Dasaratha Maharaja Elaborated Greatness And Importance Of Girls Father In Ramayan Story - Sakshi
Sakshi News home page

ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..

Published Fri, Jun 23 2023 1:03 PM

Dasaratha Maharaja Elaborated Importance Of Girls Father - Sakshi

ఆదికావ్యమైన మన రామాయణాన్ని ఆదర్శ జీవనానికి ప్రమాణంగా భావిస్తాం. అందులోని పాత్రలు.. ఓ వ్యక్తి బంధాలకు ఎలాంటి విలువ ఇ‍వ్వాలి, ఏవిధంగా నడుచు​కోవాలి, కుటుంబాన్ని ఎలా చక్క పెట్టాలో చెబుతాయి. నిజానికి దాన్ని ఓ కథలా వినేస్తాం గానీ దాన్ని అనుసరించే యత్నం గానీ కనీసం వాటిని గుర్తుపెట్టుకుని అనర్థదాయకమైన పనుల చేయకుండా మసులుకోవడం గానీ చేయం. ఈనాడు ఆడిపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చిన ఇంకా చిన్న చూపే, అడుగడుగున వివక్షత. అందులోనూ ఆడపిల్ల తండ్రికి అస్సలు విలువే ఉండదు.

ఇప్పటికి ఆడపిల్ల పుట్టిందంటే చంపేసే తల్లిదండ్రులు ఉంటున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. మరొకందరూ ప్రబుద్దులు ఇద్దరు ఆడపిల్లల కంటే చాలు.. భార్యని పిల్లలను వదిలేసి పరారవ్వడం లేదా అదనంగా కట్నం తీసుకురావాలని డిమాండ్‌ చేయడం వంటి ఉదంతాలు చూస్తున్నాం. గానీ మన రామాయాణ గాథలో ఆడపిల్ల తండ్రి గొప్పతనం, అతని ప్రాముఖ్యత గురించి దశరథ మహారాజు ఎంత చక్కగానో విపులీకరించాడు. అందులో సీతరాముల కళ్యాణ సర్గ చదివితే ..మన కళ్లముందు ఒక్కసారిగా సీతారాముల కళ్యాణం కళ్లముందు మెదులుతుంది.

గానీ ఆ వివాహతంతులో వైవాహిక జీవితం, ఆడపిల్లవారు గొప్పతనం గురించి చక్కగా వివరించాడు ఆదికవి వాల్మీకి. ఇక ఆ సర్గలో..దశరథ మహారజు తన నలుగురు కొడుకులను తీసుకుని వివాహ శోభాయాత్రకు కదిలి వస్తూ..జనకమహారాజు ద్వారం వద్ద వేచి ఉన్నాడు. అప్పుడు జనకమహారాజు వారి వివాహా శోభాయాత్రకు సాధరపూర్వకంగా స్వాగతం పలుకుతుండగా.. వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనకమహారాజుకి పాదాభివందనం చేశాడు. అప్పుడూ జనకమహారాజు దశరథ మహారాజు భుజం తట్టి పైకిలేపి సంతోషంతో కౌగలించుకున్నాడు. ఈ ఘట్టం ఆడపిల్ల తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం గురించి అద్భుతంగా తెలియజేసింది.

ఇక ఆ ఘట్టంలో.. రాజా మీరు పెద్దవారు, పైగా వరుని పక్షం వారు, ఇలా నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగానది వెనక్కి ప్రవహించడం లేదు కదా! అంటూ సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నిస్తాడు జనకమహారాజు. దీంతో దశరథుడు మహారాజా మీరు దాతలు..కన్యను దానం చేస్తున్నారు. మా అబ్బాయికి పిల్లనివ్వమని మీతో సంబంధం కోరుకుంటున్న యాచకులం. మీతో సంబంధం ద్వారా నా కొడుక్కి కన్యను పొందాలనుకుంటున్నా!.. గనుక ఇప్పుడూ ఎవరూ గొప్పో చెప్పండి అని అడుగుతాడు దశరథ మహారాజు. ఆ మాటలకు ఒక్కసారిగా జనకమహారాజు కళ్లల్లోంచి ఆనందబాష్పాలు వచ్చాయి. అంతేగాదు ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో..వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురు అదృష్టంలో తండ్రి ఉంటాడు అని సగర్వంగా చెబుతాడు జనకమహారాజు. 

నేటి పెళ్లిళ్లలో జరగుతున్నది ఏంటి?..
ఇంకా వివాహం జరగకమునుపే ఇలా సంబంధం కుదుర్చుకున్నామో! లేదో ఇక ఆడపిల్లవారిపై యజామాయిషి మొదలైపోతుంది. పోనియిలే మగపెళ్లివారు కదా అలానే ఉంటారు కదా! అని సరిపెట్టుకుంటే.. ఇక వాళ్ల గొంతెమ్మ కోరికలకు హద్దు, అదుపు ఉండవు. అది వివాహామేనా అన్నట్లు ఉంటుంది ఆ తంతు. ఓపక్క తమకు మర్యాదలు తక్కువయ్యాయని, మా అబ్బాయికి ఇది పెట్టాలని, ఆడపడచు లాంఛనంగా అది కావాలంటూ అరుపులు కేకలు. వాస్తవానికి ఇవి మన సనాతన ధర్మంలో లేని ఆర్భాటాలు. ఆడపిల్ల తండ్రి అంటే.. తలవంచుకుని మగపెళ్లివారి మాటలు పడేవాడని అర్థం కాదు.

కన్యను దానం చేస్తున్న దాత. ఆ వేదికపై హక్కు ఆయనదే. ఆ రోజు వేదికపై జరిగేదానికి అధికారం అయనదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవడానికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?. దానం ఇస్తున్నవాడిని ఇంకా.. ఇంకా.. కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెప్పారు మీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా?!. కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. పైగా వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న తన ఇంటి లక్ష్మిని పంపిస్తున్నాడు కన్యాదాత.

కాబట్టి అతన్ని గౌరవించగలిగే మర్యాద మీ వద్ద లేకపోతే గమ్మని కూర్చొండి. అంతేగానీ అతడిని తిట్టడం, విస్తుక్కోవడం వంటివి చేసే హక్కు మీకు లేదు. వివాహ తంతులో సీతారాముల్లా ఉండండి! అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామ కళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో అందరికి అవగతమవుతుంది. మన సనాత ధర్మాన్ని గౌరవిస్తే ఇలాంటి దారుణాలకు దిగకండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఓ స్త్రీ ప్రమేయం లేకుండా మనుగడ సాగించగలమా! లేదా అన్నది ప్రశ్నించుకుని మసులుకోండి. 

(చదవండి: ఓ చిన్న రేకుల షెడ్‌కి..ఏకంగా లక్ష రూపాయాల కరెంట్‌ బిల్లు)

Advertisement
 
Advertisement