
చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన.. రాగిబింద తీసుక రమణి నీళ్లకు వోతే.. రాములోరు ఎదురయ్యే నమ్మో ఈ వాడలోన.. వెండి బింద
తీసుక వెలది నీళ్లకు వోతే.. వెంకటేశుడెదురాయే నమ్మో.. అంటూ సాగే తెలంగాణ బతుకమ్మ పాటలు వింటే.. ఎన్ని తరాలు మారినా బతుకమ్మ పండుగ సంస్కృతిని ప్రతిబింబించడంలో తన ప్రశస్తిని చాటుకుంటూనే ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ.. క్రమంగా భాగ్యనగరంలో తన ఘనతని చాటుకుంటూ.. ప్రకృతి పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. నగరంలో బతుకమ్మ అంటే ప్రతి పువ్వూ, ప్రతి ఆకూ.. ఊరి నుంచే తరలి రావాలి.. అంటే పల్లెకూ.. పట్నానికీ మధ్య సాంస్కృతిక వారధిగా మన బతుకమ్మ నిలుస్తోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా నగరం బతుకమ్మ సంస్కృతిని తనలో ఇముడ్చుకుంది. ఇక్కడి విభిన్న సంస్కృతులు, ప్రాంతాలకు చెందిన వారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ బతుకమ్మ పాటలకు శృతి కలుపుతున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ అధికారులే కాకుండా సినీతారలు, ఇతర రంగాల ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సారి వేడుకల్లో మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాత బతుకమ్మ ఆడడం విశేషం.
ఈ పండుగ ముగింపుకు చేరడంతో సోషల్ మీడియా కూడా పూలు, పట్టు పరికిణి కట్టుకున్నట్టుగానే కలర్‌పుల్ సందడి కనిపిస్తోంది. బతుకమ్మ ఆటల వీడియోలు, రీల్స్ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో, విల్లాల్లో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకప్పటిలా నగరం మూగబోకుండా సాంస్కృతిక సందడిని భవిష్యత్తు తరాలకు అందించడం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షిస్తోంది.
(చదవండి: శ్రీలంక టూర్.. బౌద్ధ రామాయణం..)