ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్‌ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!
బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్‌ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్‌డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.
కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.
కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితి
సాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్‌ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.
బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్‌డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.


