
సంప్రదాయ పంటలతో నిత్యం నష్టపోతున్న రైతులు ఇప్పుడు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. కొత్తరకం పూలసాగులో అధిక లాభాలు వస్తుండడంతో వీటిపై రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. ఆడి నెలల్లో మార్కెట్‌లో పూలకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు పూల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని చెరుముందరకండ్రిగ గ్రామంలో విరివిగా పూలు సాగు చేస్తున్నారు. –పాలసముద్రం
చెరుముందరకండ్రిగ గ్రామంలో 200 పైగా కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలు కష్టపడి పంటలు సాగు చేసి ముందుకు ఎదుగుతున్నారు. రైతులు వరి, చెరకు పంటలు సాగు చేసి అప్పుల పాలైపోయారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడి భూముల్లో వివిధ రకాల పూల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా బంతి, నాటు చామంతి, మల్లిపూలు, కనకాబరం సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది హైబ్రీడ్ వెల్‌వెట్, హైబ్రీడ్ చామంతి, కొత్తగా పసుపు, తెలుపు రంగుల గులాబీ పూలను సాగు చేస్తున్నారు. ఉదయం తోటలోని పూలను కూలీలతో కోసుకుని తమిళనాడులోని తిర్తుతణి, వేలూరు, చైన్నై మార్కెట్లకు తీసుకెళ్లుతున్నారు. ఇలా చేయడంతో పూలకు మంచి గిరాకీ ఉన్నప్పుడు వ్యాపారస్తులే తోట వద్దకు వచ్చి ముందుగా అడ్వాన్స్ ఇచ్చిపోతున్నారు. ఇలా మండల పరిధిలో శుభ కార్యాలయాలకు కూడా ఇక్కడకు వచ్చి పూలను తీసుకెళ్తున్నారు. పూల సాగుతోనే చెరుముందరకండ్రిగ గ్రామ రైతులు లాభాల బాటలో నడుస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
ఇక్కడ సాగు చేసిన పూలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పండుగ సీజన్‌లో బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులే ఇక్కడికి వస్తున్నారు. తోటల వద్దనే కొనుగోలు చేసి తీసుకెళ్లుతారు. ధరలు ఆశాజనకంగా ఉండడంతో మరిన్ని కొత్తరకం పూలు సాగు చేయడానికి గ్రామంలో రైతులు ఆసక్తి చూపుతున్నారు.
మార్కెట్‌లో మంచి గిరాకీ
ప్రస్తుతం మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న పూలనే ఎంచుకుని సాగు చేస్తున్నారు. హెబ్రీడ్ చామంతి, వెల్‌వెట్ సాగుకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. మ్యారీగోల్డ్, మ్యారీ పింక్ సాగుకు ఎకరానికి రూ.90 వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుంది. ఎకరా భూమికి 10 నుంచి 12 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేలు నుంచి రూ.29 వేలు, బాడుగతో సహా రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఎరువులు, దుక్కులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు కలుపుకుంటే గరిష్టంగా రూ.50 వేల నుంచి రూ.90 వేలు వరకు ఖర్చు అవుతుంది. మంచి దిగుబడి వస్తే ఎకరానికి ఐదు టన్నుల పూలు కాస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో హైబ్రీడ్ చామంతి, గులాబీ పూల ధరలు కిలో రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. మల్లెలు, కాకడ పూలు కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది, కనకాంబరం కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ధరలు పలుకుతున్నాయి. దీపావళి, ఆడి నెల, కార్తీక మాసాల్లో పూల ధరలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్‌లో కిలో పూలు రూ.150 వరకు పలుకుతాయి.
మల్లెల సాగుతో లాభాలు
చెరుముందర కండ్రిగలో ఎకరా మల్లెపూల తోట సాగు చేశాను. ఖర్చు రూ.50 వేలు అవుతుంది. ఆదాయం లక్షన్నర వస్తుంది. ప్రతి రోజు పూల తోటలో పూలు కోసుకుకెళ్లి తిరుత్తణి, చెన్నై మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నాను. కిలో మల్లెమొగ్గలు రూ.65 నుంచి రూ.75 ధర పలుకుతాయి. రోజుకి సుమారు 25 కిలోల పూలు తీసుకెళ్లుతాను. రోజు కూలీకి పోను రూ. వెయ్యి వస్తుంది.–వడివేలురెడ్డి, చెరువుముందర కండ్రిగ
మ్యారీగోల్డ్, గులాబీ సాగు చేస్తున్నాం
మాకున్న భూముల్లో మ్యారీగోల్డ్, గులాబీ పూల తోట సాగు చేస్తున్నాను. రెండు బోర్లు వేశాను. నీరు రాకపోవడంతో వరి, చెరకు సాగు చేయకుండా ఉన్న తక్కువ నీటిలోనే ఎకరాకు పైగా పూలు సాగు చేస్తున్నా. ఆదాయం బాగానే వస్తుంది. కొత్తరకం పూలు సాగు చేస్తే తోట వద్దకే వ్యాపారులు వచ్చి పూలను తీసుకెళ్లుతారు. మాగ్రామంలో ప్రతి ఒక్కరు పూల సాగుపైగా ఆధారపడి ఉన్నాం. –మత్యాలురెడ్డి, చెరువుముందరకండ్రిగ
పూల సాగుపై అవగాహన కల‍్పిస్తున్నాం
మండలంలో అన్ని గ్రామాల్లో పూల తోటల సాగుపై హారి్టకల్చర్, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. అయితే చెరుముందరకండ్రిగ గ్రామంలోని రైతులు పూలతోటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా వివిధ రకాల పూలతోటలు సాగు చేసి, ఆదాయం పొందుతున్నారు. –ఢిల్లీప్రసాద్, మండల వ్యవసాయాధికారి