళ్లీ ప్లెయిన్‌ కళ్లజోడు వాడటం మంచిది. ఇక ఒక వయసు వచ్చాక కళ్లజోడు ధరించడం అంతగా ఇష్టపడకపోతే... పద్ధెనిమిదేళ్లు దాటాక ‘లేసిక్‌’ అనే శస్త్రచికిత్స (రిఫ్రాక్టివ్‌ సర్జరీ) ద్వారా కూడా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పిల్లలు స్కూల్లో బోర్డుగానీ లేదా తమ స్కూలు బస్సు తాలూకు బోర్డుగానీ లేదంటే దూరపు వస్తువులుగానీ స్పష్టంగా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు తప్పక వెంటనే స్పందించాలి. మరీ ఆలస్యం చేసిన పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుండటంతో పాటు అరుదుగానైనా మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశాలుంటాయి.  

పిల్లలు స్క్రీన్‌ చూసే సమయం తగ్గించండి...
ఇవాళ టీవీ లేని ఇల్లంటూ లేదు. అంతేకాదు... కంప్యూటరూ, ల్యాప్‌టాప్‌ వంటివి లేని ఇళ్లు కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇక మొబైల్‌ అయితే పిల్లలకూ లేకుండా ఉండటం లేదు. టీవీ, కంప్యూటరూ, మొబైల్‌... ఇలా అది ఏ స్క్రీన్‌ అయినప్పటికీ దాన్నుంచి వెలువడే కాంతితో చిన్నారుల కళ్లను కాపాడుకోవడం ఎలాగో చూద్దాం. 

→ పిల్లలు టీవీ లేదా కంప్యూటర్‌ స్క్రీన్‌ను చూసే వ్యవధిని తల్లిదండ్రులు విధిగా తగ్గించాలి. అంటే రోజూ కొద్దిసేపు మాత్రమే వాళ్లను టీవీ, కంప్యూటర్, మొబైల్‌లను చూడనివ్వాలి. 
→ మొబైల్‌ లేదా కంప్యూటర్‌ కాంతి అదేపనిగా కంటిని తగులుతూ ఉండకూడదు. కాసేపు స్క్రీన్‌ చూశాక కనీసం కొద్ది నిమిషాల పాటు కంటికి రెస్ట్‌ ఇవ్వాలి. 
→ గదిలో చీకటిగా ఉన్నప్పుడు టీవీ వెలుతురులో లేదా కంప్యూటర్‌ వెలుతురులో పిల్లలు చదవడానికి ప్రయత్నించకూడదు. 
→ టీవీ లేదా కంప్యూటర్‌ను మసక చీకట్లో చూడటం సరికాదు. అవి ఆన్‌లో ఉన్నప్పుడు గదిలో లైట్‌ వెలుగుతూ ఉండాలి. చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు  కంప్యూటర్‌/మొబైల్‌ స్క్రీన్‌ నుంచి లేదా టీవీ నుంచి వెలువడే కాంతి కంటికి హాని చేసే అవకాశం ఎక్కువ. 

– యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement