
విజయవాటిక యందు విజయదుర్గ
నామమున నున్న జగదంబ కోమలాంగి
సిరులు కురిపించు, భగవతి
సింధుతనయ!
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!
హస్తముల పుష్పశరమును, అంకుశమ్ము,
నెన్నుదుట కాంతి జిమ్మెడి నేత్రమొకటి,
విశ్వజనని లలితగా వెలసినట్టి
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!
అష్టభుజములు ధరియించి దుష్టులైన
రక్కసుల గర్వమణచిన రౌద్రమూర్తి!
సర్వమంగళదాయిని జగము లేలు
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!
అక్షమాల అలరుచుండ హస్తమందు
పుస్తకమును దాల్చి వేరొక హస్తమందు,
కమలమందున కూర్చున్న కల్పవల్లి!
కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!
పాయసాన్నంబు నిండిన పాత్రతోడ
‘అన్నపూర్ణ’వై కృపగాంచు కన్నతల్లి!
భక్తులకు వరము లొసంగు భాగ్యరాశి
కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!
– డా. జంధ్యాల పరదేశి బాబు, విశ్రాంత తెలుగు ఆచార్యులు ‘
91219 85294