ఒక ప్రేమ.. రెండు జీవితాలు 

Bollywood Hero Sanjeev Kumar Love Story In Sakshi Funday

‘పెళ్లిళ్లు స్వర్గంలోనే అవుతాయి అంటారు. కాని సంజీవ్‌ కుమార్‌కు జతనివ్వడం మరిచిపోయాడు దేవుడు. అందుకే అవివాహితుడిగా మిగిలిపోయాడు’ అంటుంది సులక్షణా పండిత్‌. సంజీవ్‌ కుమార్‌ను ప్రేమించిన ఆమె కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అతని జ్ఞపకాలతో సహజీవనం చేస్తూ! 

సులక్షణా పండిత్‌ తొలి చిత్రం ‘ఉల్‌ఝన్‌’. అదీ సంజీవ్‌ కుమార్‌తోనే. ఆ సినిమా సెట్స్‌ మీదే కుమార్‌తో ప్రేమలో పడింది ఆమె. అతని ప్రశాంత గాంభీర్యం సులక్షణాకు నచ్చిన లక్షణం. తనే చొరవ తీసుకొని కుమార్‌ను పలకరించేది. అప్పటికే హేమమాలిని తిరస్కారంతో ముక్కలైన కుమార్‌ మనసు సులక్షణా మాటలతో సాంత్వన పొందసాగింది. సినిమా పూర్తయ్యేలోపు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

అతని మీదున్న తన ప్రేమను ప్రస్తావించాలని ఆమె అనుకున్నప్పుడల్లా.. హేమ గురించి తాను కన్న కలలను, పడుతున్న వేదనను వెలిబుచ్చుకునేవాడు సంజీవ్‌ కుమార్‌. ఇలా ఎప్పటికప్పుడు ఆమె తన మనసులో మాట చెప్పాలని సంసిద్ధమవడం.. అతను తన బాధను ఏకరువు పెట్టడం.. చాలా కష్టంగా ఉండేది సులక్షణాకు. అయినా సహానుభూతితో అర్థం చేసుకునేది. తాను వినడం వల్ల అతను తేలికపడతాడు అని భావించి.  ‘‘హేమాజీని పిచ్చిగా ప్రేమించి బద్దలైన గుండె కదా.. మామూలవడం అంత తేలిక కాదు. ఆ ఫేజ్‌లోంచి బయటపడగానే అతని మీదున్న నా ఫీలింగ్స్‌ను చెప్పాలనుకున్నా. కాని నాకు ఆ చాన్సే రాలేదు’’ అని చెప్పింది సులక్షణా.

ఆమె.. సంజీవ్‌ కుమార్‌ కోసం పడుతున్న తపన చూసి ‘ఉల్‌ఝన్‌’ సినిమాలోని సహ కళాకారులంతా అది సంజీవ్‌ కుమార్‌ గ్రహిస్తే బాగుండని అనుకునేవాళ్లు. సులక్షణాతో అనే వాళ్లు కూడా ‘ఆ మనిషికి అర్థం కావడం లేదు కాని, అతనికి నీ తోడు చాలా అవసరం. అతణ్ణి మునుపటి మనిషిలా మార్చగలిగేది నువ్వే’ అని. ‘ఉల్‌ఝన్‌’ సినిమాతో తెర మీది వాళ్ల కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. తర్వాత ఆరు సినిమాల్లో నటించి హిట్‌ పెయిర్‌ అనే కాంప్లిమెంట్‌ తెచ్చుకున్నారు. ఆ ప్రశంసను జీవితంలోనూ పొందాలనుకుంది సులక్షణా.. సంజీవ్‌ కుమార్‌తో వైవాహిక బంధంలోకి  అడుగుపెట్టి. ఆమె తనను ఇష్టపడుతున్న విషయం సంజీవ్‌ మనసు దాటేం పోలేదు. అలాగని అతను మనసూ పెట్టలేదు.

కారణం.. ఎంత ప్రయత్నించినా హేమమాలినిని మర్చిపోలేకపోవడమే. తాగినా.. తాగకపోయినా అతని మెదడంతా హేమనే. అప్పటికే హార్ట్‌ ఎటాక్‌ కూడా వచ్చింది అతనికి. మందుకు దూరంగా ఉండమన్నారు డాక్టర్లు. ఇంక లాభంలేదని రేయింబవళ్లు అతణ్ణి కాపుకాచుకోసాగింది సులక్షణా. ఆ సందర్భంలోనే ఒకసారి చెప్పింది కూడా ‘మీరంటే నాకు ఇష్టం... నా ప్రాణం కంటే కూడా. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది’ అని.

నవ్వి ఆమె తలనిమిరాడు సంజీవ్‌ కుమార్‌. ‘నిజం.. మీరులేక నేనుండలేను’ అంది కళ్ల నిండా నీళ్లతో. ‘ఈ జీవితానికి హేమాయే. నా మనసులో ఆమెకు తప్ప ఎవరికీ చోటు లేదు. నా మీద ప్రాణం పెట్టుకొని నీ జీవితాన్ని వృథా చేసుకోవద్దు.. ప్లీజ్‌’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు సంజీవ్‌ కుమార్‌.పొగిలి పొగిలి ఏడ్చింది సులక్షణా. అయినా అతని చేయి వదల్లేదు. రోజురోజుకీ సంజీవ్‌ ఆరోగ్యం క్షీణించసాగింది. కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేసింది ఆమె. ‘‘నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ చూసి సంజీవ్‌జీని ట్రీట్‌ చేస్తున్న డాక్టర్‌ నాతో అన్నాడు ఓ రోజు.. ‘ఈ మనిషిని అంతలా పట్టించుకోకు. తర్వాత నువ్వు తేరుకోలేవు. అతనికి రెండేళ్లే టైమ్‌ ఉంది’ అని. ఆ మాట నాకు మరో షాక్‌’’ ఓ ఇంటర్వ్యూలో సులక్షణా పండిత్‌

డాక్టర్లు, సులక్షణా ఎంత చెప్పినా మందుతో దోస్తీ మానలేదు సంజీవ్‌ కుమార్‌. హేమమాలిని తలపులను తప్పించుకోవడానికి మత్తే మందనుకున్నాడు. మానసికంగా పెనవేసుకున్న ఒంటరితనాన్ని జయించలేకపోయాడు. శారీరక ఆరోగ్యమూ  క్షీణించింది. అమెరికా వెళ్లి గుండె ఆపరేషన్‌ చేయించుకొని వచ్చాడు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయని షూటింగ్స్‌లో పాల్గొన్నాడు. మానసిక ఒత్తిడి, శారీక శ్రమ.. అతణ్ణి కోలుకోనివ్వలేదు. యాభై ఏళ్లయినా నిండకుండానే ‘గుడ్‌ బై’ చెప్పేశాడు ఈ లోకానికి.

సంజీవ్‌ కుమార్‌ మరణంతో కుంగిపోయింది సులక్షణా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చాలా ఏళ్లు బయట ప్రపంచంతో దాదాపుగా సంబంధాలు తెంచేసుకుంది. చెల్లి విజేతా పండిత్‌ సహాయంతో కోలుకుంది. ఇప్పటికీ తన గదికే పరిమితమై ఉంటుంది ఎక్కువగా.. సినిమాలు చూస్తూ, పాటలు వింటూ.. కవిత్వం రాస్తూ!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top