Chatting With Unknown Persons In Online, How To Protect Our Teens - Sakshi
Sakshi News home page

తెలియని వ్యక్తులతో చాటింగ్‌? ఆ ట్రాప్‌లో పడితే ప్రమాదమే

Published Sat, Jul 8 2023 10:48 AM

Chatting With Unknown Persons In Online, How To Protect Our Teens - Sakshi

సోషల్‌ మీడియా ద్వారా చిన్న చిన్న అట్రాక్షన్స్‌కు లోనై ‘లవ్‌’ పేరుతో ట్రాఫికింగ్‌ బారిన పడుతున్న అమ్మాయిల వ్యథలు ఇటీవల ఎన్నో ఉంటున్నాయి. ఈ సమస్య సమాజంలో ఎలాంటి పరిణామాలను సృష్టిస్తుందో, ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పే విషయాలను ‘మనం మాట్లాడుకోవాల్సిందే!’’ మనం మాట్లాడుకోవాల్సిందే! ఆన్‌లైన్‌ లవ్‌ మాయలో పడొద్దు!

‘ప్రియ (పేరుమార్చడమైనది) కనిపించక రెండు రోజులవుతోంది. ఏం జరిగిందో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కంప్లైంట్‌ ఇచ్చిన ఒక రోజులోనే ప్రియని తీసుకొచ్చి, తల్లిదండ్రులకి అప్పజెప్పారు పోలీసులు. వారు చెప్పిన విషయం విన్న తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ప్రియ వయసు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. 
కరోనా టైమ్‌లో ఆన్లైన్‌ క్లాసెస్‌ కోసం తండ్రి స్మార్ట్‌ ఫోన్‌ కొనిచ్చాడు. ఇప్పటికీ ఆ ఫోన్‌ తనే వాడుతోంది. మూడు నెలల క్రితం సోషల్‌ మీడియాలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరు విక్కీ. ఫ్రెండ్‌గా ఆమె మంచి చెడులు కనుక్కుంటూ, చాటింగ్‌ చేస్తూ ఉండేవాడు. మొదట వాయిస్‌ కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్‌ మాట్లాడుతుండేవాడు. అతను చెప్పే ప్రేమ కబుర్లు ప్రియకు బాగా నచ్చాయి.

అమ్మానాన్నలు ఎంతసేపూ చదువు చదువు అని అంటుంటారు. కానీ, వాటి గురించి విక్కీ మాట్లాడడు. ఒక్కరోజు విక్కీ చాట్‌ చేయకపోయినా, ఫోన్‌లో మాట్లాడకపోయినా ప్రియకు ఊపిరాడనట్లుండేది. విక్కీ ఏం చెప్పినా ప్రియ వెనకాడకపోయేది. రోజు రోజుకూ విక్కీ లేకపోతే తను బతకలేనని అనిపించసాగింది ప్రియకు. దీంతో ఓ రోజు విక్కీ చెప్పిన చోటుకు వెళ్లిపోవాలనుకుంది. దాంతో తల్లికి తెలియకుండా డబ్బులు తీసుకుని చెప్పకుండా వెళ్లిపోయింది. ఎవరికైనా చెబితే పరువు పోతుందనే భయం ఓ వైపు, కూతురు ఏమైందోననే భయం మరోవైపు వారిని కుదిపేసింది. తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్‌తో.. ప్రియ ముంబైకి చేరుకున్నట్టు కనిపెట్టిన పోలీసులు, ఆమెను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చారు. ఇలాంటి కథనాలు ఇటీవల మనం తరచూ వింటున్నాం.

పెద్ద శిక్ష 

♦ ఆన్‌లైన్‌లోనే కాదు బయట కూడా అమ్మాయిలను ట్రాప్‌ చేయడానికి చిన్న చిన్న ఆకర్షణ పథకాలను అమలు చేసేవారుంటారు. 
♦ మైనర్‌ అమ్మాయిలు/అబ్బాయిలు పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే కానుకలకు కూడా అట్రాక్ట్‌ అవుతుంటారు. 
♦ అవతలి వారు చెప్పేది నిజం అని నమ్మి, ఇంటిని వదిలి వెళ్లిపోతుంటారు. 
♦ ఇంట్లో ప్రేమ దక్కలేదనో, మరో కారణం చేతనో బయటి వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతుంటారు. 

అలవాట్లు రుగ్మతలు అవుతున్నాయి. రుగ్మతలుగా మారడం వల్లే నేరాలు కూడా భిన్నంగా మారిపోయాయి. ఇంటర్నెట్‌ వల్ల మంచి ఎంత పెరిగిందో, చెడు అంతకన్నా ఎక్కువ పెరిగింది. కొందరికి ఇదొక ఉపయోగకరమైన అడిక్షన్‌గా కూడా మారింది. ప్రతిదీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో అందరిలోనూ కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ కూడా పెరిగాయి. దేనికోసం మనం ముందుకు వెళుతున్నాం అనే స్పష్టత ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. షార్ట్‌కట్స్‌లో సంపాదించాలనే ఆలోచన వల్ల కూడా సైబర్‌ క్రైమ్స్‌ పెరుగుతున్నాయి. చూడకూడనివి ఎక్కువ చూడటం వల్ల మనస్తత్వాలు మారుతున్నాయి. ఫోన్‌ చూడద్దని, ఇంటర్నెట్‌ చూడద్దని, ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోమని చెప్పలేం. ఇవన్నీ మన జీవితంలో భాగమైనప్పుడు ఎలా డీల్‌ చేయాలో తెలుసుకోవడం మాత్రమే ఈ రోజుల్లో కుటుంబాలకు అవసరం.

ఈ రోజుల్లో మైనర్లు ఇంటర్నెట్‌లో ఎక్కువ ఉంటున్నారు. వారిని గమనిస్తూ, మంచి చెడులను చర్చిస్తూ ఉండాలి. ప్రేమ, పెళ్లి పేరుతోనో వెళ్లిపోయారని, వీటిని మిస్సింగ్‌ కేస్‌ కింద చూడం. కిడ్నాప్‌ కింద రిజిస్టర్‌ చేస్తాం. ట్రేస్‌ అవగానే రేప్‌ సెక్షన్స్‌ యాడ్‌ చేస్తాం. ఒక్కసారి పోక్సో కేసు కింద నమోదు చేసిన తర్వాత నేరస్తులకు శిక్ష భారీ ఎత్తున పడుతుంది. నాన్‌బెయిలబుల్‌ సెక్షన్స్‌ కింద కేస్‌ బుక్‌ అవుతుంది. మైనర్‌ని తీసుకువెళ్లి, పెళ్లి చేసుకున్నా అది చట్టరీత్యా నేరం. మైనర్‌ అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఎవరు మిస్‌ అయినా దానిని ట్రాఫికింగ్‌కు సంబంధించిన సెక్షన్స్‌ కింద కేస్‌ రిజిస్టర్‌ చేస్తాం. రూరల్, అర్బన్‌ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్‌లైన్‌ ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం.

– సుమతి, ఐపీఎస్, 
డీఐజీ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్, తెలంగాణ

ఇదొక వ్యసనం 
పరిచయం లేని వ్యక్తులు తమ పట్ల చూపే కన్‌సర్న్‌ని నిజమైన ప్రేమ అనుకొని భ్రమిస్తుంటారు కొందరు. ఈ మోహం ఆమె/ అతడి ఆరోగ్యం, భవిష్యత్తు సంబంధాలను ప్రభావితం చేస్తుంది. న్యూరలాజికల్‌ కెమికల్‌ అయిన ఫినైల్‌ ఇథైలమైన్‌ పెరగడం వల్ల ప్రేమభావాలు కలుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. మోహానికి గురైన వ్యక్తులు ఆల్కహాల్, డ్రగ్స్‌ వంటి అలవాట్లకు కూడా లోనవుతుంటారు. వారిలో ఆనందపు స్థాయులను పెంచుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇందుకు సినిమాలు, ఇంటర్నెట్‌ పోర్న్‌ సదుపాయాలు కూడా పిల్లల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇదొక వ్యసనం అని చాలామంది గుర్తించరు. ఆన్‌లైన్‌ రిలేషన్‌షిప్స్‌ తల్లిదండ్రులకు తెలియడం లేదు. పిల్లల ఆన్లైన్‌ నెట్‌వర్కింగ్‌ గురించి తల్లితండ్రులకు, కౌన్సెలింగ్‌ థెరపీ ద్వారా పిల్లల్లోనూ మంచి మార్పులు తీసుకురావచ్చు. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ‘లవ్, రిలేషన్‌షిప్స్‌’ డిజిటల్‌ వాడకం, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విషయాల పైన అవగాహన తరగతులు తీసుకోవాలి. 


– డాక్టర్‌ గిడియన్,డి–అడిక్షన్‌ థెరపిస్ట్‌
లివింగ్‌ సోబర్, హైదరాబాద్‌

– నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement