‘మనసే అందాల బృందావనం’ అనేది కవి మాట.అయితే ఆ బృందావన అందాలు, ప్రశాంతతకు చాలామంది మహిళలు దూరం అవుతున్నారు. వ్యక్తిగత సమస్యల నుంచి పని ప్రదేశాలలో ఒత్తిడి వరకు.... రకరకాల కారణాలు మహిళల్లో మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా డిప్రెషన్‌తో బాధ పడుతున్నారు. దాదాపు 40 శాతం మంది మహిళలు కుంగుబాటు(డిప్రెషన్) సమస్యను ఎదుర్కొంటున్నారు.
భారతదేశంలో 1.3 మిలియన్‌ల మంది మహిళలపై సర్వే నిర్వహించి, వారి మానసిక ఆరోగ్య సమస్యలపై ‘అన్వీలింగ్ ది సైలెంట్ స్ట్రగుల్’ పేరుతో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నివేదిక విడుదల చేసింది.
47 శాతం మంది మహిళలు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి వారి ఐక్యూని, జ్ఞాపకశక్తిని (కాగ్నెటివ్ హెల్త్) ప్రభావితం చేస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులలో 42 శాతం మందిలో కుంగుబాటు, ఆందోళన లక్షణాలు కనిపించాయి.
80 శాతం మంది మహిళలు ప్రసూతి సెలవులు, కెరీర్ పురోగతికి సంబంధించి వివక్ష ఎదుర్కొంటున్నారు.
దాదాపు 38 శాతం మంది మహిళలు కెరీర్, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన విషయాలలో ఆందోళన చెందుతున్నారు.
ప్రతి ఇద్దరు భారతీయ మహిళలలో ఒకరు దీర్ఘకాలిక ఒత్తిడితో బాధ పడుతున్నారు.
ఆహార సంబంధిత రుగ్మతలు(ఈటింగ్ డిజార్డర్స్) కేసులలో 63.3 శాతం మహిళలు ఉండగా, 36.7 శాతం మంది పురుషులు ఉన్నారు.
భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలలో 18–38 సంవత్సరాల వయసు వారు ఎక్కువగా ఉంటున్నారు.
‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్’ నివేదిక ప్రకారం నిరాశ, నిస్పృహలకు సంబంధించిన రుగ్మతలు 29.8 శాతం, ఆందోళనకు సంబంధించిన రుగ్మతలు 27.9 శాతం పెరిగాయి.
(చదవండి: అధిక ఆదాయం.. కానీ ఆనందం నిల్..!)


