చాక్లెట్‌ కేక్‌.. దుబాయ్‌ షేక్‌ | Dubai kunafa chocolate in hyderabad | Sakshi
Sakshi News home page

చాక్లెట్‌ కేక్‌.. దుబాయ్‌ షేక్‌

May 11 2025 8:05 AM | Updated on May 11 2025 8:05 AM

Dubai kunafa chocolate in hyderabad

మధ్య ప్రాచ్య దేశాల నుంచి మన నగరం దాకా

ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా ఇంటింటికీ చేరిన డెసర్ట్‌

బేకరీలు, కేఫ్స్‌లో విభిన్న వెరైటీలు అందుబాటులోకి 

స్వీట్‌ ప్రియులకు సిటీలో కొదవలేదు. అయితే అలాంటి స్వీట్స్‌లోనూ చాక్లెట్లదే హవా.. వాటిలోనూ డార్క్‌/ మిల్క్‌ చాక్లెట్లకు ప్రత్యేక గుర్తింపు. అందుకే మార్కెట్‌లో వీటి డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అదే క్రమంలో ఇటీవల కాలంలో ట్రెండ్‌గా మారింది దుబాయ్‌ కునాఫా చాక్లెట్‌ బార్‌. ఇప్పుడు నగరంలోని చాక్లెట్‌/ స్వీట్స్‌ ప్రియుల నోరూరిస్తూ రుచి చూసి తీరాల్సిన ఐటమ్‌గా అవతరించింది. మరి అలాంటి కునాఫా చాక్లెట్‌ ఎక్కడిది? కథా కమామీషు ఏమిటి? 

లస్తీనా, సిరియా, ఈజిప్‌్టలలో ఈ కునాఫా/కునాఫె అనేది సంప్రదాయంగా పాపులర్‌ డెసర్ట్‌. ఈ సంప్రదాయ తియ్యని రుచితో చాక్లెట్‌ మేళవింపే ఈ సరికొత్త దుబాయ్‌ కునాఫా చాక్లెట్‌ బార్‌. పిస్తా క్రీమ్‌తో పాటు తురిమిన కటైఫీ (ఫిల్లో పేస్ట్రీ లాంటిది), తహినితో నింపిన మిల్క్‌ చాక్లెట్‌ ఇది. దీనిని ఫిక్స్‌ డెసర్ట్‌ చాక్లెటీర్‌ అనే సంస్థ తొలిసారిగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఫిక్స్‌ డెసర్ట్‌ చాక్లెట్‌ టైర్‌ పేరిట ఈ చాక్లెట్‌ బార్‌లు ప్రస్తుతం దుబాయ్‌ అబుదాబిలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. 

వైరల్‌..హల్‌చల్‌.. 
గత డిసెంబర్‌ 2023లో వైరల్‌ అయిన ఓ టిక్‌టాక్‌ వీడియో వల్ల ఈ దుబాయ్‌ కునాఫా చాక్లెట్‌ బార్‌ ప్రపంచ సంచలనంగా మారింది. మధ్యప్రాచ్య దేశాలకు చెందిన డెజర్ట్‌ కునాఫాతో రిచ్‌ చాక్లెట్‌ కలయిక ఈ చాక్లెట్‌ బార్‌ డిమాండ్‌ పెరుగుదలకు దారితీసింది. ఏ స్థాయిలో అంటే దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పిస్తాపప్పు కొరత, వాటి ధరల పెరుగుదల కూడా ఏర్పడింది.  

సిటీలో ట్రెండ్‌ సెట్‌.. 
దుబాయ్‌ కునాఫా చాక్లెట్‌ ట్రెండ్‌ నగరంలోని బేకర్లు  డెజర్ట్‌ తయారీదారుల్లో సృజనాత్మకతకు ఊతమిచి్చంది. పలు బేకరీలు, కేఫ్స్, స్వీట్‌ స్టోర్స్, చాక్లెట్‌ బ్రాండ్లు దీనిని అనుసరిస్తూ తమ సొంత వెర్షన్లను విడుదల చేశాయి. కొన్ని కునాఫా చాక్లెట్‌ బార్లకు కొత్త రుచులు జత చేస్తున్నాయి. కునాఫా–స్టఫ్డ్‌ డేట్స్, కునాఫా చీజ్‌కేక్‌ల వంటి ఇతర కునాఫా–ప్రేరేపిత ఉత్పత్తులను అందిస్తున్నాయి. కునాఫాతో నింపిన ఖర్జూరాలు కునాఫా చీజ్‌కేక్‌ల నుంచి కునాఫా డోనట్స్‌ వరకు, స్థానిక స్వీట్‌ తయారీదారులు తమ సిగ్నేచర్‌ క్రిస్పీ కునాఫా రిచ్‌ చాక్లెట్‌ కాంబినేషన్‌తో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

టేస్టీ..క్రియేటివిటీ.. 
నగరానికి చెందిన జ్యూసీ చాక్లెట్స్‌ కునాఫా చాక్లెట్‌ బార్‌కు కొత్త వెర్షన్‌ సృష్టించింది. ‘ఈ ట్రెండ్‌లో భాగం పంచుకుంటూ పిస్తా కునాఫా ఫ్రెంచ్‌ టోస్ట్, పిస్తా కునాఫాతో స్ట్రాబెర్రీలను పరిచయం చేశాం. మా ఇఫ్తార్‌ ప్లేటర్‌లో పిస్తా కునాఫా కేక్‌ కూడా తోడయ్యింది అంటున్నారు నగరంలోని ఎట్‌–సి కేఫ్‌కు చెందిన అంజు నారంగ్‌ అగర్వాల్, నగరంలో నుటెల్లా కునాఫా చాక్లెట్‌ బార్, లోటస్‌ బిస్కాఫ్‌ చాక్లెట్‌ బార్, హాజెల్‌ నట్‌ చాక్లెట్‌ బార్, సాల్టెడ్‌ కారామెల్‌ చాక్లెట్‌ బార్‌ వంటివి ఈ ట్రెండ్‌లో భాగంగా పుట్టుకొచి్చనవే. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఓ కేఫ్‌ డైరెక్టర్‌ అపర్ణ మాట్లాడుతూ ‘వ్యక్తిగతంగా డార్క్‌ చాక్లెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. కునాఫా చాక్లెట్‌ బార్‌ కొత్త రకం తియ్యదనంతో ఉంది. అందుకే అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటోంది’ అన్నారు. దీని గురించి కరాచీ బేకరీ ప్రతినిధులు మాట్లాడుతూ ‘దుబాయ్‌ కునాఫా చాక్లెట్‌ ట్రెండ్‌కు మా ఫ్లేవర్‌ని మేళవించాం.  మెత్తటి చాక్లెట్‌ గింజల కలయికగా మా స్టైల్‌లో తయారైన క్రిస్పీ కునాఫా మరింత టేస్టీగా అందరికీ దగ్గరైంది’ అని చెప్పారు.

సొంత ఫ్లేవర్‌తో.. 
ప్రస్తుతం కునాఫా బేస్డ్‌గా తయారైన చాక్లెట్, డెసర్ట్స్‌కు సిటీలో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో కునాఫా చాక్లెట్‌ బార్‌కు సంబంధించిన వెరైటీ వెర్షన్స్‌ను అందిస్తున్నారు. మేం కూడా డార్క్, మిల్క్‌ చాక్లెట్స్, ఆయిల్‌ పిస్తా, క్రీమ్స్‌తో పాటు మరికొన్ని కలిపి డిఫరెంట్‌ టేస్ట్‌తో తయారు చేశాం. అన్నింటి కన్నా ముఖ్యంగా ఈ రుచిని సిటీలో అందరికీ చేరువ చేయాలనే ఆలోచనతో అందుబాటు ధరలో అందిస్తున్నాం.  
– సయ్యద్‌ లుక్మాన్, సుభాన్‌ బేకరీ  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement