కోటి తారల వీణ... సినీ తెలంగాణ | CM Revanth Reddy Attends in Telangana Gaddar Film Awards 2024 | Sakshi
Sakshi News home page

కోటి తారల వీణ... సినీ తెలంగాణ

Jun 15 2025 6:10 AM | Updated on Jun 15 2025 8:16 AM

CM Revanth Reddy Attends in Telangana Gaddar Film Awards 2024

తారలు తళుకులీనాయి... నింగిలోని నక్షత్రాలు కూడా తొంగి చూశాయి. అశ్వత్థామలు, లక్కీ భాస్కర్‌లు, పుష్పరాజ్‌లు, ఇది చిన్న కథ కాదు అన్నట్టుగా మాదాపూర్‌ హైటెక్స్‌కు అరుదెంచారు. అలనాడు ఇంటింటా వెలిగిన జయప్రద, జయసుధ, సుహాసినిలను వేదిక మీద చూసి గృహిణిలు తెగ ముచ్చటపడ్డారు.

 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ‘దిల్‌’ రాజు ఈ వేడుకకు కర్త, కర్మలై శోభ తెచ్చారు. 

ఆటలు,  పాటలు, కళాప్రదర్శనలు...చూడ్డానికి వెండితెర చాలదు! అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ, రాజమౌళి...చుక్కల్లో చందమామలుగా అభిమానులను అలరించారు. ఇంతకాలం ఎదురుచూసిన సినీ అవార్డుల వేడుకకు తెలంగాణ ప్రభుత్వం పదింతలు అట్టహాసం కలిపి నభూతో అన్నట్టుగా నిర్వహించింది. చిత్రమాలికను చిత్తగించండి...


ఇది సినిమా అవార్డ్స్‌ గనక సరదాగా ఓ డైలాగ్‌ చెబుతా అంటూ... ‘‘ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా... గంగమ్మ జాతరలో యేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప..పుష్పరాజ్‌..అస్సలు తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలోని డైలాగ్‌ చెప్పి, అల్లు అర్జున్‌ అలరించారు. ‘‘ప్రతిష్ఠాత్మక తెలంగాణ గద్దర్‌ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ ఇనిషియేటివ్‌ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి భట్టిగారికి, ‘దిల్‌’ రాజుగారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. మై లవ్లీ డైరెక్టర్‌ సుకుమార్‌గారు లేక  పోతే ఈ అవార్డు సాధ్యమయ్యేది కాదు. డార్లింగ్‌... ఐ లవ్‌ యూ. ఈ అవార్డు ప్యూర్‌గా మీ విజన్‌. ‘పుష్ప’ నిర్మాతలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. రాజమౌళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే... మీరు ఆ రోజు ‘పుష్ప 1’ సినిమాను హిందీలో రిలీజ్‌ చేయమని చెప్పక  పోయి ఉంటే, ఈ రోజు ఇంతటి రేంజ్‌ ఉండేది కాదు. ధన్యవాదాలు సార్‌. ఇది నాకు చాలా స్పెషల్‌ అవార్డు. ‘పుష్ప 2’ గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం ఇస్తున్నాను. మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తాను. నా ఆర్మీ (ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ..)కి థ్యాంక్స్‌.
– నటుడు అల్లు అర్జున్‌

కళామతల్లి ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా గౌరవించి అవార్డులివ్వడం సంతోషం. ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సం పాదించుకున్నారు గద్దర్‌ అన్న. ఆయన పేరు శాశ్వతంగా నిలిచి  పోయేలా అవార్డులిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుని ప్రారంభించాం. ఎంతోమంది ఈ అవార్డుని  పొందారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ అవార్డు ఇస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్‌ కొడుకుగా నాన్నగారి అవార్డుని తీసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా నాకు ఇచ్చిన పది లక్షల నగదును బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పతిక్రి ఇచ్చినట్లు భావిస్తున్నాను. ఇందుకు రేవంత్‌ అన్నకి థ్యాంక్స్‌. 
– నటుడు నందమూరి బాలకృష్ణ 
(ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు)  

గద్దరన్న పేరు మీద ఈ అవార్డులు ప్రారంభించడం, సినిమా ఇండస్ట్రీ అందర్నీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ అవార్డులివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా గర్వకారణమైన మూమెంట్‌. మహబూబ్‌నగర్‌లో పుట్టిన పిల్లోణ్ని.. కాంతారావుగారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అనేది ఆయనకు నిజమైన నివాళి. ఈ అవార్డు తీసుకుంటున్న మొదటి వ్యక్తిని నేను అయినందుకు చాలా బాధ్యతగా భావిస్తున్నాను.. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. ఈ అవార్డు ఇచ్చినందుకు సీఎం రేవంత్‌ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్కగారికి, ‘దిల్‌’ రాజుగారికి థ్యాంక్స్‌’’.
– నటుడు విజయ్‌ దేవరకొండ 
(కాంతారావు ఫిల్మ్‌ అవార్డు)

పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు తెలుగు సినిమాకు అవార్డులు ఇచ్చుకోవడం జరుగుతోంది. 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరానికి బెస్ట్‌ ఫిల్మ్, సెకండ్‌ బెస్ట్‌ ఫిల్మ్, థర్డ్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ జ్యూరీ వారు సెలెక్ట్‌ చేశారు. బెస్ట్‌ ఫిల్మ్‌ను సెలెక్ట్‌ చేయడానికి జ్యూరీ అన్ని సినిమాలు చూసింది. నేషనల్‌ అవార్డ్‌  పొందిన సినిమాలు, రివ్యూస్‌ వచ్చిన సినిమాలు, కమర్షియల్‌గా బాగా ఆడిన సినిమాలు... ప్రతి సంవత్సరానికి మూడు సినిమాలుగా జ్యూరీ సెలెక్ట్‌ చేసింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్,   ప్రొడ్యూసర్‌కి ప్రతి సినిమాకి నాలుగు అవార్డులు ఇవ్వడానికి జ్యూరీ కమిటీ అడగడం, ప్రభుత్వం దాన్ని అంగీకరించి ఈరోజు ఆ అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. అలాగే 2024లో అద్భుతంగా, కళాత్మకంగా వచ్చిన ఎన్నో చిన్న సినిమాలను జ్యూరీ సెలెక్ట్‌ చేయడం, వారికి కూడా ఈ రోజు అవార్డులు ఇచ్చుకోవడం ఆనందకరం.
– ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ‘దిల్‌’ రాజు

ఎన్ని అవార్డులు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అనేది ఇండస్ట్రీకి మొదటి నుంచీ చాలా ప్రత్యేకం. ఈ అవార్డుల కోసం వేచి చూస్తున్నాం. సీఎం రేవంత్‌ రెడ్డిగారు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ‘దిల్‌’ రాజుగారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిగార్లకు థ్యాంక్స్‌. మమ్మల్ని  ప్రోత్సహించడానికి గద్దర్‌గారి పేరుమీద ఈ అవార్డులు పెట్టడం ఆనందంగా ఉంది. 
– దర్శకుడు సుకుమార్‌ 
(బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు)

గద్దర్‌గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డిగారి చేతుల మీదుగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీ దేవి ఆశీర్వచనంగా భావిస్తున్నాను. 
– సంగీత దర్శకుడు కీరవాణి

ఎక్కడెక్కడ ఏం సాధించినా మన నేల మీద, మన వాళ్ల మధ్య ఇలాంటి గౌరవం  పొందడం ఎప్పటికీ మరచి  పోలేని విషయం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌ రెడ్డిగారికి ధన్యవాదాలు. 
– రచయిత చంద్రబోస్‌

గద్దర్‌ పేరుపై ఫిల్మ్‌ అవార్డ్స్‌ను ఇవ్వడంతో  పాటు గద్దర్‌ ఫౌండేషన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 3 కోట్ల రూ పాయలను మంజూరు  చేశారు. గద్దర్‌ తనయుడు, గద్దర్‌ ఫౌండేషన్  చైర్మన్  సూర్యకిరణ్‌ గద్దర్‌ ఈ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా చెక్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్‌ గద్దర్‌ మాట్లాడుతూ– ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్‌ రెడ్డి అన్నగారికి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కగారికి, రాష్ట్ర మంత్రులు, అవార్డులు స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికీ అభినందనలు. రేవంత్‌ అన్నగారి ఆధ్వర్యంలో 31 జనవరి 2024న గద్దర్‌ ఫౌండేషన్ ని ప్రకటించడం జరిగింది. అదే విధంగా రేవంత్‌ రెడ్డిగారు ప్రామిస్‌ చేసినట్లుగానే ఈ అవార్డు వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు.

 నాన్నగారి సాహిత్యం, నాన్నగారి విలువలను ముందుకు తీసుకువెళ్లేందుకు  ప్రోత్సహిస్తూ గద్దర్‌ ఫౌండేషన్ కి రూ. 3 కోట్లు కేటాయించడాన్ని ఫౌండేషన్  తరఫున మేం స్వాగతిస్తున్నాం. ఇందుకు గద్దర్‌ ఫౌండేషన్  తరఫున కృతజ్ఞతలు సార్‌... ప్రతి సంవత్సరం మీరు చేపడుతున్న కల్చరల్‌‡అండ్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ సెంటర్‌కి స్థలం కేటాయిస్తున్నట్లుగా నెక్లెస్‌ రోడ్‌లో ప్రకటించారు సార్‌.. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం జయంతి ఉత్సవాలు (గద్దర్‌), సినిమా వేడుకలు కూడా అక్కడే చేసుకుందామని కోరుతూ, మరోసారి గద్దర్‌ ఫౌండేషన్  నుంచి మీకు, భట్టి అన్నకు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాను’’ అన్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’  పాటకు ఆస్కార్‌ అవార్డు సాధించిన సంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌లను ప్రత్యేకంగా సన్మానించారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement