చెట్టినాడు ఘుమఘుమలు! | Sakshi
Sakshi News home page

చెట్టినాడు ఘుమఘుమలు!

Published Fri, Mar 1 2024 7:23 AM

Chettanadu Ghumaghumalu Method Of Cooking - Sakshi

'చెట్టినాడు రుచుల్లో కరివేపాకు ప్రధానం. తోడుగా కొబ్బరి కూడా ఉంటుంది. అన్నంలోకి అధరవుగానూ ఉంటాయి. సాయంత్రాలకు స్నాక్‌గా కుదురుతాయి. కడుపు నిండుగా ఆరోగ్యం మెండుగా ఉంటాయి.'

ఉర్లయ్‌ రోస్ట్‌..
కావలసినవి: బేబీ పొటాటోలు  – అరకిలో; మసాలా పొడి కోసం: ఎండుమిర్చి – 4; ధనియాలు – టీ స్పూన్‌; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; యాలక్కాయ – 1; లవంగం– 1; సోంపు – టీ స్పూన్‌; జీలకర్ర – టీ స్పూన్‌; మిరియాల పొడి– టీ స్పూన్‌; కొబ్బరి తురుము – 3 టేబుల్‌ స్పూన్‌లు; కరివేపాకు – 2 రెమ్మలు. పోపు కోసం: వేరుశనగ నూనె – 3 టేబుల్‌ స్పూన్‌లు; ఆవాలు – అర టీ స్పూన్‌; మినప్పప్పు – అర టీ స్పూన్‌; కరివేపాకు –  2 రెమ్మలు; ఉల్లిపాయలు – 2 (మీడియం సైజువి, తరగాలి); పచ్చిమిర్చి – 2 (చీరాలి); అల్లంవెల్లుల్లి తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు; పసుపు – అర టీ స్పూన్‌; మిరపొ్పడి– టీ స్పూన్‌; ధనియాల పొడి – రెండు టీ స్పూన్‌లు; ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌. తయారీ:

తయారీ..

 • బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టాలి
 • బాణలి వేడి చేసి మసాలా పొడి కోసం తీసుకున్న దినుసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేసి వేగి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టాలి
 • బాణలిలో ఆయిల్‌ వేడి చేసి ఆవాలు వేయాలి
 • వేగిన తర్వాత మినప్పప్పు, కరివేపాకు వేయాలి
 • ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి తరుగు వేసి వేగిన తర్వాత మసాలా పొడిని చల్లాలి
 • ఆ తరవాత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించి తొక్క తీసి సిద్ధంగా ఉంచిన బంగాళాదుంపలను వేసి మసాలా సమంగా పట్టేవరకు వేయించాలి
 • చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి
 • దీనిని ఈవెనింగ్‌ స్నాక్‌గానూ, అన్నంలోకి సైడ్‌ డిష్‌గానూ తినవచ్చు. 

గమనిక: ఉర్లయ్‌ అంటే బంగాళాదుంప. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బంగాళాదుంపను ఉర్లగడ్డ అంటారు. 

చెట్టినాడు ఫిష్‌ ఫ్రై..
కావలసినవి: చేప ముక్కలు – నాలుగు; నూనె – 2 టేబుల్‌ స్పూన్‌లు; టొమాటో ముక్కలు – పావు కప్పు; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు రసం– టేబుల్‌ స్పూన్‌; ఆవాలు – టీ స్పూన్‌; వెల్లుల్లి రేకలు – 8 (తరగాలి); అల్లం తరుగు – టీ స్పూన్‌; ధనియాలు – టీ స్పూన్‌; సోంపు గింజలు– టీ స్పూన్‌; మిరియాలు – పది; మిరపొ్పడి– టీ స్పూన్‌; పసుపు– టీ స్పూన్‌; ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి.

తయారీ..

 • చేప ముక్కలను శుభ్రం చేసి పక్కన పెట్టాలి
 • బాణలి వేడి చేసి కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, సోంపు, మిరియాలు వేయించి చల్లారిన తర్వాత పొడి చేయాలి
 • పొడి చేసేటప్పుడు కొద్దిగా నూనె వేయాలి
 • ఇప్పుడు చింతపండు రసం, టొమాటో ముక్కలు, అల్లం, పసుపు, మిరపొ్పడి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేయాలి
 • ఈ పేస్ట్‌ను ఒకసారి రుచి చూసి అవసరమైతే ఉప్పు మరికొంత కలుపుకోవాలి
 • ఇందులో మసాలా పొడిని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి
 • ఇరవై నిమిషాల తర్వాత బాణలిలో నూనె వేడి చేసి చేప ముక్కలను నూనెలో అమరేటట్లు ఒకదాని పక్కన ఒకటిగా పెట్టాలి
 • ఐదు నిమిషాల సేపు మీడియం మంట మీద కాలిన తర్వాత ముక్కలను జాగ్రత్తగా తిరగేయాలి
 • చేప ముక్కల అంచులు కరకరలాడే వరకు వేగిన తర్వాత తీసి నిమ్మకాయ ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.

నారియల్‌ సోయా పనీర్‌ వడ..
కావలసినవి: తురిమిన పనీర్‌– 4 కప్పులు; తురిమిన టోఫూ – 2 కప్పులు; అల్లం తరుగు – 3 టేబుల్‌ స్పూన్‌లు; పచ్చిమిర్చి తరుగు – టేబుల్‌ స్పూన్‌; వెల్లుల్లి తరుగు – 3 టేబుల్‌ స్పూన్‌లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; గరం మసాలా పొడి– టీ స్పూన్‌; దాల్చిన చెక్క పొడి– టీ స్పూన్‌; మిరియాల పొడి– టీ స్పూన్‌; కొబ్బరి పొడి– 5 టేబుల్‌ స్పూన్‌లు; మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌ – 4 టేబుల్‌ స్పూన్‌లు; బ్రెడ్‌ పొడి– 10 టేబుల్‌ స్పూన్‌లు; నూనె – వేయించడానికి తగినంత.

తయారీ..

 • టోఫూ, పనీర్‌లను పలుచని క్లాత్‌లో కట్టి నీరు కారిపోవడానికి కనీసం ఓ అరగంట సేపు ఉంచాలి
 • ఇప్పుడు పనీర్, టోఫూ తురుముని ఒక పాత్రలో వేసి మెత్తగా చిదమాలి
 • అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, గరం మసాలా, దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలపాలి
 • ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకుని పక్కన పెట్టాలి
 • మైదా లేదా కార్న్‌ఫ్లోర్‌లో తగినంత నీటిని పోసి జారుడుగా కలుపుకోవాలి
 • పనీర్‌ మిశ్రమం గోళీలను వడల్లా వత్తి కార్న్‌ప్లోర్‌ లో ముంచి ఆ తర్వాత బ్రెడ్‌ పొడిలో వేసి వడ అంతటికీ బ్రెడ్‌ పొడి పట్టేటట్లు రోల్‌ చేయాలి
 • ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఒక్కో వడను జాగ్రత్తగా నూనెలో వేసి తిరగేస్తూ రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసి టిస్యూ పేపర్‌ మీద వేయాలి
 • నూనె వదిలిన తర్వాత సర్వ్‌ చేయాలి.

ఇవి చదవండి: కలిసి మీరూ రాయండి

Advertisement
 
Advertisement