
హైదరాబాద్ నగరంలో మరోసారి పాప్ కల్చర్ సందడి మొదలైంది. ప్రముఖ కాస్‌ప్లేయర్లు, గేమింగ్ సెలబ్రిటీలు, యానిమే, ఫిల్మ్ స్టార్స్ నగరానికి చేరుకోనున్నారు. నగర వేదికగా దేశంలోనే అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ ‘కామికాన్ ఇండియా 2025–26’ సీజన్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకూ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనుంది. కామిక్స్, గేమింగ్, కాస్‌ప్లే, యానిమే, ఫిల్మ్స్, టీవీ, మెర్చండైజ్ వంటి విభిన్న, వినూత్న కార్యక్రమాలు, ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించే అతిపెద్ద యూత్ లైఫ్‌స్టైల్ ఫెస్టివల్ కామికాన్ ఇండియా. ప్రస్తుతం హైదరాబాద్ కేవలం ఐటీ సిటీ కాదు, ఇదొక కల్చరల్ క్రియేటివ్ సెంటర్‌గా అవతరించింది. ముఖ్యంగా ఈ తరం యువత గ్లోబల్ పాప్ కల్చర్‌ని తమదైన రీతిలో అర్థం చేసుకుంటూ ‘లైఫ్‌స్టైల్ సెలబ్రేషన్’గా అలవర్చుకుంటోంది.
ప్రస్తుతం కామికాన్ కేవలం కామిక్స్ ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది కొత్త తరం జీవనశైలికి ప్రతిబింబం. పాప్ కల్చర్ నుండి లైఫ్‌స్టైల్ వరకూ.. ఫ్యాషన్, ఆర్ట్, డిజైన్, ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ తదితర అంశాలతో కలిసిన ఫ్యూజన్‌కి ఇది కేంద్రబిందువు. యానిమే టీ–షర్టులు, కామిక్ క్యారెక్టర్ కలెక్టబుల్స్, ఆర్ట్ పోస్టర్లు, గేమింగ్ జోన్‌లు.. ఇవన్నీ ఆధునిక యువతకు ‘లైఫ్‌స్టైల్ ఎక్స్‌ప్రెషన్’గా మారిపోయాయి.
ఈ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ గెస్ట్‌లు, సెలబ్రిటీలతో ప్రశ్నోత్తర సెషన్లు, లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, యానిమే షోకేస్‌లు, ఈ–స్పోర్ట్స్ గేమింగ్ అరీనాలు, ఎక్స్‌క్లూజివ్ మెర్చండైజ్ లాంచ్‌లు, కంటెంట్ క్రియేటర్ల మీట్–అండ్–గ్రీట్స్ అన్నీ కలిపి ‘బెస్ట్ వీకెండ్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచేలా ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కామికాన్ ఇండియా సీఈఓ షెఫాలీ జాన్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ యువతలో సృజనాత్మకత, ఎనర్జీ, గ్లోబల్ కల్చర్‌పై ఆసక్తి విపరీతంగా ఉంది. అందుకే ఈ నగరమే తమ కొత్త సీజన్ ప్రారంభానికి సరైన వేదికని అభిప్రాయపడ్డారు.
సృజనాత్మక హరివిల్లు.. కాస్‌ప్లే..
కాస్‌ప్లే ఇప్పుడు కేవలం ఆట కాదు.. ఇది ఒక ఆర్ట్ ఫార్మ్. అభిమానులు తమకు ఇష్టమైన సూపర్ హీరోలు, విలన్స్, యానిమే క్యారెక్టర్ల వేషధారణను రంగరించి, వ్యక్తిత్వాన్ని కొత్త రీతిలో చూపిస్తారు. ఈ కల్చర్ ద్వారా యువతలో ఫ్యాషన్ సెన్స్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. గత కొంత కాలంగా హైదరాబాద్‌లో కాస్‌ప్లేయర్లకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది.
గతంలో నగరంలో నిర్వహించిన కామికాన్ హైదరాబాద్ ఫెస్ట్‌కు 40 వేల మందికి పైగా హాజరై ఈ తరం ఔత్సాహికత్వాన్ని ఘనంగా ప్రదర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్యను మించి ఉండనుందని నిర్వాహకులు చెబుతున్నారు. డిస్ట్రిక్ట్, మై జొమాటో ఈ సీజన్‌కు ప్రత్యేక టికెటింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ కామిక్ కాన్ 2025–26 ఈవెంట్‌కి సంబంధించిన టికెట్లు డి్రస్టిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
క్రియేటివ్..కేరాఫ్ హైదరాబాద్..
ఈ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని ఆరొమాలే కెఫే, క్రియేటివ్ కమ్యూనిటీ వేదికగా కామికాన్ ఇండియా ఆధ్వర్యంలో కాస్‌ప్లే వర్క్‌షాప్ సైతం నిర్వహించారు. పాప్ కల్చర్ అభిమానులకు, క్రియేటివిటీకి, ఫ్యాండమ్‌కి ఇదొక అద్భుత వేదికగా నిలుస్తోంది. ఈ వర్క్‌షాప్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచి్చన 150 మందికి పైగా కాస్‌ప్లే అభిమానులు పాల్గొని తమ కళాత్మకతను, సృజనాత్మకతను ప్రదర్శించి సందడి చేయనున్నారు.
ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రాప్ క్రియేషన్, ఫోమ్ కటింగ్, ప్యాటర్న్ మేకింగ్ వంటి బేసిక్ టెక్నిక్స్‌ను ప్రాక్టికల్‌గా నేరి్పంచారు. ముఖ్యంగా ‘రియలిస్టిక్ ఎఫెక్ట్స్’.. బాటిల్ డ్యామేజ్ లుక్ వంటి ఫినిషింగ్ టచ్‌లు ఎలా ఇవ్వాలో శిక్షణ ఇచ్చారు. ఫోమ్‌ను వేడి చేసి ఆకట్టుకునే ఆకారాలు మార్చే పద్ధతిని చూపించారు.
ఈ సెషన్ ఇండియన్ చాంపియన్‌షిప్ ఆఫ్ కాస్‌ప్లే (ఐసీసీ) రెండు సార్లు గెలిచిన అక్షయ్ చూరీ నడిపించడం విశేషం. ఆయన కాస్ట్యూమ్ తయారీ, ప్రెజెంటేషన్, డీటైలింగ్‌కి సంబంధించిన చిట్కాలను పంచుకున్నారు. అదనంగా.. వీఎఫ్ ఎక్స్ మేకప్, విగ్ స్టైలింగ్, కాంటాక్ట్ లెన్స్ వినియోగం.. వంటి అంశాలపై ప్రత్యేక సెగ్మెంట్ నిర్వహించే.. దీనిలో సేఫ్టీ, హెల్త్, కంఫర్ట్‌పై దృష్టి పెట్టారు.
నచ్చిన క్యారెక్టర్‌తో మొదలుపెట్టండి..
హైదరాబాద్ యానిమే క్లబ్, కాస్‌ప్లే క్లబ్ హెడ్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. కాస్‌ప్లే మొదలుపెట్టేందుకు ముందే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇష్టపడే క్యారెక్టర్‌తో మొదలుపెడితే చాలు. అదే మీకు ఆసక్తిని, స్ఫూర్తిని అందిస్తుందని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో ఐసీసీ 2024–25 హైదరాబాద్ క్వాలిఫయ్యర్ శుక్రాన్ ఖాన్ పాల్గొన్నారు.
ఆయన రూపొందించిన వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్ క్యారెక్టర్ ‘అండుయిన్ వ్రిన్’ ఆర్మర్ కాస్ట్యూమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం క్లాస్ కాదు, ఒక ఫన్ ఇంటరాక్టివ్ సెషన్. పారి్టసిపెంట్లు స్వయంగా ప్యాటర్న్‌లు కట్ చేయడం, ఫోమ్ గ్లూ చేయడం నేర్చుకోవడం వావ్ అనిపించిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్ ఒక బిగినర్ ఫ్రెండ్లీ సెషన్‌గా.. నగరంలోని కాస్‌ప్లే ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసం పెంచి కొత్త ఊపునిచ్చింది.
(చదవండి: బన్ మస్కా..! వేడి వేడి ఇరాన్ చాయ్ కాంబినేషన్ అదుర్స్..!)