చేంజ్‌ మేకర్‌.. సత్య, వేలమందిలో ఒకరిగా! | Changemaker Satya Kumari Wunnava Awarded The South India Women Achievers Award 2025, Interesting Details Inside | Sakshi
Sakshi News home page

చేంజ్‌ మేకర్‌.. సత్య, వేలమందిలో ఒకరిగా!

Jul 19 2025 12:27 PM | Updated on Jul 19 2025 12:43 PM

Changemaker Satya Kumari Wunnava awarded the South India Women Achievers Award 2025

మహిళా సాధికారతే ఆమె లక్ష్యం 

సెల్ఫ్‌ డిఫెన్స్‌.. సోషల్‌ జస్టిస్‌.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై అవగాహన 

సౌత్‌ ఇండియా వుమెన్‌ అచీవర్స్‌–2025 అవార్డు గెలుచుకున్న సత్యకుమారి

డాబాగార్డెన్స్‌: పది మందికి సేవ చేయాలని.. సమాజంలో అట్టడుగున ఉన్న పిల్లలు సామాజికంగా ఎదగాలన్నదే ఆమె తపన.. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు సమాజంలో రాణించాలని.. ధైర్యంగా నిలబడాలన్నదే తన లక్ష్యం. చదివింది డిగ్రీ. తల్లిదండ్రులు రేషన్‌ డిపో నడుపుతున్నారు. తనదైన శైలిలో ఎంతో మంది పాఠశాల పిల్లలు.. కళాశాల విద్యార్థులకు సోషల్‌ జస్టిస్‌.. సెల్ఫ్‌ డిఫెన్స్‌.. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌.. ఉమెన్‌ సేఫ్టీపై అవగాహన కలిపిస్తూ వారంతా రాటుదేలేలా తీర్చిదిద్దుతున్నారు ఉన్నవ వెంకట సత్యకుమారి. ఇటీవల చెన్నైలో నిర్వహించిన సౌతిండియా ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డు–2025 గెలుచుకుని మరెంతో మంది మగువలకు స్ఫూర్తిగా నిలిచారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉన్నవ సత్యకుమారి డిగ్రీ వరకు చదివారు. అక్కయ్యపాలెంలో నివాసముంటున్నారు. రేషన్‌ డిపో నడిపే తల్లిదండ్రులతో పాటు ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సోదరుడు ఉన్నారు. ఈ నెల 9న చెన్నైలోని ఎంసీసీ స్కూల్‌ ఆడిటోరియంలో నిర్వహించిన సౌత్‌ ఇండియా వుమెన్‌ అచీవర్స్‌ అవార్డుల కార్యక్రమంలో సత్యకుమారి ఛేంజ్‌మేకర్‌ విభాగంలో నామినేట్‌ అయ్యారు. ఆడపిల్లలు నిస్సందేహంగా సబలలని.. వారికి అవకాశం ఇచ్చి చూస్తే అద్భుతాలు సాధిస్తారని నిరూపించేలా సత్యకుమారి ఎంతో మంది పాఠశాల.. కళాశాలల విద్యార్థినులతో నిరూపించారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్, సెల్ఫ్‌ డిఫెన్స్‌ వంటి అంశాలను వారికి బోధించి చక్కటి ఫలితాలు సాధించిన నేపథ్యంలోనే ఆమెను ఈ అవార్డు వరించింది. సత్యకుమారి ప్రతిభను ట్వెల్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్, వ్యవస్థాపకుడు దీపక్‌ టాటర్‌ జైన్‌ నాయకత్వంలోని ఎంపిక కమిటీ గుర్తించింది. సివా పేరిట మహిళల సాధికారత, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళల్ని గుర్తించి అవార్డులు అందజేసే క్రమంలో సత్యకుమారిని కూడా గుర్తించి అవార్డుతో గౌరవించింది.

ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!
 

60 వేల దరఖాస్తులు రాగా.. 
సౌత్‌ ఇండియా వుమెన్‌ అచీవర్స్‌ అవార్డ్‌–2025కి దేశవ్యాప్తంగా 60 వేల దరఖాస్తులు అందాయి. సమాజ సేవ.. మహిళల సాధికారత.. వివిధ రంగాల్లో రాణిస్తున్న 300 మంది మహిళలను గుర్తించి అవార్డులు అందజేశారు. వీరిలో విశాఖ నగరానికి చెందిన ఉన్నవ వెంకట సత్యకుమారి చేంజ్‌ మేకర్‌ విభాగంలో తను చేస్తున్న సమాజ సేవకు గుర్తింపు లభించింది.

సేవ చేయడంలో సంతోషం  
అవార్డు సాధించిన సత్యకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ మన కాళ్ల మీద మనం బతకడం ముఖ్యం. అక్కడితో ఆగక.. మనం నేర్చుకున్న విద్య.. సంస్కృతి వంటివి పది మందికి తెలపడం మరింత సంతోషాన్నిస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉమెన్‌ సేఫ్టీ.. సోషల్‌ జస్టిస్, ఫిజికల్‌ ఫిట్‌నెస్, సెల్ఫ్‌ డిఫెన్స్‌పై అవగాహన కలిపించాను. కలిపిస్తున్నాను కూడా. నగరంలోని ప్రేమ సమాజం వృద్ధులకు సోషల్‌ జస్టిస్‌పై అవగాహన కల్పించాను. ప్రతి ఒక్కరూ తాము ఎదుగుతూ.. పది మందికి సేవ చేయాలనే తపన ఉండాలని, మనకు తెలిసిన విద్యను బడుగు.. బలహీన వర్గాల పిల్లలకు అందజేస్తే వారు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా మహిళలు, బాల బాలికలకు సెల్ప్‌ డిఫెన్స్‌ ముఖ్యమని, నానాటికీ పెరుగుతున్న దాడులను ఎదుర్కోవాలంటే సేఫ్టీ, సోషల్‌ జస్టిస్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తో పాటు సెల్ఫ్‌ డిఫెన్స్‌పై అవగాహన ఉండాలని అభినందించారు. తను చేస్తున్న అవగాహన.. సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఏడాది ఏప్రిల్‌ 27న దేశ రాజధాని న్యూఢిల్లీలో భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధా చంద్రన్, మిస్‌ ఇండియా మంజీర చేతుల మీదుగా ‘నారీ శక్తి’ అవార్డు అందుకున్నానని తెలిపారు. అలాగే విశాఖ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ప్రశంసలు లభించాయని, తాజాగా చెన్నైలో జరిగిన సౌత్‌ ఇండియా వుమెన్‌ అచీవర్స్‌ అవార్డు–2025ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నట్టు సత్యకుమారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement