ఒకవైపు హైదరాబాద్‌లో గృహ విక్రయాలు వృద్ధి చెందుతున్నప్పటికీ.. మరోవైపు అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ప్రారంభమైన అందుబాటు, మధ్యస్థ ధరల ఇళ్ల వాటా అధికంగా ఉండటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రస్తుతం నగరంలో 54,878 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 త్రైమాసికాల సమయం పడుతుంది. గతేడాదితో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం మేర పెరిగింది. ముంబై, ఎన్‌సీఆర్(ఢిల్లీ) ల తర్వాతే అత్యధికం మన దగ్గరే ఇన్వెంటరీ అధికంగా ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో
రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్టాక్‌లో అధికంగా ఉన్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న ఇళ్లు ఏకంగా 20,069 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 7.4 త్రైమాసికాలు పడుతుంది. ఇక, రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్లు 5,638 ఉన్నాయి. వీటి అమ్మకానికి ఏకంగా 10.4 త్రైమాసికాలు పడుతుంది. అఫర్డబుల్ ఇళ్ల కొనుగోలుదారులు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రూ.50 లక్షల కంటే తక్కువ ధర ఉండే ఇళ్ల వాటా గణనీయంగా తగ్గాయి. 2024 హెచ్–2తో పోలిస్తే ఈ విభాగం వాటా 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గగా.. రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల లాంచింగ్స్ వాటా 25 శాతం నుంచి 23 శాతానికి క్షీణించాయి.
ప్రీమియం యూనిట్లు తక్కువే..
ఇన్వెంటరీలో ప్రీమియం ఇళ్ల వాటా కాస్త తక్కువగానే ఉన్నాయి. రూ.1.2 కోట్ల ధర ఉన్న గృహాలు 18,825 ఉన్నాయి. రూ.2.5 కోట్ల ధర ఉన్న యూనిట్లు 8,468, రూ.5 నుంచి రూ.10 కోట్ల ధర ఉన్న ఇళ్లు 1,628, రూ.10 నుంచి రూ.20 కోట్ల ధర ఉన్నవి 92, రూ.20 నుంచి రూ.50 కోట్ల ధర ఉన్న యూనిట్లు 158 ఉన్నాయి.
38,403 ఇళ్ల విక్రయం..
2025లో నగర నివాస మార్కెట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. కస్టమర్లలో నమ్మకం, ధరల పెరుగుదల ఇందుకు ప్రధాన కారణం. గతేడాది హైదరాబాద్‌లో 38,403 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాది 2024తో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. ఇక, 2025లో నగరంలో కొత్తగా 40,737 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ప్రాజెక్ట్ లాచింగ్స్ కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడం, నియంత్రణ పరిమితుల కారణంగా 2024 హెచ్–2తో పోలిస్తే లాచింగ్స్ 7 శాతం మేర క్షీణించాయి.
2025లో హైదరాబాద్ కార్యాలయ సముదాయాలు వార్షిక లావాదేవీలు 1.14 కోట్ల చ.అ.లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అయితే ఆఫీసు స్పేస్ సప్లై పరిమితంగా ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి రేటు కారణంగా లావాదేవీలు పెరిగాయి.


