డీప్‌ఫేక్‌ ఇప్పటి విలన్‌ | Deepfake Technology dangers | Sakshi
Sakshi News home page

డీప్‌ఫేక్‌ ఇప్పటి విలన్‌

Nov 12 2025 1:16 AM | Updated on Nov 12 2025 1:16 AM

Deepfake Technology dangers

సోషల్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా స్త్రీల ఇష్టాయిష్టాల వ్యక్తీకరణకు చోటు దొరికిందని భావిస్తున్నంతలోనే కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రోలింగ్‌ చేసే ధోరణికి బదులు డీప్‌ఫేక్స్, న్యూడిటీ యాప్స్‌ ద్వారా స్త్రీలను భయభ్రాంతం చేయడం దేశంలో పెరిగిందని న్యూఢిల్లీకి చెందిన‘బ్రేక్‌త్రూ ఇండియా’ అనే ఎన్‌.జి.ఓ. తన అధ్యయనం ద్వారా తెలిపింది. స్త్రీలను వంటగదికే పరిమితం చేసినట్టుగా సోషల్‌ మీడియాకు బయటే వారిని ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలు

పురుష అహంకారం చాటుకోవడానికి మగవారికి స్త్రీలను అణిచే పద్ధతులు కావాలి. స్త్రీలు ముందుకు అడుగు వేసినా, ఆత్మవిశ్వాసం ప్రదర్శించినా, గట్టి రాజకీయ అబీప్రాయాలు వ్యక్తపరిచినా, ఫ్యాషనబుల్‌గా ఉన్నా, ఆనవాయితీలను ఉల్లంఘించినా వారిని ‘అదుపు’ చేసి అహాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటారు పురుషులు. ఈ పని ఇళ్లల్లో, సంఘంలో ఒక విధంగా జరిగితే సోషల్‌ మీడియాలో మరో విధంగా జరుగుతోంది. 

సోషల్‌ మీడియాలో వివిధ ఆసక్తులతో గుర్తింపు పొందుతున్న స్త్రీలను బెదరగొట్టే ట్రోలింగులు గతంలో చూస్తే ఇప్పుడు ‘డీప్‌ఫేక్‌’లతో వారి మీద అంకుశం విసరాలని చూస్తున్నారు కొందరు. అంతేకాదు, డీప్‌ఫేక్‌  ఉపయోగిస్తూ ఆడవాళ్ల చిత్రాలను అసభ్యంగా రూపొందించి అవి చూపించి బెదిరించడం, డబ్బు వసూలు చేయడం, తాము చెప్పిన పనులకు ఉపయోగించడం చేస్తున్నారు. సామాన్య మహిళల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ డీప్‌ఫేక్‌ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నటి అనుపమ పరమేశ్వరన్‌ తన డీప్‌ఫేక్‌ చిత్రాలను చూసి హతాశురాలైపోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది. 

సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలతో..
భారతదేశం ఏఐ  వినియోగ మార్కెట్‌లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. ఏఐలో వస్తున్న అప్‌డేట్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మన దేశంలో అనేకరంగాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో నేరగాళ్లూ ఏఐని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్త్రీలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలను తీసుకుని, ఏఐ ద్వారా తమకు నచ్చిన రీతిలో మార్చుకుంటున్నారు. అసభ్యంగా, నగ్నంగా తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవి నిజమైన చిత్రాలలాగే ఉండటంతో బాధితులు కంగారు పడుతున్నారు. అవి బయటకు వస్తే తమ పరువుపోతుందని బాధపడుతూ మానసిక వేదనకు గురవుతున్నారు. అనేక కుటుంబాల్లో ఇది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది.

సోషల్‌ మీడియాలో పెట్టిన నిమిషాల్లోనే..
సెలబ్రెటీల చిత్రాలతోపాటు సామాన్యుల సోషల్‌ మీడియా అకౌంట్లపైనా మాయగాళ్లు నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. ఎవరైనా కొత్తగా చిత్రాలుపోస్ట్‌ చేస్తే నిమిషాల్లోనే వాటిని సేవ్‌ చేసుకుంటున్నారు. అనంతరం ఏఐ సాయంతో తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. ఇటీవలపోలీసుల వద్ద నమోదవుతున్న కేసుల్లో డీప్‌ఫేక్‌ కేసులు పెరుగుతున్నాయని ‘బ్రేక్‌త్రూ ఇండియా’ అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ఈ ఎన్‌.జి.ఓ. సోషల్‌ మీడియాలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇటీవల అధ్యయనం చేసింది.

‘డబ్బుకోసమే కాకుండా మహిళల పట్ల కక్ష పెంచుకున్న కొందరు కావాలని ఆ మహిళల డీప్‌ఫేక్‌ అశ్లీల ఫొటోలు వారి కుటుంబసభ్యులకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమలో ఫెయిలైన అబ్బాయిలు తమ మాజీ ప్రియురాళ్ల చిత్రాలను ఇలా తయారు చేసి వాళ్లను బెదిరిస్తున్నారు. కొన్ని లోన్‌యాప్స్‌ తమ వద్ద లోన్‌ తీసుకున్నవారి చిత్రాలను మార్ఫింగ్‌ చేసి, వారి కుటుంబసభ్యులకు పంపిన ఉదంతాలు జరిగాయి’ ఆ అధ్యయనంలో తెలిసింది.

డీప్‌ఫేక్‌ని గుర్తించే ప్రత్యేక చట్టాలేవీ? 
డీప్‌ఫేక్‌ రాజకీయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రాజకీయ నేతల చిత్రాలను మార్ఫింగ్‌ చేసి, అసభ్యకరంగా మార్చి, వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ అన్ని సోషల్‌ మీడియా సంస్థలకు డీప్‌ఫేక్‌ చిత్రాలు, వీడియోలను తక్షణం  తొలగించాలని తెలిపాయి. అయినా ఆగడాలు ఆగడం లేదు. ఈ డీప్‌ఫేక్‌ మోసాలతో మహిళలతోపాటు పురుషులూ మానసికంగా ఆందోళన చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ తరహా నేరాల తీవ్రత పెరుగుతున్నా డీప్‌ఫేక్‌ని నేరంగా గుర్తించే ప్రత్యేక చట్టం మన దేశంలో లేదు. ప్రస్తుతానికి ఈ తరహా నేరాలను మహిళలపై వేధింపులు, సైబర్‌ నేరాల పరిధిలోనేపోలీసులు నమోదు చేస్తున్నారు.

కట్టడి చేయడమెలా?
సోషల్‌ మీడియా వాడకం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో డీప్‌ఫేక్‌ నేరాలను అడ్డుకోవడం కత్తిమీద సాముగా మారింది. ప్రోఫైల్‌ లాక్‌ వంటివి కొంత ఉపకరిస్తున్నా, పూర్తిస్థాయిలో అవీ రక్షణ కల్పించలేకపోతున్నాయని బాధితులు అంటున్నారు. ఈ నేరాలకు భయపడి సోషల్‌ మీడియాకు పూర్తి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. అయితే డీప్‌ఫేక్‌లు వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ఆ విషయం తెలపాలని నిపుణులు అంటున్నారు. అలాగే సోషల్‌ మీడియా పరిచయంతో ఇతరులకు ఫొటోలు, వీడియోలు పంపడం మానుకోవాలని సూచిస్తున్నారు. మరీ అభ్యంతరకరంగా తోచేవి, పూర్తి వ్యక్తిగతమైన చిత్రాలనుపోస్ట్‌ చేయకపోవడం మంచిదంటున్నారు. ఎవరైనా డీప్‌ఫేక్‌ ఫొటోలు చూపించి బెదిరిస్తే భయపడక వెంటనేపోలీసులను సంప్రదించాలని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement