‘హెచ్‌ఐవీకి మందులేదు.. నివారణ ఒక్కటే మార్గం’ ఈ ప్రకటన ఆరోగ్యశాఖ ద్వారా మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది నయం కాని వ్యాధి అని అందరికీ తెలుసు. డాక్టర్ ఉన్నట్టుండి హెచ్‌ఐవీ లేకున్నా ఉందని రిపోర్టు ఇస్తే ఆ వ్యక్తికి ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇలాంటి ఘటనే వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వాసులో ఐదేళ్ల క్రితం జరిగింది.
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: మోడంపల్లెకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో 2020 అక్టోబర్, 14న ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది సూచన మేరకు ఆమెకు హెచ్ ఐవీ పరీక్ష చేయించగా అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రిపోర్టు ఇచ్చారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఆమెను వదిలేసి దూరంగా పారిపోయారు.
ఆమెకు నొప్పులు అధికం కావడంతో పాడుబడిన ఒక గదిలోకి తీసుకెళ్లి స్వీపర్ల చేత కాన్పు చేయించారు. నర్సింగ్ సిబ్బంది దూరంగా ఉండి సూచనలు ఇస్తుండగా స్వీపర్లు ఆమెకు సుఖప్రసవం చేయడంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
మళ్లీ చేయమని ప్రాధేయపడినా..
గర్భిణీకి హెచ్‌ఐవీ ఉందని రిపోర్టు వచ్చిన వెంటనే సంబంధిత సిబ్బంది ఆమె పేరును ఆన్‌లైన్ చేసి హెచ్‌ఐవీ జాబితాలో చేర్చారు. తన భార్యకు ఈ వ్యాధి రావడానికి అవకాశమే లేదని, మళ్లీ ఒకసారి పరీక్షలు చేయాలని భర్త వైద్యాధికారులను ప్రాధేయపడ్డా వారు కనికరించలేదు. దీంతో భర్త ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోగా హెచ్‌ఐవీ నెగిటివ్ వచ్చింది. ఇదే విషయాన్ని అతను ఆస్పత్రికి వెళ్లి అధికారులకు తెలిపాడు. తనకు ఈ వ్యాధి లేనప్పుడు భార్యకు ఎలా వస్తుందని వైద్యులను ప్రశ్నించాడు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న కారణంగా ఈ వ్యాధి బయట పడలేదని, కొన్ని నెలల తర్వాత నీకు కూడా వస్తుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో అతనికి పాలుపోలేదు.
రిపోర్టు ఆధారంగా ఏఆర్‌టీ అధికారులు ఆమెకు మందులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల వయసులో చిన్నారి చనిపోయింది. హెచ్‌ఐవీ ఉందనే కారణంతో ఆస్పత్రి సిబ్బంది తల్లిపాలు పాపకు తాగించవద్దని చెప్పారని, ఈ కారణంతోనే నీరసించి చనిపోయినట్లు పాప తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పసిపాప చనిపోయిన తర్వాత ఆమె ఏఆర్‌టీ మందులు వాడటం మానేసింది. ఆస్పత్రికి వచ్చి మందులు తీసుకెళ్లాలని సిబ్బంది ఫోన్లు చేసి చెప్పినా ఆమె వెళ్లలేదు. మందులు వాడటం మానుకున్న తర్వా త తన భార్య పూర్తి ఆరోగ్యంగా ఉండటాన్ని గమనించిన భర్త ఇక ఏఆర్‌టీ మందులు వాడొద్దని చెప్పాడు.
ఐదేళ్ల తర్వాత హెచ్‌ఐవీ లేదని పరీక్షల్లో నిర్ధారణ
మళ్లీ గర్భవతి అయిన ఆమెను భర్త ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఈసారి ఆమెను కాన్పు నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.ఈ ప్రక్రియలో భాగంగా హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు 2025 ఫిబ్రవరి, 25న సుఖప్రసవం చేయగా ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ప్రైవేట్ హాస్పిటల్‌లో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా భర్త గతేడాది మార్చి నెలలో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వరుసగా పలుమార్లు పీజీఆర్‌ఎస్‌లో కంప్లైంట్ చేస్తూ వచ్చాడు.
ఎట్టకేలకు అతడి ఫిర్యాదును ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయడంతో ఆస్పత్రి అధికారులు పిలిపించి మళ్లీ హెచ్‌ఐవీ పరీక్షలు చేయగా అతడి భార్యకు నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. హెచ్‌ఐవీ లేదని నిర్ధారణ అయిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి ఆన్‌లైన్‌లో ఉన్న తన భార్య పేరును తొలగించాలని కోరినా అధికారులు వినిపించుకోలేదని భర్త తెలిపాడు. దీనిపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ఐదేళ్లుగా బంధు వుల వద్ద, వీధిలో తలెత్తుకోలేక జీవించామని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత వైద్యాధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టు ఆధారంగా..
పాజిటివ్ రిపోర్టు ఆధారంగా ఆన్‌లైన్ చేసి మందులు ఇవ్వడం అనేది మా బాధ్యత. మందులు ఇచ్చిన తర్వాత ఆయా వ్యక్తులు వాడేలా మా సిబ్బంది ఫోన్లు చేస్తూ పర్యవేక్షిస్తుంటారు. నెగిటివ్ వచ్చిన తర్వాత రిపోర్టు తీసుకొని ఆమె మా వద్దకు రాలేదు. ఆరు నెలల క్రితమే ఏఆర్‌టీ నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్లు పోకుండా పేరు బ్లాక్ చేశాం. ఆన్‌లైన్‌లో ఆమె పేరు తొలగింపు కోసం పైఅధికారులకు విన్నవించాం.
:::సూర్యనాగలక్షి్మ, ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్, ప్రొద్దుటూరు.


