వింగ్స్ ఇండియా–2026కు రంగం సిద్ధం
నాలుగు రోజులపాటు విమానాల కనువిందు
హైదరాబాద్: రంగురంగుల పొగలు.. తీరొక్క ఆకృతులు.. రకరకాల విన్యాసాలు.. ఇవీ నగర గగనతలంలో రేపట్నుంచి కనువిందు చేసే దృశ్యాలు. కేంద్ర విమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 28 నుంచి 31 వరకు బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా–2026 నిర్వహించనున్నాయి. విన్యాసాలను వీక్షించేందుకు మొదటి రెండు రోజులు వ్యాపార, వాణిజ్యవేత్తలకు, తరువాతి రెండు రోజులు సామాన్యులకు అనుమతిస్తారు. సూర్యకిరణ్ ఏరోబాటిక్స్, మార్క్ జెఫ్రీ ఏరోబాటిక్స్ బృందాలు నాలుగు రోజులపాటు ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలు చేయనున్నాయి.
విమాన విన్యాసాల వేళలు...
నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11.00–11.30 గంటల వరకు సూర్యకిరణ్ టీమ్, మధ్యాహ్నం 12.00–12.30, సాయంత్రం 4.00–4.30 వరకు మార్క్‌జెఫ్రీ బృందం వైమానిక విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ప్రారంభ రోజైన బుధవారం మాత్రం అదనంగా రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు మార్క్ జెఫ్రీ బృందం ప్రదర్శనతో పాటు సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు డ్రోన్ షో కనువిందు చేయనుంది. మొత్తంగా 13 సార్లు విమాన విన్యాసాలు, ఒక డ్రోన్ షో నిర్వహించనున్నారు. బుక్ మై షో ద్వారా టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని వింగ్ ఇండియా–2026 వర్గాలు పేర్కొంటున్నాయి.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇండియన్ ఏవీయేషన్–2026ను ప్రారంభించనున్నారు. 200లకు పైగా ప్రధాన కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థలు ఎయిర్‌బస్, సీఎస్‌ఐఆర్–ఏఎన్‌ఎల్, ఆర్కా ఏవియేషన్ దస్సాల్ట్ తమ విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ ప్రదర్శనకు రానున్నాయి.


