రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు! | Chinese Businessman Spends ₹14 Crore to Visit 233 Countries in 33 Years | Sakshi
Sakshi News home page

రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు!

Sep 10 2026 8:27 AM | Updated on Sep 10 2026 8:27 AM

Chinese Businessman Spends ₹14 Crore to Visit 233 Countries in 33 Years

బీజింగ్: ప్రపంచాన్ని చుట్టిరావాలన్న లక్ష్యంతో ఓ చైనా వ్యాపారవేత్త 33 ఏళ్లపాటు ప్రయాణించి 233 దేశాలు సందర్శించారు. ఇందుకోసం సుమారు 15 లక్షల అమెరికన్‌ డాలర్లు (దాదాపు రూ.14 కోట్లు) ఖర్చు చేశారు. 53 ఏళ్ల చెన్‌ జిన్‌వెయ్‌ ఇటీవల పెరూలో పర్యటించి తన సుదీర్ఘ ప్రపంచ యాత్రను పూర్తి చేసుకుని జెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని ఝుజి స్వస్థలానికి చేరుకున్నారు. యంత్రాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న చెన్‌ 1993లో సింగపూర్‌, మలేసియా, థాయ్‌లాండ్‌ పర్యటనలతో అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించారు.

అప్పట్లో ఇంటర్నెట్‌ అందుబాటులో పెద్దగా లేకపోవడంతో ప్రపంచంలోని మరో వైపు జీవనం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. వ్యాపారం, కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టకుండా ప్రయాణాలు కొనసాగించారు. ఒక నెల ఇంటి వద్ద ఉండి, మరో నెల పర్యటించేవారు. ధ్రువ ప్రాంతాల వంటి క్లిష్టమైన ప్రదేశాలను కూడా ఎంచుకున్నారు.

2015 నవంబరులో అంటార్కిటికా చేరేందుకు చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. 2016 జనవరిలో మరోసారి ప్రయత్నించి అంటార్కిటికా చేరుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన  ద్వీప భూభాగం టోకెలావ్‌ను మాత్రం తన ప్రయాణాల్లో అత్యంత క్లిష్టమైన గమ్యస్థానంగా చెన్‌ పేర్కొన్నారు. 2019లో విస్తృత ఏర్పాట్లు చేసి న్యూజిలాండ్‌ చేరుకున్నప్పటికీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా టోకెలావ్‌ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి అక్కడి మారుమూల అటాల్స్‌పై అడుగుపెట్టారు.

ఆఫ్రికాలో ఉన్నప్పుడు మలేరియా బారినపడగా, గ్రీస్‌లో భూకంపాన్ని కూడా ఎదుర్కొన్నారు. సమస్య ఎదురైతే ముందుగా ప్రశాంతంగా ఉండి పరిష్కారం గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. పర్యాటక ప్రాంతాలను మాత్రమే చూసి వెళ్లకుండా స్థానిక సంస్కృతిలోనూ మమేకమయ్యేందుకు చెన్‌ ప్రయత్నించారు. 198 దేశాలకు చెందిన కరెన్సీలను సేకరించి వాటిని జు జియాకే మెమోరియల్‌ హాల్‌కు విరాళంగా ఇచ్చారు.

ప్రయాణం, వ్యాపారం రెండింటిలోనూ ఒడుదొడుకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందేనని ఆయన అన్నారు. ప్రయాణాలను వాయిదా వేస్తున్నవారికి  ‘సమయం ఎవరి కోసం ఆగదు’ అని సందేశమిచ్చారు. 33 ఏళ్ల పాటు సాగించిన ప్రపంచ యాత్ర పూర్తవడంతో ఇక పిల్లలు, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని చెన్‌ భావిస్తున్నారు. వివిధ పర్యాటక రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, వారి జీవిత కథలను ముద్రించాలని చెన్‌ జిన్‌వెయ్‌ యోచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement