నల్ల తామరకు డిజిటల్‌ కట్టడి! | Chilli Black Thrip Management Needed for Indias crops | Sakshi
Sakshi News home page

నల్ల తామరకు డిజిటల్‌ కట్టడి!

Published Wed, Dec 11 2024 11:16 AM | Last Updated on Wed, Dec 11 2024 11:17 AM

Chilli Black Thrip Management Needed for Indias crops

మిరప కాయల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన మిరప కాయ ఘాటైన రుచికి, రంగుకు ప్రసిద్ధి చెందింది. మన దేశం ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాల్లో 42% వాటా మిరపదే! మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్‌ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్‌. ఇది దేశీయ, అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేయగలదు. 

2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త రకం నల్ల తామర (త్రిప్స్‌ పార్విస్పినస్‌ – బ్లాక్‌ త్రిప్స్‌) జాతి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఇది ఆగ్నేయాసియా నుంచి మన దేశంలోకి వచ్చింది.  ఇది 2015లో బొప్పాయి పంటపై కూడా మన దేశంలో మొదటిసారిగా కనిపించింది. ఈ పురుగులు ఆకుల కణజాలాన్ని తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. పూరేకుల చీలికల వల్ల పండ్లు సెట్‌కావటం కష్టతరంగా మారుతుంది. 

ఇది మిరప ఆశించే నల్ల తామర పత్తి, మిర్చి, కంది, మినుము, మామిడి, పుచ్చ, తదితర పంటలను కూడా దెబ్బతీస్తుంది. 2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను బాగా దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాల్లో 85 నుంచి 100% వరకు పంట నష్టం చేకూరింది. పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను విపరీతంగా వాడటం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండాపోయింది. ఖర్చు పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండా ΄ోయింది. దీనికితోడు, నల్ల తామర సోకిన మిర్చికి మార్కెట్‌లో తక్కువ ధర పలకటంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు.

148 దేశాల్లో రైతులకు ఉచిత సేవలు
చిన్న కమతాల రైతులు ఆచరణాత్మక సలహా సమాచారాన్ని పొందడానికి విస్తరణ సేవలు, ఇతర వ్యవసాయ సేవలను అందించే వారిపై ఆధారపడతారు. ఈ రైతుల విస్తృత అవసరాలను తీర్చే సలహాదారులు సరైన నిర్ణయం తీసుకోవాలంటే వారు తగిన సమాచారం పొందాలి. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో డిజిటల్‌ సేవల సాధనాలు గణనీయంగా పెరిగాయి. 

అయినప్పటికీ, ఇవి రైతు సలహాదారులకు చాలా వరకు చేరువ కాలేకపోతున్నాయి. ఈ డిజిటల్‌ యుగంలో అనేక సంస్థలు డిజిటల్‌ సలహాలను, సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు, సరైన సమయంలో మొబైల్‌ ఫోన్‌లోనే అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని పొందుతున్నారు. 

ఇటువంటి డిజిటల్‌ సాధనాల్లో సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బయోసైన్సెస్‌ ఇంటర్నేషనల్‌ (సిఎబిఐ – కాబి) డిజిటల్‌ సాధనాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచాయి. 148 దేశాలలో ఈ సంస్థ రైతులకు ఉచితంగా డిజిటల్‌ సేవలు అందిస్తోంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్‌ సాధనాలు మనదేశంలో కూడా తెలుగు సహా అనేక భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇది హైదరాబాద్‌లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక ఐసిఎఆర్‌ అనుబంధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం కాబి కృషి చేస్తోంది. ఈ డిజిటల్‌ సాధనాలు ఉచితంగా అందించటం విశేషం. విజ్ఞానపరంగా పరీక్షించి, నిరూపితమైన, స్థానికంగా లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు ఇందులో పొందుపరిచారు. 

‘కాబి’ భాగస్వాములతో కలిసి ‘పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ డెసిషన్‌ గైడ్‌’ (పిఎండిజి)ని అభివృద్ధి చేసింది. పంటలను ఆశించిన నల్ల తామర పురుగులను గుర్తించడం, సేంద్రియ/ సురక్షితమైన యాజమాన్య పద్ధతులపై ఈ గైడ్‌ సలహాలను అందిస్తుంది. మన దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక జీవ రసాయనాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. 

మిర్చి సహా అనేక పంటలను ఆశిస్తున్న నల్ల తామర యాజమాన్యంపై రైతులు, విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, పరిశోధకులు ఈ క్రింద పేర్కొన్న డిజిటల్‌ సాధనాలు ఉపకరిస్తాయి. ‘కాబి’ ఉచితంగా అందిస్తున్న డిజిటల్‌ సాధనాలను మరింత సమర్థవంతంగా, త్వరగా ఉపయోగించడం ద్వారా నల్ల తామరకు సంబంధించి, యాజమాన్య మెలకువల గురించిన మరింత సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌లు ఉపయోగపడతాయి. 

1. బయో ప్రొటెక్షన్‌ పోర్టల్‌ : చీడపీడల నియంత్రణ, యాజమాన్యానికి స్థానిక బయోపెస్టిసైడ్స్‌ సమాచారం కోసం ఈ క్యూ.ఆర్‌. కోడ్‌ను స్కాన్‌ చేయండి.
2. క్రాప్‌ స్ప్రేయర్‌ యాప్‌ : పురుగుమందు/ బయోపెస్టిసైడ్‌ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఈ క్యూ.ఆర్‌.కోడ్‌ను స్కాన్‌ చేయండి.
3. ఫ్యాక్ట్‌షీట్‌ యాప్‌/నాలెడ్జ్‌ బ్యాంక్‌ : చీడపీడలకు సంబంధించి విస్తృతమైన సమాచారం కోసం ఈ క్యూ.ఆర్‌. కోడ్‌ను స్కాన్‌ చేయండి. 

తామర పురుగులు.. ఏడాదికి 8 తరాలు! 
తామర పురుగులు (త్రిప్స్‌) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. వీటిలో అనేక జాతులున్నాయి. ఇవి ఉల్లిపాయలు, టమోటాలు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా. ఎలాగంటే.. అవి పంటలకు హాని చేసే పురుగులను తింటాయి!

తామర పురుగులు మొక్కల బయటి పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. జాతులను బట్టి, జీవిత దశను బట్టి వివిధ రంగుల్లో ఉంటాయి. పిల్ల పురుగు (లార్వా) సాధారణంగా పారదర్శకంగా ఉంటాయి. చాలావరకు పెరిగిన తామర పురుగులు పొడవాటి సన్నని రెక్కలతో, అంచుల్లో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. 

గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే తామర పురుగులు సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. తామరపురుగుల జీవిత కాలం సాధారణంగా నెలన్నర. జాతులను, వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. 

ఆడ పురుగులు అతిథేయ (హోస్ట్‌) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా నాలుగు దశల్లో (రెండు ఫీడింగ్, రెండు నాన్‌–ఫీడింగ్‌) పెరిగి పెద్దది అవుతుంది. వెచ్చని వాతావరణంలో యుక్తవయస్సులో దీని పెరుగుదల వేగంగా ఉంటుంది. శీతాకాలంలో జీవించగలవు. అయితే ఈ సీజన్‌లో వాటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. 
తామర పురుగులు మొక్కల లోపల ద్రవాలను పీల్చుకొని బతుకుతాయి.  

పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశించి.. బయటి పొర లోపలికి చొచ్చుకుపోయి తింటాయి. త్రిప్స్‌ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడిని కోల్పోవడానికి కారణమవుతాయి. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల కంటే పెద్ద చెట్లు ఎక్కువ వీటి దాడికి తట్టుకోగలుగుతాయి. తామర పురుగులు మొక్కల వైరస్‌లను కూడా వ్యాప్తి చేస్తాయి. వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్‌ నెక్రోసిస్‌ ), టొమాటో–స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌.. ఇలా వ్యాపించేవే.

తామర పురుగుల యాజమాన్యం
 1. తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాలలో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి, పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. 
2. ఎండను పరావర్తనం చెందించే మల్చింగ్‌ షీట్‌లను లేదా ఇతర ఆచ్ఛాదన పదార్థాలను బెడ్స్‌ మీద పరచాలి. 
3. నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఇవి పురుగులతో నిండగానే మార్చుకోవాలి. 
4. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు (లేస్‌ వింగ్‌ బగ్స్‌) అతిచిన్న పైరేట్‌ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్‌)ను రక్షించుకోవాలి.
5. వేప నూనె 3% చల్లితే పంటలను తామర పురుగులు ఆశించవు. వీటి సంతానోత్పత్తి ప్రక్రియకు వేప నూనె అంతరాయం కలిగిస్తుంది.  
6. బవేరియా బాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామర పురుగులకు రోగాన్ని కలిగించి నశింపజేస్తాయి. ఇవి రైతులకు అందుబాటులో ఉన్నాయి. 

– డాక్టర్‌ జి. చంద్రశేఖర్, 
సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త,
సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్‌. 
మొబైల్‌: 94404 50994 

(చదవండి: నౌకాయానంలో వర్చువల్‌ వ్యవసాయ శాస్త్రవేత్త)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement